కొత్తచరిత్ర: హేము హీరో..అక్బర్‌ జీరో

ABN , First Publish Date - 2021-08-01T06:05:37+05:30 IST

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇటీవల దేశవ్యాపితంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో Learning Outcomes based Curriculum Framework ను ప్రవేశపెడుతోంది....

కొత్తచరిత్ర: హేము హీరో..అక్బర్‌ జీరో

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇటీవల దేశవ్యాపితంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో Learning Outcomes based Curriculum Framework ను ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా ఇతర అధ్యయన అంశాలతో బాటు చరిత్రలో కూడా కొత్త సిలబస్‌ను ప్రవేశపెట్టడంతో చరిత్ర మతతత్వ పూరితం కావడం మళ్లీ మొదలైంది. ఇన్నేళ్లుగా సిలబస్ విషయంలో కేవలం మార్గదర్శకాలను మాత్రమే విడుదల చేసి వివరాలను విశ్వవిద్యాలయాలకే వదిలివేసిన యూజీసీ ఇప్పుడు దేశమంతా అనుసరించాల్సిన పూర్తి సిలబస్‌ని అన్ని అధ్యయన అంశాలతో పాటు చరిత్రకు కూడా నిర్ధారించి విడుదల చేసింది. మూడు నెలల క్రితం విడుదల చేసిన ముసాయిదా సిలబస్ మీద అభిప్రాయాల్ని ఆహ్వానించింది కానీ అందిన అభిప్రాయాల మదింపు ఏమిటో తెలియరాలేదు. అయితే సిలబస్‌ను ఖరారు చేసినట్లు మాత్రం తెలుస్తోంది.


జాతి ఆత్మను తెలుసుకోవడానికి ముఖ్య సాధనం చరిత్ర అధ్యయనమేననీ, ప్రపంచీకరణ నేపథ్యంలో నిరంతరం విస్తరిస్తున్న చరిత్ర పరిధుల్లో జాతి చరిత్రను గుర్తించాలనీ, వైరుధ్యాలనూ వాదప్రతివాదాలను సంలీనం చేసుకుని జాతి గతానికి ఉన్న ప్రవాహశీలతను ఒడిసి పట్టుకోవాలని ప్రవేశికలో సంకల్పం చెప్పుకున్న ఈ అగ్రశ్రేణి సంస్థ ప్రాథమిక ఆధారాల కన్నా వాటిని ఉటంకిస్తున్న చరిత్రకారుని ప్రాధాన్యత పెరిగిందనీ, వాస్తవాల పట్ల ఉన్న ఈ తిరస్కారం ప్రాథమిక ఆధారాలను ప్రాథమిక సాక్ష్యాలతో సంధానపరచడంలో విఫలమైందని వాపోయింది. అందుకు విరుగుడుగా తరగతి గది ప్రశ్నలతో, కార్యకారణ సంబంధ విచారణతో, సమస్యలను నిర్వచించుకోవడంతో, వాటి ఊహా పరిష్కారాలను పరీక్షకు పెట్టడంతో, అందివచ్చిన సమాచారాన్ని వ్యాఖ్యానించి నిర్ధారణలు చేసుకోవడంతో ప్రతిధ్వనించాలని అభిలషించింది.


శకలాలుగా లభించడం చరిత్ర లక్షణం అంటూ చరిత్రకారుడు ఎంత ప్రయత్నించినా ఆధారాల లభ్యత, వాటి విశ్వసనీయత, సంగతత్వాల అసంపూర్ణత వల్ల, వాటిని వ్యాఖ్యానించే దృష్టికోణాన్ని ఎంపిక చేసుకోవడంలో ఉండే పాక్షికత వల్ల అతడు ఒకానొక సంఘటనను అసమగ్రంగానే చూడగలగుతాడనీ పేర్కొంటూ ఆ విధానం చరిత్రకారుణ్ణి నిర్వచించడానికి సరిపోతుందేమో కానీ మొత్తంగా మన లాంటి ఒక జాతి చరి త్రను నిర్వచించజాలదని అన్నది. ఒక దేశ చరిత్ర సమగ్ర దృక్పథం నుంచి చూడబడాలే తప్ప ఏదో ఒక ‘కేంద్రిత’ కోణం (‘centric’ form) నుంచి కాదని అంటూ జవాబులు లేని ప్రశ్నలను వదలి వేయడంలో కన్నా అవసరమైన ప్రశ్నలను ఎంపిక చేసుకోవడంలోనే చరిత్రకారుడు క్లిష్టతను ఎదుర్కొంటాడు అని అభిప్రాయపడింది. గతకాలపు మానవుల కార్యకలాపాలు ఏదో ఒక ప్రాంతం మీద కాక మొత్తంగా దేశంలో అనంతర పరిణామాల మీద చూపిన ప్రభావాన్ని విమర్శనాత్మకమైన అధ్యయనం ద్వారా చరిత్రగా పునర్నిర్మించాలని వ్యాఖ్యానించింది. ఆ దిశగా అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థిలో ఉండే భవిష్యత్ చరిత్రకారునికి అవగాహన కలిగించే ప్రయత్నమే ఈ సిలబస్ అని పేర్కొంది. 


శాస్త్రీయంగా ఉదాత్తంగా కనిపిస్తున్న ఈ లక్ష్యాలతో రూపొందించిన సిలబస్‌ను చూస్తే పాక్షిక దృష్టి మిషతో పూర్వ సిలబస్‌నీ చరిత్ర రచనా విధానాన్ని ఖండించిన ఈ అపెక్స్ కమిషన్ అటువంటి లోపంతోనే ఈ సిలబస్‌నూ నిర్ణయించినట్టు అర్థమౌతుంది. చరిత్రలో కేంద్రిత కోణాన్ని నిరాకరిస్తూనే మతతత్వ కోణంలో చరిత్ర అధ్యయనాన్ని కేంద్రితం చేసిందీ సిలబస్. అందుకు తగినట్టు, చరిత్రని జ్ఞానశాస్త్రం (epistemology) గా కూడా అభివర్ణించి వాస్తవ నిర్ధారణలో హేతువు ఒక్కటే కాదు, విశ్వాసం పాత్ర కూడా ఉంటుందని చెప్పకనే చెప్పింది.


ఇంతకు ముందు ఎప్పుడూ లేని Idea of Bharath (భారత్ భావన) అనే కొత్త పేపర్‌ను ప్రవేశపెట్టడంతో సిలబస్ మొదలైంది. ప్రారంభంలోనే భారతీయ ఆధ్యాత్మిక ధార్మిక సాం స్కృతిక శాస్త్ర ఆర్థికమూలాల మీద విద్యార్థికి అవగాహన కల్పించాలనే సంకల్పంతో చేసిన ప్రయత్నమిది. ప్రయత్నం మంచిదే. కానీ అత్యంత ఆధునికం అని అనుకుంటున్న భారత్ అనే భావన అత్యంత ప్రాచీనకాలంలోనే ఏర్పడిందనే అవగాహన కలిగిస్తుందీ ప్రయత్నం. నిజానికిది కలిగిస్తున్నది భారత్ భావన కాదు. హిందూ భావన. హిందూ అనే పదాన్ని భారత్‌కు ప్రత్యామ్నాయంగా ఉపయోగించడం ద్వారా అనంతర కాలంలో దేశంలోకి ప్రవేశించిన వారిని విదేశీయులుగా ముద్ర వేసే అవకాశాన్ని మిగిల్చుకుంది ఈ సిలబస్. భరత ఖండం, భరత వర్షం, భరత జాతి అనే పదాల అర్థాలు, సరిహద్దులూ కాలానుగుణంగా మారుతూ వచ్చాయని భారత్ అనే భావన బహుళ జాతి సమ్మేళన ఫలితమని ఈ సిలబస్ గుర్తించ నిరాకరిస్తున్నది.


మూడవ పేపర్‌లోనే రెండు కీలకాంశాల మీద వివాదాన్ని కొనసాగించే ప్రయత్నం జరిగింది. ఇప్పటివరకూ ఉన్న సింధు నాగరికతను సింధు-సరస్వతి నాగరికతగా మార్చి సింధు, సరస్వతి, వేద నాగరికతల మధ్య నాగరికత అవిభాజ్యంగా కొనసాగిందని నమ్మించే విధంగా సిలబస్ నిర్మాణం జరిగింది. ఎండిపోయిన సరస్వతి నది ప్రవాహ ఛాయను గుర్తించి, తవ్వి, నదిని మళ్లీ ప్రవహింప చెయ్యడంలో తప్పు లేదు కానీ, సింధు నదితో పాటు నాగరికత వికసించిన ముఖ్య ప్రాంతాలన్నీ పాకిస్థాన్‌లో ఉండిపోయాయనే కినుకతో సరస్వతి పేరుతో దేశంలో ఒక సమాంతర ప్రత్యామ్నాయ నాగరికతను సృష్టించడం సాధ్యం కాకపోవచ్చు. అది ఎట్లా ఉన్నా అది కొనసాగి ఆర్య లేదా వేద నాగరికతలో విలీనమైందని నిర్ధారించే ప్రయత్నం చెయ్యడం అవాస్తవం, అచారిత్రకం అవుతుంది. 


ఏడవదిగా నిర్ణయించబడిన 1206–1707 సంవత్సరాల మధ్య భారతదేశం పేపర్ చాలా వివాదాలకు చోటిస్తోంది. సాధారణంగా‘ముస్లిం యుగం’గా పిలువబడే ఈ మధ్యయుగ పాఠ్య ప్రణాళికలో ముస్లిం పాలకులు, ముస్లిం రాజ్యాలు అనే మత పరమైన గుర్తింపు నివ్వకుండా ఆఫ్ఘనులు, మొఘలులు అనే జాతినామాలను వాడడం అభినందనీయమే. అయితే కొన్ని రోజుల పాటు మాత్రమే ఢిల్లీని చేజిక్కించుకున్న హేము విక్రమాదిత్యకు దక్కిన చోటు అతన్ని ఓడించి దాదాపు అర్ధశతాబ్దం పాలించి మహా చక్రవర్తి అనిపించుకున్న అక్బర్‌కు దొరకలేదు. చాలాకాలంగా ఎదురుచూస్తున్న రాణాప్రతాప సింహుడికి ఈ సిలబస్‌లో బెర్త్ దొరికింది. కానీ షేర్షా, షాజహాన్ లాంటి హేమాహేమీలు స్థానం కోల్పోయారు. అంటే వీళ్లందరి చరిత్ర పూర్తిగా తొలగించబడిందని అర్థం కాదు. వీరి పాలనాకాలం చరిత్ర అధ్యయనంలో భాగమే అయ్యింది కానీ, వీరి పేర్లకు సిలబస్‌లో స్థలం దొరకలేదు. వీరిని ఎదిరించిన హిందూవీరుల పేర్లు మాత్రం ప్రముఖస్థానం పొందాయి. మతసహన ప్రతీక అయిన అక్బర్‌కు దొరకని చోటు మత విద్వేషి అని పేరున్న ఔరంగజేబ్‌కు దొరకడంలో లోగుట్టు మనకు ఇట్టే తెలిసిపోతుంది. మధ్య యుగాల్లో జరిగిన దేవాలయ విధ్వంసానికీ, మతాంతీకరణకు చిహ్నంగా చూపడానికి ఔరంగజేబ్ అవసరమైనట్లుంది. అందుకే సిలబస్‌లో పెద్ద పెద్ద అక్షరాల్లో దర్శనమిచ్చాడు. శివాజీ హిందూ రాజ్య స్థాపనను వ్యతిరేకించడానికి కూడా ఒక ప్రతినాయకుడు కావాలి కాబట్టి ‘జేబ్’కు పెద్ద పీటే దక్కింది. 1526లో కాబూల్ నుంచి వచ్చి ఢిల్లీని చేజిక్కించుకున్న బాబర్ ఆగమనం invasion (దండయాత్ర) కాదనీ, expansion (విస్తరణ) అనీ వ్యాఖ్యానిస్తున్న కాలంలో ఈ సిలబస్ దాన్ని మళ్లీ invasion గానే పేర్కొంది. అంతే కాదు, హిందూ సంస్కృతి, ముస్లిం సంస్కృతి అనే రెండు వేర్వేరు ఉపశీర్షికలను ఉంచిన సిలబస్ ఆ రెండిటి సమ్మేళనం లోంచే మహత్తరమైన భారతీయ సంస్కృతి పుట్టిందనే ముగింపుకు రాలేకపోయింది.


పదవ పేపరైన భారత జాతీయోద్యమం కూడా పాక్షిక దృష్టికి మినహాయింపు కాలేదు. ప్రారంభంలోనే జాతీయ భావం ఆవిర్భవించడానికి కారణాలు అనే ఉపశీర్షిక ఉంది. భారత్ భావన పేపర్‌లో భారత్ అనే భావన అనాదిగా అవిచ్ఛిన్నంగా ఉందని ప్రతిపాదిస్తున్న సిలబస్ మళ్లీ 19వ శతాబ్దంలో పుట్టిందని అంగీకరించడమేమిటనే ప్రశ్నకు జవాబుండదు. ఈ పేపర్‌లో నిర్ణయించిన సిలబస్‌కు ఒక అంతస్సూత్రం ఉన్నట్లు కనిపించదు. ఇది చదివే విద్యార్థికి తను ప్రపంచంలోనే తొలిసారి జరిగిన ఒక మహత్తర అహింసాయుత ప్రజాస్వామిక ఉద్యమాన్ని అధ్యయనం చేస్తున్న భావన కలగదు. ఉద్యమానికి చోదక శక్తి అయిన భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావం కన్నా దేశాన్ని చీల్చిన ముస్లిం లీగ్ ఆవిర్భావమే ఇక్కడ ప్రాముఖ్యం సంతరించుకుంది. నౌరోజీ, రానడే, గోఖలే, తిలక్‌లు నిలబడడానికే అవకాశం లేనిచోట హిందు మహాసభ బాధ్యుడైన మాలవ్యకు చక్కటి ఆసనం దొరికింది. కిసాన్ సభ నాయకులైన ఎన్‌జి రంగా, సహజానంద సరస్వతుల మధ్య తూగిన త్రాసు సహజానంద వైపే మొగ్గింది. ఉపశీర్షికలో నైనా గాంధీ ఉన్నందుకు సంతోషించవలసిందే. 1942–47 మధ్య మతతత్వానికి స్థలం దొరికింది కానీ పాఠంగా దాని నిర్వహణ ఎలా ఉండబోతోందో ఊహించడం కష్టం కాదు. గిరిజన, రైతు, ట్రేడ్ యూనియన్, వామపక్ష ఉద్యమాలకు సముచిత స్థానమే దొరికింది కానీ మహిళల, దళితుల ఊసు లేదు. గాంధీ రాజకీయ ఉద్యమానికి సమాంతరంగా నడిపిన హరిజనోద్ధరణ, మద్యపాన నిషేధం వంటి నిర్మాణాత్మక కార్యక్రమాలకు చోటు దొరకాలనుకోవడం అత్యాశే అవుతుంది కానీ, స్వామి దయానంద సరస్వతి, స్వామి వివేకానంద వంటి అస్మదీయుల పాత్ర ఉన్న 18, 19 శతాబ్దాల నాటి సాంస్కృతిక పునరుజ్జీవనానికి కూడా కాల దోషం పట్టడం అత్యంత ఆశ్చర్యకరం. పునరుజ్జీవనం అంటే మళ్లీ జీవం పోసుకోవడం. మళ్లీ పోసుకోవాలి అంటే ఒకప్పుడు జీవించి, తర్వాత మరణించి ఉండాలి. ఏ దశలోనైనా సరే మరణించిందని అంగీకరించడానికి సిద్ధంగా లేకపోవడమే ఆ అంశం చేర్చకపోవడానికి కారణమా? సతీసహగమనాన్ని నిషేధింప జేసినందుకు రాజా రామమోహనరాయ్‌నీ, తొలి వితంతువివాహం జరిపించినందుకు ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌నీ బలిపీఠం ఎక్కించినట్లేనా? ఇప్పుడిప్పుడే జాతీయస్థాయి చరిత్ర గ్రంథాల్లో చోటు సంపాదించుకుంటున్న మన వీరేశలింగం చిరునామా ఇక లేనట్లే కదా!


ఒక దేశ చరిత్రను నిర్మించుకోవడం అంటే ఆ దేశ వ్యక్తిత్వాన్ని నిర్మించడమే. పుట్టిన ప్రదేశమూ, పరిసరాలు, ఆర్థిక సామాజిక స్థితిగతులతో పాటు ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని నిర్మించడంలో ఆత్మసౌందర్యం ముఖ్యపాత్ర వహిస్తుంది. అలాగే, దేశ భౌగోళిక పరిస్థితులు, వాతావరణం, నదీనదాలు, అడవులు, కొండలతో పాటు అక్కడి మనుషుల సామూహిక వ్యక్తిత్వం ఒక దేశపు ఆత్మను నిర్మిస్తుంది. ఏ వ్యక్తిత్వమైనా మంచి చెడుల మిశ్రమంగా ఉంటుంది. వ్యక్తిలోని ఉదాత్తతే ఒక మనిషిని మనిషిని చేస్తుంది. దేశాన్ని దేశం చేసేది కూడా అదే. నీగ్రిటోలు, ఆస్ట్రోలాయిడ్‌లు అనే మూలవాసులకు మధ్యధరా తీరం నుంచి వచ్చిన ద్రావిడులు, మధ్య ఆసియా నుంచి వచ్చిన ఆర్యులు కలవడంతో రూపొందడం ఆరంభమైన భారత జాతి పారశీకుల్ని, గ్రీకుల్ని, అరబ్బుల్ని, తురుష్కుల్ని, ఆఫ్ఘన్‌లనీ, యూరోపియన్‌లనీ కలుపుకుని ఒక అపురూపమైన జాతిగా పరిణామం చెందింది. బహుళత్వమే భారతదేశపు వ్యక్తిత్వం. అదే రాజ్యాంగంలో లౌకికత్వంగా రూపుకట్టింది. ఒక జాతి జన్మించదు, రూపొందుతుంది అన్న సత్యాన్ని అర్థం చేసుకుంటే ఒక దేశ చరిత్రను శిలాసదృశం చేసే ఇటువంటి ప్రయత్నాలకు కాలం చెల్లుతుంది.

కొప్పర్తి వెంకటరమణమూర్తి

Updated Date - 2021-08-01T06:05:37+05:30 IST