వర్గీకరణపై తీర్పుతో కొత్త ఆశలు

ABN , First Publish Date - 2020-09-22T06:32:28+05:30 IST

ఎస్సీలను ఎబిసిడిలుగా వర్గీకరించాలని కోరుతూ 25 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా సాగించిన ఉద్యమం తర్వాత అయిదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం...

వర్గీకరణపై తీర్పుతో కొత్త ఆశలు

ఈ తీర్పు తర్వాత మాదిగలలో కొత్త ఆశలు చిగురించాయి. సుప్రీంకోర్టు ఫుల్‌బెంచ్‌ తీర్పు కూడా తమకు అనుకూలంగా ఉండాలని వారు కోరుకుంటున్నారు. ఇకపోతే తదుపరి దశలో, రిజర్వేషన్లను వర్గీకరించడానికి అవకాశం కల్పించే బిల్లుకు కేంద్రం చట్టబద్ధత కల్పించాలి. వర్గీకరణ డిమాండ్‌ ఉన్న రాష్ట్రాలు జనాభా ప్రాతిపదికన తమ తమ రాష్ట్రాలలో దానిని వర్తింపజేసే బిల్లులను ఆమోదింపజేసి చట్టం చేయాలి.


ఎస్సీలను ఎబిసిడిలుగా వర్గీకరించాలని కోరుతూ 25 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా సాగించిన ఉద్యమం తర్వాత అయిదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు మాదిగ జాతికి కొత్త ఊరటనిచ్చింది. 1999లో ఎస్సీలను ఎబిసిడిలుగా విభజిస్తూ అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఆర్డినెన్స్‌ అమలులోకి తెచ్చింది. నాటి నుంచి 2004 వరకు అది అమలయింది. ఈ క్రమంలో వర్గీకరణ ఉద్యమం అనేక మలుపులు తిరుగుతూ ఎన్నో ఎత్తుపల్లాలు చూసింది. 1994 జూలై 7న ప్రారంభమైన ఈ ఉద్యమం ఆనాడు సమాజం, పార్టీల మద్దతు పొందింది. 1996లో నాటి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై జస్టిస్‌ రామచంద్రరాజు కమిషన్‌ను నియమించింది. ఆ కమిషన్‌ నివేదిక ఆధారంగా 1997లో అసెంబ్లీలో వర్గీకరణ చట్టం చేసింది. అయితే ఎస్సీలను ఎబిసిడిలుగా విభజించే అధికారం రాష్ట్రాలకు లేదని అదే సంవత్సరం రాష్ట్ర హైకోర్టు దాన్ని కొట్టివేసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్‌ రివ్యూ పిటిషన్‌ వేసింది. ఇక్కడే కథంతా మలుపు తిరిగింది. మాలమహానాడు నాయకులు అప్పటి లోక్‌సభ స్పీకర్‌ దగ్గరకు వెళ్ళి, ‘ఇక వర్గీకరణ పార్లమెంటు చట్టం ద్వారా జరుగుతుంది, స్పీకర్‌గా మీరే బిల్లును ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. దీంతో మాలలు మిమ్మల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తారు’ అని చెప్పి సందిగ్ధంలో పడేశారు.


అప్పుడు జియంసి బాలయోగి మందకృష్ణ మాదిగను బుజ్జగించే ప్రయత్నం చేశారు. వర్గీకరణ కావాలంటే ఎస్సీ కమిషన్‌ సిఫారస్‌ కావాలి. మరి సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వపు కేసు కొనసాగితే తీర్పు రావడానికి చాలా సంవత్సరాలు పడుతుందని ఒప్పించారు. బాలయోగి మాటలు నమ్మిన మందకృష్ణ చంద్రబాబుని ఒప్పించి స్పెషల్‌ రివ్యూ పిటిషన్‌ని ప్రభుత్వం ఉపసంహరించుకునేలా చేశారు. ఫలితంగా మందకృష్ణ 1999 ఎన్నికల్లో టిడిపికి మద్దతు తెలిపారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. జాతీయ ఎస్సీ కమిషన్‌ నివేదిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చెయ్యొచ్చని ఆనాటి ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ హనుమంతప్ప నివేదిక ఇచ్చారు. దాని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను అమలులోకి తీసుకువచ్చింది. ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ మాలమహానాడుకు చెందిన చిన్నయ్య సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఆయన అభిప్రాయంతో ఏకీభవిస్తూ, ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్‌ అమలు చేయడం రాజ్యాంగ విరుద్ధమేనని, కేంద్రం చట్టం ద్వారానే ఇది అమలు జరగాలి తప్ప రాష్ట్రాలకు ఆ అధికారం లేనే లేదని 2004లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అప్పటిదాకా ఆంధ్రప్రదేశ్‌లో వర్గీకరణ అమలులోనే ఉంది. పంజాబ్‌, హర్యానాల్లో అప్పటివరకు వాల్మీకి, మజిబి కులాలకు వర్తింపచేస్తున్న రిజర్వేషన్లు కూడ సుప్రీంకోర్టు తీర్పుతో రద్దయ్యాయి. ఈ వ్యవహారంలో ఎక్కడా మందకృష్ణ మాదిగ కనపడలేదు. పైగా మాలమహానాడు నాయకుడు పివి రావుతో ఒప్పందం చేసుకుని సుప్రీంకోర్టుకు వెళ్ళనని రాజీపడ్డారు. ఈ ఒప్పందం వెనుక చీకటి కోణం ఏమిటో ఇంకా మాదిగ నాయకులకు అర్థం కాలేదు. పంజాబ్‌ ప్రభుత్వం వాల్మీకి, మజిబి కులాలకు కోటాకు సంబంధించి వేసిన రివ్యూ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తమ ఎంఆర్‌పిఎస్‌ ఉద్యమం సాధించిన విజయమని మందకృష్ణ ఇప్పుడు చాటుకుంటున్నారు. 


ఈ తీర్పు తర్వాత మాదిగలలో కొత్త ఆశలు చిగురించాయి. సుప్రీం కోర్టు ఫుల్‌బెంచ్‌ తీర్పు కూడా తమకు అనుకూలంగా ఉండాలని వారు కోరుకుంటున్నారు. ఇకపోతే తదుపరి దశలో, రిజర్వేషన్లను వర్గీకరించడానికి అవకాశం కల్పించే బిల్లుకు కేంద్రం చట్టబద్ధత కల్పించాలి. వర్గీకరణ డిమాండ్‌ ఉన్న రాష్ట్రాలు జనాభా ప్రాతిపదికన తమ తమ రాష్ట్రాల్లో దానిని వర్తింపజేసే బిల్లులను ఆమోదింపజేసి చట్టం చేయాలి. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వర్గీకరణపై అసెంబ్లీలో తీర్మానం చేయటమే కాకుండా ఆనాటి డిప్యూటీ ముఖ్య మంత్రి కడియం శ్రీహరితో కలిసి తీర్మానం కాపీని ప్రధానికి అందజేశారు. కేంద్రం చట్టం చేశాక తెలంగాణలో వర్గీకరణ ఎలాంటి ఆటంకాలు లేకుండా అమలవుతుంది. ఎటొచ్చీ ఆంధ్రా సీఎం జగన్‌ అక్కడ ఈ వర్గీకరణకు వ్యతిరేకంగా ఉన్నారు. చివరి దశ మాదిగ ఉద్యమంలో భాగంగా విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులు ముందు వరుసలో నిలబడి ఉద్యమాన్ని ఉధృతం చేసి కేంద్రంపై మరింత ఒత్తిడి తీసుకురావాలి. 

పిడమర్తి రవి

Updated Date - 2020-09-22T06:32:28+05:30 IST