
అన్ బిల్లింగ్ మీటర్లపై నజర్
కావాలనే చేస్తున్నారా?
ముగ్గురు ఏఈలపై వేటు
జాబితాలో మరికొందరు..
గ్రేటర్లో విద్యుత్ డిమాండ్ 60 ఎంయూలు
బిల్లింగ్ పరిధిలోకి..55 ఎంయూలు
అన్ బిల్లింగ్ ఎంయూలు 5
హైదరాబాద్ సిటీ: గ్రేటర్లో రికార్డు స్థాయిలో కొత్త విద్యుత్ కనెక్షన్లు జారీ అవుతున్నాయి. అయితే, ఆ స్థాయిలో బిల్లులు మాత్రం పెరగడం లేదు. కొందరు విద్యుత్ ఏఈలు కొత్త కనెక్షన్లు ఇచ్చే క్రమంలో అవి బిల్లింగ్ పరిధిలోకి రాకుండా చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశాన్ని సీరియ్‌సగా తీసుకున్న తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎ్‌సఎస్పీడీసీఎల్) తనిఖీలు చేపడుతోంది. అన్ బిల్లింగ్ మీటర్లు బయటపడితే అందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటోంది.
అన్ బిల్లింగ్ ఇలా..
కొత్త విద్యుత్ మీటర్ కోసం ఆన్లైన్ లేదా కస్టమర్ సర్వీసర్ సెంటర్ (సీఎ్‌ససీ)లో దరఖాస్తు చేసుకోవాలి. అలా వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలించి, కొత్త కనెక్షన్ మంజూరు చేయడంతో పాటు విద్యుత్ మీటర్లు కేటాయిస్తారు. ఆ మీటర్ నంబర్ ఆధారంగా ఈఆర్వో సెక్షన్లో కనెక్షన్ రిలీజ్ చేసినట్లు నమోదు చేసుకుని, మీటర్‌కు యూఎస్ఈ నంబర్ కేటాయిస్తారు. తర్వాత ప్రతి నెలా బిల్లింగ్ తీయాల్సి ఉంటుంది. కానీ, కొందరు అధికారులు డబ్బులు తీసుకుని పాతమీటర్లతో కనెక్షన్ ఇచ్చేస్తున్నారు. ఈ కనెక్షన్ అధికారుల లెక్కల్లో లేకపోవడంతో అవి బిల్లింగ్ పరిధిలోకి రావడం లేదు. ఇలాంటి కనెక్షన్లు ఎక్కువగా రెండు, మూడు విద్యుత్ కనెక్షన్లు ఉన్న వినియోగదారుల విషయంలో జరుగుతోందని అధికారులు గుర్తించారు. అధికారిక మీటర్ అందరికీ కనబడేలా, ఈ అనధికార మీటర్ ఎక్కడో ఉండేలా ఏర్పాటు చేస్తున్నట్లు గుర్తించినట్లు సమాచారం. డీపీఈ, విజిలెన్స్ అధికారులు అప్పుడప్పుడు నిర్వహించే తనిఖీల్లో ఇలాంటి కేసులు బయటపడుతుంటాయి.
విస్తృత తనిఖీలు
గ్రేటర్‌లోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ వినియోగం ఎక్కువగా జరుగుతున్నా.. ఆ మేరకు బిల్లింగ్‌లో కనిపించడం లేదు. దీంతో 15 రోజులుగా విద్యుత్ శాఖ డీపీఈ(విద్యుత్ చౌర్య నిరోధక విభాగం), విజిలెన్స్ బృందాలు విస్తృత స్థాయిలో తనిఖీలు చేపడుతున్నాయి. ఈ తనిఖీల్లో పదుల సంఖ్యలో అన్ బిల్లింగ్ మీటర్లు బయటపడుతున్నాయి. ముఖ్యంగా మొయినాబాద్, ఇబ్రహీంబాగ్, నార్సింగి విద్యుత్ సెక్షన్ల పరిధిలో పదుల సంఖ్యలో అన్ బిల్లింగ్ మీటర్లను గుర్తించారు. అన్బిల్లింగ్ మీటర్లు ఉన్నా గుర్తించని ముగ్గురు ఏఈలపై వేటు వేశారు. మేడ్చల్, రాజేంద్రనగర్, సరూర్‌నగర్, పటాన్‌చెరుతో పాటు మరికొన్ని ప్రాంతాల్లోనూ అన్ బిల్లింగ్ మీటర్లు ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం.
చర్యలుంటాయా?
కొత్త విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేసి, అవి బిల్లింగ్ పరిధిలోకి రాకుండా చేసిన అధికారులు ఇప్పుడా ప్రాంతాలలో పని చేయడం లేదు. కొందరు పదోన్నతిపై వెళ్లిపోగా, కొందరు బదిలీల్లో భాగంగా ఇతర ప్రాంతాల్లో పని చేస్తున్నారు. వాస్తవానికి కొత్త మీటర్లు జారీ చేసిన సమయంలో బిల్లింగ్‌లోకి రాకుండా చేసిన అధికారులను గుర్తించి వారిపై కూడా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఏళ్ల తరబడి అన్ బిల్లింగ్ మీటర్లు ఉన్నా.. కొందరు కేత్రస్థాయి అధికారులు చూసీ చూడనట్లు వదిలేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
కాసుల కక్కుర్తి..
విద్యుత్ శాఖలోని కొందరు డబ్బులకు ఆశపడి సంస్థ ఆదాయానికి గండి కొడుతున్నారు. కొత్త కనెక్షన్ జారీ సమయంలోనే అక్రమాలకు పాల్పడుతూ బిల్లింగ్ పరిధిలోకి రాకుండా చేస్తున్నారు. గ్రేటర్‌లోని 9 విద్యుత్ జోన్ల పరిధిలో ఒక్కరోజులోనే 5 లక్షల యూనిట్లు బిల్లింగ్ పరిధిలోకి రావడం లేదంటే వీరి అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇదే మొదటిసారి..
రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్ శాఖలో ఒకేసారి ముగ్గురు ఏఈలపై చర్యలు తీసుకోవడం ఇదే మొదటిసారని ఓ ఉన్నతాధికారి తెలిపారు. కొన్నేళ్లుగా విద్యుత్ శాఖలో ఏం చేసినా చర్యలుండవనే ధీమా కొంతమంది అధికారుల్లో పెరిగిందని.. దీంతో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. చాలా ఎస్ఈలు, డీఈలు, ఏడీఈలు అసలు కార్యాలయం వదిలి క్షేత్రస్థాయికి వెళ్లరని, దీంతో కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు గ్రేటర్ జోన్ పరిధిని విద్యుత్ శాఖకు ‘షాక్’ ట్రిట్మెంట్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.