కొత్త కోవెల

ABN , First Publish Date - 2020-12-10T10:00:59+05:30 IST

కొత్త పార్లమెంటు భవననిర్మాణానికి ప్రధాని నరేంద్రమోదీ నేడు శంకుస్థాపన చేయబోతున్నారు. నిజానికి ఇటువంటి ఘట్టాలు...

కొత్త కోవెల

కొత్త పార్లమెంటు భవననిర్మాణానికి ప్రధాని నరేంద్రమోదీ నేడు శంకుస్థాపన చేయబోతున్నారు. నిజానికి ఇటువంటి ఘట్టాలు ప్రతీ భారతీయుడిలోనూ భావోద్వేగాలు రగిలించి, దేశవ్యాప్తంగా ఒక పండుగవాతావరణాన్ని సృష్టించగలవి. కానీ, ప్రధాని భూమిపూజ కార్యక్రమం సుప్రీంకోర్టు విధించిన పలు పరిమితుల మధ్య జరుగుతున్నది. నిర్మాణాలూ కూల్చివేతలే కాదు, కనీసం ఒక చెట్టును కూడా అక్కడనుంచి కదల్చాడానికి వీల్లేదన్న విస్పష్టమైన ఆదేశంతో, భూమిపూజకు మాత్రమే సర్వోన్నత న్యాయస్థానం అనుమతించింది. ‘సెంట్రల్‌ విస్టా’ ప్రాజెక్టు విషయంలో మోదీ ప్రభుత్వం దూకుడుగా పోతున్నదని న్యాయస్థానం భావన. ఈ భారీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో వేలాది పిటిషన్లు దాఖలు కావడం, న్యాయస్థానమే ఈ అంశాన్ని సూమోటోగా స్వీకరించడం తెలిసిందే. తీర్పు వచ్చేవరకూ విధానపరమైన ప్రక్రియలకు మాత్రమే పరిమితమవుతామని హామీ పడుతూ కేంద్ర ప్రభుత్వం ఈ భూమిపూజకు సిద్ధపడుతున్నది. 


కోర్టు పేచీలో ఉన్న నిర్మాణానికి ఇంత హడావుడి భూమిపూజ కంటే, తగాదాలు తేలేవరకూ ఆగిఉంటే బాగుండేది. కానీ, నిర్మాణాన్ని రెండేళ్ళలో పూర్తిచేయాలన్న లక్ష్యం ప్రభుత్వాన్ని నిలువనీయడం లేదు. కొత్త పార్లమెంటు భవనాన్ని 2022 ఆగస్టులోగా పూర్తిచేసి, 75వ స్వాతంత్రదినోత్సవ వేడుకలను కొత్త భవనంలో ఘనంగా జరపాలన్నది ప్రభుత్వ సంకల్పం. కొత్త పార్లమెంటు ఇంద్రభవనంలాగా ఉండబోతున్నదంటూ ప్రభుత్వం ఇప్పటికే సమస్త వివరాలూ తెలియచెప్పింది. ఇప్పటికంటే మరింత ఎక్కువ సంఖ్యలో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు కూర్చునేందుకు వీలుగా, నాలుగేళ్ళ తరువాత జరగబోయే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను కూడా దృష్టిలో ఉంచుకొని సీటింగ్‌ ఏర్పాట్లు ఉన్నాయి. ఉమ్మడి సమావేశాల్లో సైతం సభ్యులు సర్దుకోవాల్సిన అవసరం లేని రీతిలో ఏర్పాట్లు ఉండబోతున్నాయి. 


అసలే కొవిడ్‌ కష్టాల్లో ఉన్నాం, సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టు ఉపసంహరించుకోండి అని నెలల క్రితమే విపక్షాలు ప్రభుత్వాన్ని కోరాయి. కొత్త పార్లమెంటు భవనం అవసరమా కాదా అన్న ప్రత్యేక అధ్యయనాలు అక్కరలేదనీ, సాక్షాత్తూ పార్లమెంటు సభ్యులే తగినంత ఆఫీస్‌ స్పేస్‌ లేదనీ, వ్యక్తిగత చాంబర్లూ ఆధునిక సౌకర్యాలూ లేవని ఫిర్యాదులు చేస్తున్నారని ప్రభుత్వం చెబుతోంది. పాత భవనం ప్రమాదకరంగా పరిణమిస్తున్నదనీ, కొత్తది కడితే భద్రతతో పాటు ఏడాదికి వెయ్యికోట్ల వృధాఖర్చును కూడా మిగల్చవచ్చునని ప్రభుత్వం న్యాయస్థానం ముందు ఏవో లెక్కలు చెప్పింది. కొత్త పార్లమెంటు భవనం నిర్మాణానికి దాదాపు వెయ్యికోట్లు ఖర్చవుతుందన్నది అటుంచితే, ఒక కామన్‌ సెంట్రల్‌ సెక్రటేరియట్‌, రాజ్‌పథ్‌ పునరుద్ధరణ, ఉపరాష్ట్రపతి, ప్రధాని కార్యాలయాలు, నివాసాలు, ఇతరత్రా మెరుపులూ మెరుగులతో కూడిన మొత్తం సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టుకు ఎన్నివేల కోట్లు ఖర్చు అవుతుందో ప్రభుత్వం అధికారికంగా చెప్పడం లేదు. 20వేల కోట్ల వరకూ వ్యయం కాబోతున్న ఈ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం నలుగురినీ కలుపుకొనిపోయి ఉంటే బాగుండేది. ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని ఏకాభిప్రాయ సాధనతో కాక ఏకపక్షంగా, అందునా అప్పటికే దెబ్బతిని ఉన్న ఆర్థికరంగాన్ని కొవిడ్‌ మరింత చావుదెబ్బతీసిన తరుణంలో సంకల్పించడం సముచితంగా కనిపించడం లేదు. ఎంతటి ఆర్థికకష్టంలో కూడా చాలాదేశాలు  వాక్సిన్‌ సేకరణ విషయంలో ఏ మాత్రం వెనుకంజ వేయకుండా, అవసరానికి మించి ఆర్డర్లు పెడుతూ దేశ ప్రజలందరికీ టీకా వేసేందుకు సిద్ధపడుతున్నాయి. భారత ప్రభుత్వానికి మాత్రం ప్రజలందరికీ టీకా అందించే ఉద్దేశం లేకపోయింది. ఇందుకు అధికారులు, నాయకులు ఏ కారణాలు చెబుతున్నప్పటికీ, ఆర్థిక వనరులే అసలు కారణమన్నది సుస్పష్టం. కరోనా దెబ్బకు అనేక నెలలుగా మానసికంగా, ఆర్థికంగా చితికిపోయి ఉన్న సామాన్యుడిలో రోగభయాన్ని తరిమికొట్టి బతుకుధైర్యాన్ని అందించేందుకు టీకా ఉపకరిస్తుంది. దానికి పూచీపడకుండా కొత్త పార్లమెంటు భవనాన్ని ఆత్మనిర్భరతకు ప్రతీకగా పాలకులు చూడటం విచిత్రంగా ఉంది. కొత్త ప్రజాస్వామ్య దేవాలయంగా ఈ నిర్మాణాన్ని అభివర్ణించదల్చుకుంటే అది ప్రజలందరూ కష్టాలు తీరి సంతోషంగా ఉన్నకాలంలో మొదలైతే మరీ బాగుంటుంది. అప్పటివరకూ ఉన్న భవనాలకు మెరుగులు దిద్దుకుంటూ, దేశం ఆర్థికంగా కోలుకున్నాక, వివాదాలన్నీ తీరిపోయాక, 75వ స్వాతంత్ర్య వార్షికోత్స శుభ తరుణంలో సైతం ఈ బృహత్‌ నిర్మాణాన్ని చేపట్టవచ్చు.

Updated Date - 2020-12-10T10:00:59+05:30 IST