నజరానా ఎప్పుడొస్తుందో..!

ABN , First Publish Date - 2021-03-07T07:38:23+05:30 IST

ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహక నిధుల కోసం కొత్త సర్పంచ్‌లు ఎదురు చూస్తున్నారు.

నజరానా ఎప్పుడొస్తుందో..!

రూ.23.50 కోట్ల నిధుల కోసం సర్పంచుల ఎదురుచూపులు


చిత్తూరు కలెక్టరేట్‌,  మార్చి 6: ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహక నిధుల కోసం కొత్త సర్పంచ్‌లు ఎదురు చూస్తున్నారు. పంచాయతీల అభివృద్ధి కోసం పోటీ లేకుండా ఏకగ్రీవంగా సర్పంచులను, వార్డు మెంబర్లను ఎన్నుకుంటే ప్రోత్సాహక నిధులందిస్తామని ఎన్నికల సమయంలో ప్రభుత్వం ప్రకటనలు గుప్పించిన విషయం తెలిసిందే. రెండువేల జనాభా లోపున్న పంచాయతీలకు రూ. 5లక్షలు, రెండువేల నుంచి ఐదు వేల మంది ఉన్న పంచాయతీలకు రూ. 10 లక్షలు, ఐదు వేల నుంచి పదివేల మంది జనాభా ఉన్న పంచాయతీలకు రూ. 15లక్షలు, పది వేల మంది జనాబా దాటిన పంచాయతీలకు రూ. 20 లక్షల ప్రోత్సాహం అదిస్తామని ప్రకటించింది.జిల్లాలో మొత్తం 1412 పంచాయతీలకు గాను 418 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అయితే ప్రభుత్వ నిబంధనల మేరకు 358 పంచాయతీలకు మాత్రమే ప్రోత్సాహకం వర్తించనుంది. మిగిలిన 60 పంచాయతీల్లో సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవమైనా వార్డు మెంబర్ల స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు.ఈ నేపథ్యంలో ఏకగ్రీవమైన 358 పంచాయతీలకు ప్రభుత్వం నుంచి నజరానా రూపంలో రూ. 23.50 కోట్లు అందాల్సి ఉంది. వీటిలో 2వేలు జనాభా లోపు కలిగిన 259, 5వేలు లోపు జనాభా కలిగిన 87 పంచాయతీలు, పదివేలు లోపు కలిగిన పంచాయతీలు 11 ఉండగా పదివేలకు మించి జనాభా కలిగిన పంచాయతీ నారాయణవనం ఉంది. 2006వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవమైన మైనర్‌ పంచాయతీలకు రూ.5లక్షలు, మేజర్‌ పంచాయతీలకు రూ. 15లక్షల చొప్పున ప్రోత్సాహక నగదును అప్పటి ప్రభుత్వం విడుదల చేసింది. 2013లో జరిగిన ఎన్నికల్లో మైనర్‌ పంచాయతీకి రూ. 7లక్షలు, మేజర్‌ పంచాయతీకి రూ. 20 లక్షలు చొప్పున అందిస్తామని ప్రకటించింది. అప్పట్లో 291 మేజర్‌, మైనర్‌ గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనప్పటికీ నగదు ప్రోత్సాహకం ఇవ్వనేలేదు.అలా కాకుండా ఈసారి ప్రభుత్వం ప్రకటించిన ఏకగ్రీవ నజరానాను త్వరగా విడుదల చేయాలని తాజాగా ఎన్నికైన సర్పంచులు కోరుతున్నారు. 

Updated Date - 2021-03-07T07:38:23+05:30 IST