మోకీళ్లకు కొత్త వైద్యం

ABN , First Publish Date - 2021-07-27T18:36:37+05:30 IST

మోకీళ్ల అరుగుదల... ఆస్టియోఆర్థ్రయిటిస్‌కు శాశ్వతంగా అడ్డుకట్ట వేసే చికిత్సా విధానాల గురించిన అధ్యయనాలు ప్రపంచవ్యాప్తంగా నిరంతరంగా జరుగుతూనే ఉన్నాయి. అయితే వంశపారంపర్యంగా సంక్రమించే ఈ సమస్యను జెనెటిక్‌ మార్కర్ల ద్వారా

మోకీళ్లకు కొత్త వైద్యం

ఆంధ్రజ్యోతి(27-07-2021)

మోకీళ్ల అరుగుదల... ఆస్టియోఆర్థ్రయిటిస్‌కు శాశ్వతంగా అడ్డుకట్ట వేసే చికిత్సా విధానాల గురించిన అధ్యయనాలు ప్రపంచవ్యాప్తంగా నిరంతరంగా జరుగుతూనే ఉన్నాయి. అయితే వంశపారంపర్యంగా సంక్రమించే ఈ సమస్యను జెనెటిక్‌ మార్కర్ల ద్వారా గుర్తించి, వాటి ఆధారంగా మోకీళ్ల అరుగుదలను మరింత ప్రభావవంతంగా అడ్డుకోవచ్చని మొట్టమొదటి భారతీయ అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనాన్ని చేపట్టిన డాక్టర్‌ కృష్ణ సుబ్రహ్మణ్యం విశ్లేషణ ఇది!


కదలికలను క్లిష్టం చేసే కీళ్ల అరుగుదల సమస్యల్లో మోకీళ్ల అరుగుదల ప్రధానమైనది. మోకీళ్లలో మృదులాస్థి అరుగుదల, ఆస్టియోఫైట్‌ ఉత్పత్తి మొదలైన కారణాల వల్ల మోకీళ్లలో సమస్యలు మొదలవుతాయి. దీన్నే వైద్య పరిభాషలో ఆస్టియోఆర్ర్థైటిస్‌ అంటారు. ఇది ప్రైమరీ, సెకండరీ అనే రెండు రకాలుగా ఉంటుంది.


మోకీళ్లతో పాటు తుంటి, మణికట్టు, వెన్ను.... ఇలా శరీరంలోని అన్ని కీళ్లలోనూ తలెత్తవచ్చు. అయితే ప్రధానంగా మోకీలు అరుగుదల సమస్య వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లో కదలికలకు ఆస్కారం లేకుండా చేసి, వారిని ఇళ్లకే పరిమితం చేసేస్తూ ఉంటుంది. ఈ సమస్యకు సూటి కారణాన్ని కచ్చితంగా చెప్పే వీలు లేకపోయినా పర్యావరణం, బయోమెకానిక్స్‌, బయోకెమికల్‌ ప్రాసెస్‌, జెనెటిక్స్‌ ప్రధాన కారణాలని గుర్తించడం జరిగింది. 


జన్యుపరమైన అంశాల  ఆధారంగా...

ఆస్టియోఆర్ర్థైటిస్‌ అనేది పెద్దల్లో తలెత్తే సమస్య అయినా, కొంతమందిలో కొంతమంది మధ్యవయస్కుల్లోనూ తలెత్తుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతానికి ఈ సమస్య చికిత్సల్లో భాగంగా నొప్పి తగ్గించి, కదలికలను పెంచే మందులు సూచించడం, సమస్య తీవ్రత పెరిగితే కీళ్ల మార్పిడి చికిత్సలనే అనుసరిస్తున్నారు. అయితే కీళ్ల మార్పిడి చికిత్స ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఎక్కువ శాతం దేశాల్లో ఈ సర్జరీలను అందించే పరిస్థితి లేదు.


కాబట్టి అరిగిన కీళ్లకు చికిత్స చేయడం కంటే, ఆ సమస్య తలెత్తే వీలున్న వ్యక్తులను ముందుగానే గుర్తించి, కీళ్ల అరుగుదల తలెత్తకుండా నియంత్రించే వ్యక్తిగత చికిత్సలను అందించగలగాలి. ఇప్పటివరకూ కీళ్ల అరుగుదల పెరగకుండా నిలువరించే థెరపీలు అందుబాటులోకి రాలేదు. మున్ముందు మృదులాస్థి మెటబాలిజం, ఇన్‌ఫ్లమేషన్‌ మెకానిజం మొదలైన థెరపీలు అందుబాటులోకి వచ్చే వీలుంది.


అయితే కీళ్ల అరుగుదల సమస్య తలెత్తడానికి 50% జన్యుపరమైన అంశాలు తోడ్పడతాయి. మరీ ముఖ్యంగా యువతలో కీళ్ల అరుగుదలకు జన్యుపరమైన అంశాలే ప్రధాన కారణం. ఈ సమస్యకు కారణమయ్యే జన్యువులను కలిగిన వ్యక్తులను గుర్తించి, వారి జెనెటిక్‌ మార్కర్ల ఆధారంగా చికిత్స లేదా థెరపీలను ప్రణాళికాబద్ధంగా అంచనా వేసి సమస్యను మరింత ప్రభావవంతంగా పరిష్కరించవచ్చు. ఇందుకోసం పది జన్యు పాలీమార్ఫిసి్‌సల గురించి అధ్యయనం చేపట్టడం జరిగింది. 


ఆస్టియోఆర్ర్థైటిస్‌ లక్షణాలు

1 కీళ్లలో నొప్పి, వాపు

2 కీళ్లు బిగుసుకుపోవడం

3 కీళ్ల కదలికలు తగ్గడం

4 జీవన నాణ్యత దెబ్బతినడం


గుర్తించే విధానం

వ్యక్తిగత, వైద్యచరిత్రలను తెలుసుకుని, దాని ఆధారంగా అరిగిన, అరుగుతున్న కీళ్లకు చికిత్స వైద్యులు ఎంచుకుంటూ ఉంటారు. ఒకే ఒక పరీక్షతో కీళ్ల అరుగుదలను నిర్థారించే పరిస్థితి ఇప్పటివరకూ లేదు. లక్షణాలు, ఎక్స్‌ రే, ఎమ్మారైల ద్వారా సమస్యను నిర్థారించే విధానమే మనుగడలో ఉంది. ఫలితాలను బట్టి అంచెల వారీగా అందించవలసిన చికిత్సను వైద్యులు అంచనా వేస్తూ ఉంటారు.


ప్రధాన కారణాలు ఇవే!

 పెరిగే వయసు

 స్థూలకాయం

 ప్రమాదాల్లో కీళ్లు దెబ్బతినడం

 ప్రధానంగా వంశపారంపర్యం లేదా జన్యుపరమైన అంశాలు


నియంత్రణ ఇలా...

బరువు అదుపులో: అధిక బరువు మోకీళ్ల మీద భారాన్ని పెంచుతుంది. అధిక బరువుతో మోకీళ్లు, తుంటి, పాదాల్లోని కీళ్లు శ్రమకు లోనవుతాయి. అలాగే అదనపు కొవ్వు మృదులాస్థిలో మార్పులకు కారణమవుతుంది. కాబట్టి బరువు పెరగకుండా చూసుకోవాలి. అధిక బరువును ఆహార, జీవనశైలి మార్పులతో తగ్గించుకోవాలి.


 మధుమేహం: రక్తంలో పెరిగే చక్కెర స్థాయిలు కీళ్ల అరుగుదలకు కారణమవుతాయి. కాబట్టి మఽధుమేహులు క్రమం తప్పకుండా రక్తంలో చక్కెర స్థాయిని పరీక్షించుకుంటూ ఉండాలి. అవసరం మేరకు మందులు వాడుకుంటూ ఉండాలి.


 చురుగ్గా ఉండాలి: కీళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే శరీరం చురుగ్గా ఉండాలి. వ్యాయామంతో కీళ్లు బిగుసుకుపోయే సమస్య తప్పుతుంది. కాబట్టి రోజూ కనీసం 30 నిమిషాల పాటైనా నడవాలి. కీళ్ల అరుగుదలను నియంత్రించే వ్యాయామాల గురించి వైద్యులను అడిగి తెలుసుకోవాలి.


 వ్యాయామాలు సురక్షితంగా: గాయాలు కీళ్ల అరుగుదలను పెంచుతాయి. కాబట్టి వ్యాయామం మొదలుపెట్టేవాళ్లు తక్కువ వేగంతో, తక్కువ తీవ్రతతో వ్యాయామాలు మొదలుపెట్టి, క్రమేపీ వేగం, తీవ్రతలను పెంచాలి. వ్యాయామానికి ముందు 10  నిమిషాల పాటు వార్మప్‌ చేయడం వల్ల, కీళ్లు, టెండాన్లు, కండరాలు, లిగమెంట్లు గాయాల బారిన పడకుండా ఉంటాయి.


 కీళ్ల మీద కన్ను: వ్యాయామం చేసిన ఒకటి రెండు గంటల తర్వాత కూడా కీళ్లు నొప్పి పెడుతూ ఉంటే అవసరానికి మించి కీళ్లను శ్రమకు లోను చేశామని అర్థం. అలాంటప్పుడు నొప్పి తగ్గడం కోసం ఐస్‌ ప్యాక్‌ పెట్టుకోవాలి.


 తీపి, ఉప్పు: ఆహారంలో ఈ రెండింటి వాడకం వీలైనంత తగ్గించాలి. 


మోకీళ్ల అర్థ్రయిటిస్‌కు 5 వ్యాయామాలు!

1 క్వాడ్రాసెప్స్‌ స్ర్టెచ్‌

2. కాఫ్‌ స్ట్రెచ్‌

3. సీటెడ్‌ లెగ్‌ రైజ్‌

4. స్టెప్‌ అప్స్‌

5. హ్యామ్‌స్ర్టింగ్‌ స్ట్రెచ్‌


డాక్టర్‌. కృష్ణ సుబ్రమణ్యం

సీనియర్‌ ఆర్థోపెడిక్‌, 

జాయింట్‌ రీప్లే్‌సమెంట్‌ సర్జన్‌,

యశోద హాస్పిటల్స్‌, 

హైదరాబాద్‌.

Updated Date - 2021-07-27T18:36:37+05:30 IST