కొత్త ‘శిఖరం’పై ఆమె!

ABN , First Publish Date - 2021-12-08T05:30:00+05:30 IST

పర్వతారోహకురాలు, అర్థశాస్త్ర బోధకురాలు, పర్యావరణవేత్త, మహిళా హక్కుల కార్యకర్త... ...

కొత్త ‘శిఖరం’పై ఆమె!

పర్వతారోహకురాలు, అర్థశాస్త్ర బోధకురాలు, పర్యావరణవేత్త, మహిళా హక్కుల కార్యకర్త... అరవై రెండేళ్ళ డాక్టర్‌ హర్షవంతీ బిస్త్‌ జీవితంలో ఎన్నో వైవిఽధ్యాలు. అన్ని పాత్రలనూ ఆమె సమర్థవంతంగా నిర్వహిస్తూ వచ్చారు. ఇప్పుడు ఇండియన్‌ మౌంటెనీరింగ్‌ ఫౌండేషన్‌ (ఐఎమ్‌ఎఫ్‌) తొలి మహిళా అధ్యక్షురాలిగా తనదైన ముద్ర వెయ్యడానికి సిద్ధమవుతున్నారు.


ఒకవైపు చదువు, మరోవైపు కొండలు ఎక్కడం... ఈ రెండిటినీ సమాంతరంగా సాగిస్తూ వచ్చారు హర్షవంతీ బిస్త్‌. ఉత్తరాఖండ్‌ రాష్టంలోని పౌరీ జిల్లాలోని సుకాయ్‌ ఆమె సొంత ఊరు. చిన్ననాటి నుంచీ కొండల్లో, కోనల్లో సంచారంపై మక్కువ పెంచుకున్న ఆమె ఎకనామిక్స్‌లో ఎం.ఎ. చేసిన వెంటనే ఉత్తరాఖండ్‌లోని ‘నెహ్రూ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మౌంటెనీరింగ్‌’లో... పర్వతారోహణ కోర్సు పూర్తి చేశారు. 1981లో... నందాదేవి శిఖరాన్ని తొలిసారిగా అధిరోహించిన ముగ్గురు మహిళల బృందంలో ఆమె ఒకరు. ఆ ఏడాదే కేంద్ర ప్రభుత్వం ఆమెను ‘అర్జున’ పురస్కారంతో సత్కరించింది. అలాగే 1984లో ఎవరెస్ట్‌ శిఖరాన్ని కూడా ఆమె అధిరోహించారు. ఎన్నో సాహస యాత్రల్లో భాగస్వామి అయ్యారు. 


ఎడ్మండ్‌ హిల్లరీయే స్ఫూర్తి

ఇవన్నీ ఒక ఎత్తయితే పర్యావరణ పరిరక్షణ కోసం ఆమె చేస్తున్న కృషి మరో ఎత్తు. ‘‘ప్రకృతిని, పర్యావరణాన్నీ కాపాడడానికీ, ఈ ప్రాంత ప్రజలకు ఆర్థిక అవకాశాలు అందించడానికీ ఎడ్మండ్‌ హిల్లరీ ఎంత కృషి చేశారో నా ఎవరెస్ట్‌ యాత్ర సమయంలో తెలుసుకున్నాను. గంగోత్రిలో నేను పని చేస్తున్నప్పుడు అదే నాకు స్ఫూర్తిగా నిలిచింది అని చెబుతారామె. అరుదైన భోజపత్ర వృక్షాల పరిరక్షణ కోసం భారీ పోరాటం సాగించారు. దానికి గుర్తింపుగా ‘ఎడ్మండ్‌ హిల్లరీ మౌంటెన్‌ లెగసీ’ పతకాన్ని అందుకోవడం ‘మరచిపోలేని జ్ఞాపకం’ అంటారు హర్షవంతి.. గంగానది పరిరక్షణ కోసం ‘సేవ్‌ గంగోత్రి’ అనే ప్రాజెక్ట్‌ను ఆమె ప్రారంభించారు. నదీ తీరాల్లోని అడవులనూ, గంగోత్రి హిమనీనదం అంచున ఉన్న ప్రాంతాన్నీ విజయవంతంగా పునరుద్ధరించారు. అంతరించిపోతున్న ఔషధ మొక్కలను కాపాడేలా ప్రజల్లో చైతన్యం తెచ్చారు. విచ్చలవిడి పర్యాటకం వల్ల దెబ్బతింటున్న ప్రాంతాలకు ఎకోటూరిజం ప్రమాణాలను పరిచయం చేశారు. 


మహిళలకు ప్రోత్సాహం కావాలి...

ఘర్వాల్‌లో ఆమె చేపట్టిన కార్యక్రమాలను మొత్తం హిమాలయాల్లో నిలకడైన పర్యావరణ అభివృద్ధికి బ్లూప్రింట్‌గా ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకున్నాయి. అలాగే, ‘మౌంటెన్‌ లెగసీ’ అనే సంస్థ భాగస్వామ్యంతో ‘మౌంటెన్‌ పవర్‌’ అనే కొత్త ప్రాజెక్ట్‌ను హర్షవంతి చేపట్టారు. హిమాలయ ప్రాంతంలో ఉన్న కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో మౌంటెనీరింగ్‌ క్లబ్‌లు ఏర్పాటు చేయడం ఈ ప్రాజెక్ట్‌ లక్ష్యం. ‘‘నాకు మొదటి నుంచీ అర్థశాస్త్రం మీద ఆసక్తి. అది క్రమంగా పర్యావరణం మీద ప్రేమగా మారింది’’ అంటారామె. ఈ మధ్యే ఉత్తరకాశీలోని పీజీ కాలేజీ ప్రిన్సిపాల్‌గా పదవీవిరమణ చేశారు. అరవై మూడేళ్ళ కిందట... 1958లో ఏర్పాటైన... దేశంలోనే పర్వతారోహణకు చెందిన అత్యున్నత సంస్థ ఐఎంఎ్‌ఫకు తొలి మహిళా అధ్యక్షురాలుగా ఈ మధ్యే ఎన్నికయ్యారు. దీంతో తనపై మరింత బాధ్యత పెరిగిందంటున్నారామె. ‘‘పర్వతారోహకులకు మరిన్ని సౌకర్యాలు, మరింత ప్రోత్సాహం, సహకారం కావాలి. దీనికోసం అటవీ, పర్యాటక రంగాలతో సమన్వయం అవసరం. ప్రధానంగా మౌంటెనీరింగ్‌ దిశగా మహిళలను మరింత ప్రోత్సహించడం నా ప్రధాన లక్ష్యం. నిజానికి మహిళలకు చాలా అవకాశాలున్నాయి. కానీ అవి ఎక్కడున్నాయో తెలుసుకోవడం, వాటిని అందిపుచ్చుకోవడం చాలామందికి కష్టమవుతోంది. మారుమూల పర్వతప్రాంతాల్లోని సమాజాల్లో ఉన్న మహిళలు ఆర్థిక వ్యవస్థలో తామూ భాగస్వాములమేనని తెలుసుకొనేలా చెయ్యాలి. ట్రావెల్‌ ఏజెన్సీలను, హొటళ్ళను నడపడం, గైడ్స్‌ లాంటి పనుల్లో పురుషులే కనిపిస్తారు. మహిళలను కూడా ప్రోత్సహిస్తే... వారు ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఆ దిశగా నా కృషి సాగిస్తాను’’ అని చెబుతున్నారు హర్షవంతి.

Updated Date - 2021-12-08T05:30:00+05:30 IST