
New Delhi: అగ్నిపథ్ (Agnipath) నిరసనల నేపథ్యంలో ఢిల్లీ (Delhi) సరిహద్దులో పోలీసులు (Police) విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. కిలో మీటర్లమేర ట్రిఫిక్ జామ్ (Traffic jam) కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ పలు సంఘాలు, రాజకీయ పార్టీలు భారత్ బంద్‌కు పిలుపిచ్చాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్రాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. పోలీసుల తనిఖీల్లో భాగంగా ఢిల్లీ-గురుగ్రామ్, ఢిల్లీ - నోయిడా హైవేలపై కిలో మీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. తనిఖీల తర్వాతే వాహనాలను ఢిల్లీ లోపలకు అనుమతిస్తామని పోలీసులు స్పష్టంగా చెప్పడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైవేలపై వేలాది వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అగ్నిపథ్‌పై కాంగ్రెస్ ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీలోని పలు రహదారులు మూసివేశారు. దీంతో నగరంలోనూ, పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కాంగ్రెస్ ఆందోళనలతో ఈడీ, జంతర్ మంతర్ దగ్గర పోలీస్ భద్రత భారీగా పెంచారు. ఏఐసీసీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కాంగ్రెస్ కార్యకర్తలను ఏఐసీసీ కార్యాలయంలోకి అనుమతించకపోవడంతో వారు రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు.
ఢిల్లీలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతమయ్యాయి. ఢిల్లీలోని శివాజీ బ్రిడ్జి స్టేషన్‌లోకి దూసుకెళ్లిన యువజన కాంగ్రెస్ నేతలు అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైల్వే ట్రాక్‌పై ఉన్న రైలును కదలనీయకుండా అడ్డుకున్నారు. ట్రాక్‌పై అడ్డంగా పడుకొని నిరసన తెలిపారు. కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. దేశవ్యాప్తంగా అగ్నిపథ్ ఆందోళనలు ఉధృతమయ్యాయి. భారత్ బంద్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా దాదాపు 7 వందలకుపైగా రైళ్లను అధికారులు క్యాన్సిల్ చేశారు.
ఇవి కూడా చదవండి