Health Warning : పొగాకు ఉత్పత్తులపై కొత్త హెచ్చరికలు త్వరలో

ABN , First Publish Date - 2022-07-29T20:03:58+05:30 IST

ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులపై హెచ్చరికలను

Health Warning : పొగాకు ఉత్పత్తులపై కొత్త హెచ్చరికలు త్వరలో

న్యూఢిల్లీ : ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులపై హెచ్చరికలను సవరించింది. 2022 డిసెంబరు 1న లేదా ఆ తర్వాత తయారయ్యే, దిగుమతి చేసుకునే లేదా ప్యాకేజ్ అయ్యే పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లపై అక్షరాలు, బొమ్మల రూపంలో కొత్త హెచ్చరికలను ముద్రించాలని ఆదేశించింది. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 


ఈ ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, ‘‘పొగాకు బాధాకరమైన మరణానికి కారణమవుతుంది’’ (Tobacco causes painful death) అని అక్షరాల్లో ముద్రించాలి. దీంతోపాటు ఓ బొమ్మను కూడా ముద్రించాలి. వీటిని 2022 డిసెంబరు 1 నుంచి ఒక ఏడాదిపాటు ముద్రించాలి. వచ్చే సంవత్సరం డిసెంబరు 1న లేదా ఆ తర్వాత తయారయ్యే, దిగుమతి చేసుకునే లేదా ప్యాకేజ్ అయ్యే పొగాకు ఉత్పత్తుల పెట్టెలపై ‘‘పొగాకు వినియోగదారులు తక్కువ వయసులోనే మరణిస్తారు’’ (tobacco users die younger) అని అక్షరాల్లో ముద్రించాలి. 


సిగరెట్స్ అండ్ అదర్ టుబాకో ప్రొడక్ట్స్ (ప్యాకేజింగ్ అండ్ లేబెలింగ్) రూల్స్, 2008ను సవరించిన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ  తాజా ఆదేశాలను నోటిఫై చేసింది. సవరించిన నిబంధనలు 2022 డిసెంబరు 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఈ నోటిఫికేషన్ 19 భాషల్లో అందుబాటులో ఉంది. 


http://www.mohfw.gov.in

www.mohfw.gov.in

http://ntcp.nhp.gov.inలను సందర్శించి, మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు. 


సిగరెట్లు లేదా ఇతర పొగాకు ఉత్పత్తుల తయారీ, ఉత్పత్తి, సరఫరా, దిగుమతి లేదా పంపిణీతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధంగలవారు అన్ని పొగాకు సంబంధిత ప్యాకేజీలపైనా నిర్దిష్ట ఆరోగ్య హెచ్చరికలు, ముఖ్యంగా నిర్దేశించిన హెచ్చరికలను ముద్రించేవిధంగా జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మార్గదర్శకాలను పాటించకపోవడం శిక్షించదగిన నేరం అవుతుందని స్పష్టం చేసింది. 




Updated Date - 2022-07-29T20:03:58+05:30 IST