కాళేశ్వరానికి కొత్త హంగులు

ABN , First Publish Date - 2021-07-15T05:38:38+05:30 IST

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్‌ పేరు శాశ్వతంగా నిలిచేలా అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టుల్లో ఒక్కటిగా గుర్తింపు రావటంతో ఆయన పేరు కూడా అదే స్థాయిలో నిలిచిపోవాలని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు.

కాళేశ్వరానికి కొత్త హంగులు
కన్నెపల్లి పంపుహౌస్‌ వద్ద నిర్మిస్తున్న సీఎం క్యాంపు కార్యాలయం

కన్నెపల్లి పంపుహౌస్‌ వద్ద సీఎం క్యాంపు కార్యాలయం
రూ.11కోట్ల అంచనా వ్యయంతో పనులు
మంత్రుల కోసం ప్రత్యేక గదులు
రూ.50 లక్షలతో శాశ్వత హెలీప్యాడ్‌ నిర్మాణం
ఇక నుంచి ప్రతీ వర్షాకాలంలో సీఎం విడిది చేసే అవకాశం


ఆంధ్రజ్యోతి, భూపాలపల్లి

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్‌ పేరు శాశ్వతంగా నిలిచేలా అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టుల్లో ఒక్కటిగా  గుర్తింపు రావటంతో  ఆయన పేరు కూడా అదే స్థాయిలో నిలిచిపోవాలని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. కాళేశ్వరం వద్ద సీఎం క్యాంపు కార్యాలయంతో పాటు హెలీప్యాడ్‌ నిర్మాణం, మేడిగడ్డ వద్ద కేసీఆర్‌ భారీ విగ్రహాన్ని ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులో ఉన్న  కాళేశ్వరం ప్రాంతాన్ని భవిష్యత్తులో అద్భుత పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది.

భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం కాళేశ్వరం సమీపంలోని కన్నెపల్లి పంపుహౌస్‌ వద్ద కేసీఆర్‌ క్యాంపు కార్యాలయం పనులు చేపట్టారు. రూ.11కోట్లతో 28,300 ఎస్‌ఎ్‌ఫటీతో నిర్మిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనతో పాటు వర్షాకాలంలో కొద్ది రోజులు ఇక్కడ సీఎం విడిది చేసే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో సీఎం కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా జీ ఫ్లస్‌ టు భవనం నిర్మిస్తున్నారు. 48 గదులను లెటేస్ట్‌ టెక్నాలేజీతో  కడుతున్నారు. వీటిలో ఆరు డిలక్స్‌ షూట్‌లు, మరో ఐదు మంత్రుల కోసం ప్రత్యేకంగా గదులను నిర్మిస్తున్నారు. ఇక కేసీఆర్‌ కోసం ప్రత్యేకంగా విశాలమైన గదిని కడుతున్నారు. కుటుంబ సమేతంగా ఇక్కడ సీఎం బస చేసేందుకుప్రత్యేకంగా గదులను నిర్మిస్తున్నారు. అధికారులతో సమావేశం నిర్వహించేందుకు కాన్ఫరెన్స్‌ హాల్‌తో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులతో సమావేశం కోసం మరో సమావేశ మందిరాన్ని నిర్మిస్తున్నారు. అధునాతన టెక్నాలేజీతో చేపట్టిన ఈ క్యాంపు కార్యాలయంతో కాళేశ్వరానికి కొత్త రూపు సంతరించుకోనుంది. అలాగే సీఎంతో మంత్రులు, అధికారుల కోసం కన్నెపల్లి పంప్‌హౌస్‌ వద్ద హెలీప్యాడ్‌ను నిర్మిస్తున్నారు.  సుమారు రూ.50 లక్షల వ్యయంతో శాశ్వత ప్రతిపాదికన దీన్ని చేపడుతున్నారు.   

ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో అతి కీలకమైనది మేడిగడ్డ బ్యారేజీ. మహారాష్ట్ర సరిహద్దులో గోదావరిపై చేపట్టిన ఈ ప్రాజెక్టు వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు ఇప్పటికే పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు స్థలాన్ని పరిశీలించారు.  2019 జూన్‌ 21న కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేసే రోజునే కేసీఆర్‌ విగ్రహం పెట్టాలని స్థానిక నేతలు ప్రయత్నించారు. అప్పట్లో కేసీఆర్‌ విగ్రహాన్ని తయారు చేయించి టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శ్రీనివా్‌సరావు ఇంట్లో ఉంచారు. అయితే అప్పట్లో కేసీఆర్‌ విగ్రహం ఏర్పాటుకు అనుమతించక పోవటంతో శ్రీనివా్‌సరావు ఇంట్లో భద్రపరిచారు. అయితే మూడో టీఎంసీ నీటిని ఎత్తిపోసే పనులు కూడా కన్నెపల్లి పంపుహౌస్‌ వద్ద పూర్తికావటంతో కేసీఆర్‌ విగ్రహ ఏర్పాటుకు టీఆర్‌ఎస్‌ నేతలు సన్నాహాలు చేస్తున్నారు.

కాళేశ్వరాన్ని ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఆలయ అభివృద్ధికి రూ.25కోట్లు కేటాయించింది. మరో వంద కోట్ల నిధులు కేటాయిస్తామని సీఎం హామీ ఇచ్చారు. సాగు నీటి ప్రాజెక్టుతో కాళేశ్వరాలయానికి ఇప్పటికే అంతర్రాష్ట్ర గుర్తింపు లభించింది. తెలంగాణ, ఏపీలతో పాటు పక్కనే ఉన్న మహారాష్ట్ర, ఛత్తీ్‌సగఢ్‌, కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు. ఆధ్యాత్మికంగా మరింత అభివృద్ధి చేయటంతో పాటు పర్యాటకంగా కూడా కాళేశ్వరాన్ని అభివృద్ధి చేయాలని సీఎం పట్టుదలతో ఉన్నారు. ఇందుకు నిధుల కేటాయింపులు జరుగుతున్నాయి. బడ్జెట్‌లో ఇప్పటికే సుమారు రూ.1,200 కోట్లు కేటాయించారు. భవిష్యత్తులో ప్రపంచంలోనే అద్భుత పర్యాటక ప్రాంతంగా కాళేశ్వరాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్‌ ఉన్నట్లుగా అధికారులు పేర్కొంటున్నారు. భవిష్యత్తు తరాలకు సీఎం చేపట్టిన ఈ భగీరథ ప్రయత్నంతో పాటు కాళేశ్వర అభివృద్ధిపై కూడా కేసీఆర్‌ మార్క్‌ ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. కాళేశ్వరంతో పాటు కేసీఆర్‌ పేరు కూడా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేలా సీఎం క్యాంపు కార్యాలయం, సీఎం విగ్రహం, స్మృతి వనాలు, థీమ్‌ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది.



Updated Date - 2021-07-15T05:38:38+05:30 IST