కొత్తగా ‘సాగు’తూ..

ABN , First Publish Date - 2021-01-25T04:57:33+05:30 IST

సంప్రదాయ సేద్యం స్థానంలో రైతులు వినూత్న వ్యవసాయం చేస్తున్నారు. యాసంగి సీజన్‌లో వైరా రిజర్వాయర్‌ ఆయకట్టులో రైతులు పూర్వపు నాట్లకు భిన్నంగా వెదజల్లే పద్ధతి, డ్రమ్‌సీడర్‌ సేద్యాన్ని చేపట్టారు.

కొత్తగా ‘సాగు’తూ..
విత్తనాలు వెదజల్లుతున్న రైతులు

యాసంగిలో వెదజల్లే విధానంపై రైతుల ఆసక్తి

వైరా, జనవరి 24: సంప్రదాయ సేద్యం స్థానంలో రైతులు వినూత్న వ్యవసాయం చేస్తున్నారు. యాసంగి సీజన్‌లో వైరా రిజర్వాయర్‌ ఆయకట్టులో రైతులు పూర్వపు నాట్లకు భిన్నంగా వెదజల్లే పద్ధతి, డ్రమ్‌సీడర్‌ సేద్యాన్ని చేపట్టారు. రైతుల ఆలోచనల్లో వచ్చిన మార్పుతో వ్యవసాయశాఖ అధికారులు వారిని ప్రోత్సహిస్తున్నారు. వర్షాకాలం వ్యవసాయ సీజన్‌లో ప్రభుత్వ ఆదేశాల మేరకు దొడ్డురకం వరికి బదులు సన్నరకాల వరిసాగుచేశారు. అయితే అధిక వర్షాలు, చీడపీడలు, తెగుళ్లతో రైతులకు విపరీతంగా పెట్టుబడులయ్యాయి. అంతేకాకుండా దిగుబడులు భారీగా తగ్గాయి. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసినప్పటికీ గన్నీసంచులు, లారీల కొరత, మిల్లర్ల కొర్రీలు, ధాన్యం తరుగు కింద భారీగా కోత విధించటం వంటి కారణాలతో కూడా రైతులు నష్టపోయారు. ఇదే తరుణంలో ఈ ఏడాది సాగర్‌లో నీటిమట్టం ఆశాజనకంగా ఉండటంతో యాసంగి సాగుకు నీళ్లివ్వటానికి ప్రభుత్వం నిర్ణయించింది. దాని ఫలితంగానే సాగర్‌జలాల ఆధారంగా వైరా రిజర్వాయర్‌ కుడి, ఎడమకాల్వల ఆయకట్టులో కూడా యాసంగి సాగు చేపట్టారు. గతంలో కంటే ఈ ఏడాది యాసంగి సాగు దాదాపు నెలరోజులకుపైగా ఆలస్యమైంది. ఇప్పటికీ సగం సాగు కూడా పూర్తికాలేదు. వర్షాకాలం సీజన్‌ వలన వచ్చిన నష్టాలతో రైతులు అయిష్టంగానే యాసంగి సాగుకు మొగ్గుచూపారు. నీరు విడుదల చేస్తున్న కారణంగా యాసంగి సాగు చేపట్టారు. ఈ పరిస్థితుల్లో గతంలో నూటికి 95శాతం మంది రైతులు సంప్రదాయ రీతిలో వరినార్లు పోసుకొని నాట్లు వేసేవారు. అయితే ప్రస్తుతం మాత్రం కారణాలు ఏమైనప్పటికీ సగానికిపైగా ఆయకట్టులో రైతులు వెదజల్లే పద్ధతిలో సాగుచేస్తున్నారు. అంతేకాకుండా డ్రమ్‌సీడర్‌ సాగు కూడా ఎక్కువమంది రైతులు చేపట్టారు. సగంమంది రైతులు మాత్రమే నాట్లు వేస్తున్నారు. నాట్లు వేయటానికి బదులు వెదజల్లే పద్ధతి, డ్రమ్‌సీడర్‌ ద్వారా కూలీల కొరత, పెట్టుబడి తగ్గుతుందని రైతులు భావిస్తున్నారు. వైరా ఏడీఏ వి.బాబూరావు, ఏవో ఎస్‌.పవన్‌కుమార్‌ రైతుల్లో వచ్చిన మార్పుతో వారిని మరింత ప్రోత్సహిస్తున్నారు.




Updated Date - 2021-01-25T04:57:33+05:30 IST