వస్త్ర నగరిపై కొత్త ఆశలు

ABN , First Publish Date - 2021-07-22T05:53:50+05:30 IST

ఎట్టకేలకు వరంగల్‌ మెగా వస్త్ర పరిశ్రమకు మంచి రోజులు రాబోతున్నాయి. పునాది రాయి పడిన ఐదేళ్లకు యూనిట్లను నెలకొల్పుతామంటూ కార్పొరేట్‌ సంస్థలు ముందుకొస్తున్నాయి. సూరత్‌ నుంచి వచ్చిన గణేశా సంస్థ ఇప్పటికే షెడ్‌లను మొదలుపెట్టగా, కొరియాకు చెందిన ఎంగ్‌ టీ సంస్థ పలుమార్లు స్థల పరిశీలన చేసి వెళ్లింది. తాజాగా కేరళ రాష్ట్రానికి చెందిన కైటెక్స్‌ సంస్థ రూ.వెయ్యి కోట్లతో యూనిట్లను ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం 150 ఎకరాల స్థలం కేటాయించమంటూ టీఎస్‌ ఐపాస్‌ ద్వారా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. ఈ మూడు సంస్థల ద్వారా 25వేల ఉద్యోగ అవకాశాలు వస్తాయంటూ పాలకులు ఆశలు కల్పిస్తున్నారు.

వస్త్ర నగరిపై కొత్త ఆశలు
సూరత్‌కు చెందిన గణేశా సంస్థ నిర్మిస్తున్న షెడ్డు

ఏడాదిలో పరిశ్రమలు షురూ..
స్థానికులకే అవకాశం అంటున్న నేతలు
ఆశగా ఎదురుచూస్తున్న యువత
త్వరలో కైటెక్స్‌ యూనిట్‌


ఎట్టకేలకు వరంగల్‌ మెగా వస్త్ర పరిశ్రమకు మంచి రోజులు రాబోతున్నాయి. పునాది రాయి పడిన ఐదేళ్లకు యూనిట్లను నెలకొల్పుతామంటూ కార్పొరేట్‌ సంస్థలు ముందుకొస్తున్నాయి. సూరత్‌ నుంచి వచ్చిన గణేశా సంస్థ ఇప్పటికే షెడ్‌లను మొదలుపెట్టగా, కొరియాకు చెందిన ఎంగ్‌ టీ సంస్థ పలుమార్లు స్థల పరిశీలన చేసి వెళ్లింది. తాజాగా కేరళ రాష్ట్రానికి చెందిన కైటెక్స్‌ సంస్థ రూ.వెయ్యి కోట్లతో యూనిట్లను ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం 150 ఎకరాల స్థలం కేటాయించమంటూ టీఎస్‌ ఐపాస్‌ ద్వారా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. ఈ మూడు సంస్థల ద్వారా 25వేల ఉద్యోగ అవకాశాలు వస్తాయంటూ పాలకులు ఆశలు కల్పిస్తున్నారు.

ఆంధ్రజ్యోతి, వరంగల్‌ రూరల్‌

సరిగ్గా ఐదేళ్ల అనంతరం వస్త్ర నగరిపై కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుగొండ- సంగెం మండలాల సరిహద్దులో 1200 ఎకరాల్లో మెగా వస్త్ర పరిశ్రమకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2017 అక్టోబరు 22న శంకుస్థాపన చేశారు. దసరా రోజే శంకుస్థాపన జరగడంతో ఆ రోజే సీఎం సమక్షంలో 22సంస్థలు తమ యూనిట్లను స్థాపించేందుకు ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకున్నాయి. ఇప్పటివరకు సూరత్‌ నుంచి వచ్చిన గణేశా సంస్థ షెడ్‌లను మొదలుపెట్టగా, కొరియాకు చెందిన ఎంగ్‌ టీ సంస్థ పలుమార్లు స్థల పరిశీలన చేసి వెళ్లింది. శంకుస్థాపన రోజు ఒప్పందం చేసుకున్న వాటికి సైతం భూ కేటాయింపులు జరిగినా, యూనిట్ల ఏర్పాటుకు అడుగు పడలేదు. తాజాగా కేరళ రాష్ట్రానికి చెందిన కైటెక్స్‌ సంస్థ తాము రూ.వెయ్యి కోట్లతో యూనిట్లను ఏర్పాటు చేస్తామని ముందుకొచ్చింది. ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని హెలిక్యాప్టర్‌లో హైదరాబాద్‌ నుంచి వరంగల్‌ తీసుకొచ్చి అతిథి మర్యాదలను చేసింది. తెలంగాణ పరిశ్రమల పాలసీని మెచ్చుకున్న కైటెక్స్‌ సంస్థ.. యూనిట్‌ ఏర్పాటు కోసం 150 ఎకరాల స్థలం కేటాయించమంటూ టీఎస్‌ ఐపాస్‌ ద్వారా దరఖాస్తు చేసుకుంది. ఈ సంస్థ ఏర్పాటుతో 10వేల మందికి ఉపాధి లభించనుందని ప్రజాప్రతినిధులు గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే కైటెక్స్‌ సంస్థలో కుట్టుమిషన్‌ పనివచ్చిన వారి వివరాలను సేకరించి మండలాల వారీగా ఓ జాబితా తయారు చేసుకున్నారు. ప్రస్తుతం వరంగల్‌లో ఏర్పాటయ్యే మూడు సంస్థల ద్వారా 25వేల ఉద్యోగ అవకాశాలు వస్తాయంటూ ఆశలు కల్పిస్తున్నారు.

ఒక్క సంస్థ మాత్రమే...

ఈ టెక్స్‌టైల్‌ పార్కులో 22 సంస్థలు ఒప్పందాలు చేసుకోగా వాటిలో గణేశా సంస్థ మాత్రమే షెడ్ల నిర్మాణాలను మొదలుపెట్టింది. గతేడాది వరకు మౌలిక సదుపాయాల కింద రహదారులు, విద్యుత్‌ సౌకర్యాలు కల్పించారు. సూరత్‌ సంస్థ మినహా మరే సంస్థ తమకు కేటాయించిన భూముల్లో పనులను మొదలు పెట్టని పరిస్థితి కనిపిస్తోంది. కొరియా సంస్థ ఎంగ్‌ టీ 261 ఎకరాల స్థలాన్ని కేటాయించగా, ఎలాంటి నిర్మాణాలను ప్రారంభించలేదు. కొరియా సంస్థ ఒప్పంద పత్రాల సమయంలో తమ సంస్థ తరపున 1500 మందికి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామంటూ పేర్కొనగా, సూరత్‌ సంస్థకు 50ఎకరాల భూమిని పరిశ్రమల కోసం కేటాయించగా, 500 మందికి ఉపాధి అవకాశాలను కల్పించనున్నట్టు పేర్కొంది. తాజాగా కేరళ సంస్థ అయిన కైటెక్స్‌ సంస్థకు భూ కేటాయింపులు జరిగితే మరో 500 మందికి ప్రత్యక్షంగా మరో వెయ్యి మందికి పైగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు రానున్నాయి.

ఖాళీగా 400 ఎకరాలు

టెక్స్‌టైల్‌ పార్కులో ప్రస్తుతం పరిశ్రమల ఏర్పాటు కోసం 400 ఎకరాల అందుబాటులో ఉంది. మొత్తం 1200 ఎకరాల్లో 800 ఎకరాలను పలు సంస్థలకు కేటాయించగా, మిగిలిన 400 ఎకరాలను కొత్తగా ఏర్పాటు చేసేవారి కోసం అందుబాటులో ఉంది. పరిశ్రమల స్థాపన కోసం సమగ్రమైన ప్రాజెక్టు రిపోర్టు, ఎంఎ్‌సఎంఈలో ఫర్మ్‌ రిజిస్ట్రేషన్‌, నిధుల సమీకరణ, ఏ రకమైన ఇండస్ట్రీ (వీవింగ్‌, మెషీన్లు, మాన్యువల్‌, రోబోటిక్‌), ఎంత మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తారో వంటి వివరాలను ప్రాథమికంగా టీఎస్‌ ఐ-పాస్‌ పోర్టల్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇండస్ట్రీ, ఉపాధి అవకాశాల కల్పనను పరిగణలోకి తీసుకొన్న అనంతరం పరిశ్రమల శాఖ నామినల్‌ రేట్‌కు స్థలాన్ని కేటాయించనుంది.

ఆశలన్నీ కొలువులపైనే...

టెక్స్‌టైల్‌ పార్కులో కొలువు కోసం స్థానికులు కోటి ఆశలు పెట్టుకున్నారు. సంగెం, గీసుగొండ మండలాలకు చెందిన 731 మంది పట్టాదార్లు స్వచ్ఛందంగా భూమిని వస్త్ర పరిశ్రమ కోసం ఇచ్చారు. మొత్తం 1190 ఎకరాలను రూ.87.78 కోట్ల వ్యయంతో సేకరించగా, ఇందులో 170.5 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కూడా పార్కుకు బదలాయించారు. టెక్స్‌టైల్‌ పార్కులో వస్ర్తాలు, లుంగీలు, దుప్పట్లు తయారీతో పాటుగా స్పిన్నింగ్‌, జిన్నింగ్‌ యూనిట్లు ఏర్పాటు కానున్నాయి. మొత్తం ఐదు దశల్లో స్పిన్నింగ్‌, టెక్స్‌టైల్‌, వీవింగ్‌, నిట్టింగ్‌, ప్రాసెసింగ్‌, ఊవెన్‌, ఫ్యాబ్రిక్‌, యార్న్‌ డైయింగ్‌, టవల్‌ షీటింగ్‌, ప్రింటింగ్‌ , రెడీమేడ్‌ యూనిట్లను నెలకొల్పనున్నారు. ఈ వస్త్ర పరిశ్రమలో మొత్తం 172యూనిట్ల స్థాపనకు అంచనాలను టీఎ్‌సఐఐసీ రూపొందించింది. వస్త్ర పరిశ్రమ ద్వారా లక్షన్నర మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఎలాంటి ఉద్యోగాలు స్థానికులకు దక్కుతాయనే అంశంపై చర్చ జరుగుతోంది.  

పరిశ్రమల రాకతో పత్తికి డిమాండ్‌
మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ నిర్మాణంతో పత్తికి డిమాండ్‌ పెరగనుంది. దీంతో రైతులు సాగు చేసిన పత్తికి ప్రభుత్వ మద్దతు ధర కన్నా ఎక్కువ లభించే అవకాశాలున్నాయి. కొన్ని దశాబ్దాలుగా రైతులు వ్యవసాయ మార్కెట్‌లకు పత్తిని విక్రయిస్తూ వస్తున్నారు. మార్కెట్‌లో వ్యాపారుల సిండికేట్‌, దళారుల మోసాలకు గురై గిట్టుబాటు ధర లభించక, పెట్టిన పెట్టుబడులు చేతికందక రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. టెక్స్‌టైల్‌ పార్క్‌ నిర్మాణం జరిగితే నేరుగా పత్తిని పరిశ్రమకు తరలించి విక్రయించే వెసులుబాటు కలుగుతుంది. వరంగల్‌ రూరల్‌ జిల్లాలో ఏటా 79వేల హెక్టార్లలో పత్తి పంట సాగవుతుండగా, ఉమ్మడి జిల్లాలో 3 నుంచి 4 లక్షల హెక్టార్లలో సాగవుతోంది. సాగైన పత్తిని స్థానిక పరిశ్రమలలోనే విక్రయించుకునే అవకాశాలు ఏర్పడి నష్టాల ఊబి నుంచి రైతులు గట్టెక్కే అవకాశాలు మెరుగుపడతాయి.







Updated Date - 2021-07-22T05:53:50+05:30 IST