CoWIN portalలో కొత్త సెక్యూరిటీ ఫీచర్

ABN , First Publish Date - 2021-05-07T23:03:42+05:30 IST

కోవిడ్-19 వ్యాక్సినేషన్ కోసం ఉపయోగించే కోవిన్ పోర్టల్‌ మరింత

CoWIN portalలో కొత్త సెక్యూరిటీ ఫీచర్

న్యూఢిల్లీ : కోవిడ్-19 వ్యాక్సినేషన్ కోసం ఉపయోగించే కోవిన్ పోర్టల్‌ మరింత భద్రతను సంతరించుకుంది. ఈ పోర్టల్‌లో ప్రవేశపెట్టే సమాచారం దుర్వినియోగమయ్యే అవకాశాలు ఉన్నాయని చాలా మంది ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో కొత్త ఫీచర్‌ను దీనికి జోడించారు. దీనివల్ల డేటా ఎంట్రీ ఎర్రర్స్ కూడా కనిష్ట స్థాయికి తగ్గుతాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ఫీచర్ మే 8 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. 


కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ట్విటర్ వేదికగా శుక్రవారం తెలిపిన సమాచారం ప్రకారం, మే 8 నుంచి కోవిన్ సిస్టమ్‌లో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెడుతున్నారు. నాలుగు అంకెల సెక్యూరిటీ కోడ్‌ను కొత్తగా ప్రవేశపెడుతున్నారు. దీనివల్ల డేటా ఎంట్రీ ఎర్రర్స్ కనిష్ట స్థాయికి తగ్గుతాయి, తద్వారా ప్రజలకు కలిగే అసౌకర్యం తగ్గుతుంది. 


అంతకుముందు కొందరు చేసిన ఆరోపణల ప్రకారం, కోవిడ్-19 వ్యాక్సినేషన్ కోసం అపాయింట్‌మెంట్‌ను బుక్ చేసుకున్నవారు నిర్దేశిత తేదీనాడు వ్యాక్సినేషన్ కోసం వెళ్ళకపోయినప్పటికీ, వారికి వ్యాక్సినేషన్ జరిగినట్లు ఎస్ఎంఎస్ వచ్చేది. ఈ నేపథ్యంలో ఈ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. 


ఈ ఆరోపణలపై పరిశీలన జరిపినపుడు వ్యాక్సినేటర్ పొరపాటే దీనికి కారణమని వెల్లడైందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇకపై వ్యాక్సిన్ తీసుకునేందుకు అర్హతగల వ్యక్తికి వ్యాక్సిన్ డోసును ఇవ్వడానికి ముందు వెరిఫయర్/వ్యాక్సినేటర్ ఆ వ్యక్తిని నాలుగు అంకెల కోడ్‌ చెప్పాలని అడుగుతారని, ఆ కోడ్‌ను కోవిన్ సిస్టమ్‌లో ఎంటర్ చేస్తారని తెలిపింది. దీంతో వ్యాక్సినేషన్ స్టేటస్ సరైన విధంగా రికార్డ్ అవుతుందని తెలిపింది. 


వ్యాక్సినేషన్ కోసం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నవారికి మాత్రమే ఈ నాలుగు అంకెల కోడ్ వస్తుంది. అపాయింట్‌మెంట్ అక్‌నాలెడ్జ్‌మెంట్ స్లిప్ మీద ఈ కోడ్ ఉంటుంది. ఇది వ్యాక్సినేటర్‌కు తెలియదు. లబ్ధిదారుకు అపాయింట్‌మెంట్ ఖరారు అయిన తర్వాత వచ్చే ఎస్ఎంఎస్‌లో కూడా ఈ నాలుగు అంకెల కోడ్ ఉంటుంది. అపాయింట్‌మెంట్ అక్‌నాలెడ్జ్‌మెంట్ స్లిప్‌ను మొబైల్‌ ఫోన్‌లో సేవ్ చేసుకుని, చూపించవచ్చు.


Updated Date - 2021-05-07T23:03:42+05:30 IST