నవ భావాలతోనే నవ భారతం

ABN , First Publish Date - 2022-08-16T06:24:12+05:30 IST

త్రివర్ణ శోభితమైన భారతదేశం! ఆగస్టు 13 నుంచి 15 వరకు భారత దేశంలో ఎక్కడకు వెళ్లినా, ఏ వీధిలో చూసినా, మారుమూల గ్రామాల్లోనైనా త్రివర్ణ పతాకాలు రెపరెపలాడాయి....

నవ భావాలతోనే నవ భారతం

త్రివర్ణ శోభితమైన భారతదేశం! ఆగస్టు 13 నుంచి 15 వరకు భారత దేశంలో ఎక్కడకు వెళ్లినా, ఏ వీధిలో చూసినా, మారుమూల గ్రామాల్లోనైనా త్రివర్ణ పతాకాలు రెపరెపలాడాయి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సామాన్యుల ఇళ్ల పై కప్పుల నుంచి అపార్ట్‌మెంట్ బాల్కనీల వరకూ త్రివర్ణ పతాకాలు కనువిందు చేశాయి. ఎన్నడూ లేని విధంగా భారతదేశంలో ఈ ఉత్సాహం ఎందుకు కనిపిస్తోంది? ప్రజలు తమ జాతీయ జెండాను ఎందుకింత తమ హృదయాలకు హత్తుకుంటున్నారు? దేశభక్తి ఎవరో చెబితే వచ్చేది కాదు. అది ఇవాళ ప్రజల గుండెల నిండా కనపడడానికి ప్రధాన కారణం ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వం పట్ల గౌరవం ఉండడం. ఆయన నాయకత్వంలో దేశం సర్వతోముఖాభివృద్ది చెందుతుందని, తమ జీవితాలు సురక్షితంగా ఉంటాయని, తమ కలలు నెరవేరుతాయన్న నమ్మకం ఉండడం. నిజమైన స్వాతంత్ర్య ఫలాలు సాధించడం గత ఎనిమిదేళ్లలోనే ప్రారంభమయ్యాయని ప్రజలు గ్రహించడం.


ఆజాద్ కీ అమృత మహోత్సవ్ నిర్వహించాలని, వచ్చే పాతికేళ్లను అమృతకాలంగా భావించి దేశం ఎదుర్కొంటున్న అనేక జాడ్యాలను వదుల్చుకునేందుకు పోరాడాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ గత ఏడాదిగా అనేక సందర్భాల్లో ప్రకటిస్తూనే ఉన్నారు. చరిత్ర గమనంలో మైలురాళ్లను మనం స్మరించుకోవాలని, స్వాతంత్ర్యం కోసం పోరాడి అసువులు బాసినప్పటికీ చరిత్రపుటల్లోకెక్కని వీరులను కూడా మనం గౌరవించుకోవాలని ఈ అమృత మహోత్సవాల్లో భాగంగా ప్రభుత్వం ప్రజలకు పిలుపునిచ్చింది. ఆ పిలుపునకు అనుగుణంగా బిజెపికి చెందిన నేతలందరూ దేశంలో నలుమూలలా వెళ్లి అనేకమంది స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుని ప్రజల్లో స్ఫూర్తి రగిల్చారు. భారతదేశాన్ని ఒక బలమైన ప్రజాస్వామిక, ఆధునిక దేశంగా తీర్చిదిద్దిన నిర్ణయాలను, ఆలోచనలను కూడా నేటి యువత, విద్యార్థుల ప్రేరణ కోసం గుర్తు తెచ్చుకునేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టారు. భవిష్యత్ కోసం నిర్దిష్ట లక్ష్యాలను కూడా ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వం ప్రజల ముందుంచింది. ఒక వినూత్న, ఆత్మనిర్భర్ భారత్‌ను సాధించాలని, రేపటి భారత్ ఎలా ఉండబోతుందో నేడే ప్రజలకు తెలియజేయాలని, సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించుకుంటూ ఒక ఆధునిక, పురోగామి దృక్పథంతో ప్రపంచంలో ఒక అగ్రరాజ్యంగా భారత్‌ను రూపొందించాలన్నదే ఈ ఆజాద్ కీ అమృత మహోత్సవ్ లక్ష్యం. పరిపాలన, అభివృద్ధి, టెక్నాలజీ, సంస్కరణలు, విధానాలు అంతటా ఈ లక్ష్యాలు ప్రతిఫలించాలన్నదే మోదీ లక్ష్యం.


స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జన్మించిన నేత నరేంద్ర మోదీ. విభజన గాయాల నుంచి దేశం తేరుకుంటున్న సమయంలో ఆయన జన్మించారు. భారత రాజ్యాంగం రూపుదిద్దుకుంటున్న సమయంలో జన్మించిన మోదీ మనోఫలకంలో దేశంలో సంస్థానాల విలీనం కోసం సర్దార్ పటేల్ చేసిన కృషి, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కశ్మీర్ కోసం చేసిన ప్రాణత్యాగం, భారత్‌తో పాకిస్థాన్, చైనా యుద్ధాలు ప్రగాఢంగా నిలిచిపోయాయి. బాల్యంలోనే దేశ భక్తిని ఆయన నరనరాల్లో జీర్ణించుకున్నారు. ఈ దేశానికి ఏమైనా చేయాలన్న ఆలోచనల మధ్య ఆయన 17 ఏళ్ల వయస్సులో అన్ని బంధాలను వదుల్చుకుని దాదాపు మూడేళ్ల పాటు ఉత్తర భారతంలో అనేక ప్రాంతాలను పర్యటించి పరిస్థితులను ఆకళింపు చేసుకున్నారు. ఆ తర్వాత ఒక నిర్దిష్ట లక్ష్యంతో ప్రజా సేవలో నిమగ్నమయ్యారు. ఆ లక్ష్య సాధనలో భాగంగానే 13 ఏళ్ల పాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా నిర్వర్తించారు. గత ఎనిమిదేళ్లుగా ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.


ఇటీవల ప్రధానమంత్రి కార్యాలయం వెబ్‌సైట్‌లో ఇచ్చిన తాజా సమాచారం ప్రకారం మోదీకి ఎలాంటి స్థిరాస్తులూ లేవు. ఏ కంపెనీల్లోనూ వాటాలు లేవు. స్వంత కారు సైతం లేదు. మనీలాండరింగ్ కేసుల్లో భవిష్యత్‌లో ఈడీ, సిబిఐ చుట్టూ తిరగాల్సిన దుస్థితీ ఆయనకు లేదు. ఇలాంటి ప్రధాని తనకంటూ ఆర్జించడానికి ఏ లక్ష్యం పెట్టుకోకుండా కేవలం దేశాభివృద్ధి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పెట్టుకోకుండా ఎలా ఉంటారు? అందుకే ఆజాద్ కీ ఆమృత మహోత్సవ్ గురించి కానీ, హర్ ఘర్ తిరంగా గురించి కానీ ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపును ప్రజలు హృదయ పూర్వకంగా స్వీకరించారు. గత మూడు రోజుల్లో దేశమంతటా త్రివర్ణ పతాకం రెపరెపలాడడం, ఉప్పొంగిన దేశ భక్తితో ప్రజలు వ్యవహరించడం ఇందుకు నిదర్శనం.


ప్రపంచం మన వైపు గర్వంగా, ఎన్నో ఆశలతో ఎదురు చూస్తోందని 75వ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో మోదీ పిలుపునిచ్చారు. భారతదేశంలో జరుగుతున్న మార్పును ప్రపంచం ఆసక్తితో గమనిస్తుందనడంలో సందేహం లేదు. ఇందుకు కారణం గత ఎనిమిదేళ్లలో 130 కోట్ల మంది భారత ప్రజల సమష్టి శక్తి ఏమిటో రుజువు కావడమే. వలసపాలన గురించిన భావ దాస్యం ఇంకా మనను వదల్లేదు. ఈ దాస్యానికి సంబంధించిన జాడలను తుడిచివేసి, సమున్నత సంకల్పాలను నిర్ణయించుకుని ముందుకుసాగాలని, మన వారసత్వం పట్ల గర్విస్తూనే, సమష్టిగా దేశాన్ని అభివృద్ధి చేయాలని, ప్రధానమంత్రి నుంచి సామాన్యుడి వరకు దేశం పట్ల తన కర్తవ్యం ఏమిటో నిర్ణయించుకుని పనిచేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఈ లక్ష్యాలనే ఆయన పంచ ప్రాణాలుగా అభివర్ణించారు.


ఏ ప్రధానీ ప్రస్తావించని రెండు ప్రధాన అంశాలను నరేంద్రమోదీ తన స్వాతంత్ర్య దిన ప్రసంగంలో ప్రస్తావించారు. అవి : ఆశ్రిత పక్షపాతం, అవినీతి. ఆశ్రిత పక్షపాతం వల్ల బడా వ్యాపారులు లక్షల కోట్లు బ్యాంకులకు ఎగవేశారు. ప్రజలకు వెళ్లే ప్రతి సంక్షేమ కార్యక్రమంలోనూ మధ్య దళారులు ఎంతో స్వాహా చేశారు. ప్రత్యక్ష ప్రయోజనాల బదిలీ, ఆధార్, మొబైల్ అనుసంధానం ద్వారా ఇవాళ ప్రజలకు నేరుగా నిధుల బదిలీ జరగడంతో గత ఎనిమిదేళ్లుగా రూ.2 లక్షల కోట్లకు పైగా దళారీలు స్వాహా చేయలేకపోయారు. బ్యాంకులను లూటీ చేసి విదేశాలకు పారిపోయిన వారి కోట్లాది రూపాయల ఆస్తులను దేశంలో స్వాధీనం చేసుకున్నారు. వారిని వెనక్కి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అవినీతిపై పోరాటం ఉధృతం చేసి ఒక నిర్ణాయక లక్ష్యాన్ని చేరుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మోదీ ప్రకటించారు. ఈ లక్ష్య సాధనకోసం తనను ప్రజలు ఆశీర్వదించాలని కూడా మోదీ ఎర్రకోట నుంచి దేశ ప్రజలను అభ్యర్థించారు. దేశంలో అనేక చోట్ల పేరుకున్న వారసత్వ పాలనపై జరిపే ఉద్యమంలో అందరి సహకారం కావాలని కూడా ఆయన అభ్యర్థించారు. ఇవాళ ప్రపంచంలో ఏదో ఒక దేశంతో మనను మనం పోల్చుకోవాల్సిన అవసరం లేదు. మన స్వంత ప్రమాణాలను మనం రూపొందించుకుని ఇతర దేశాలకే మనం ఆదర్శంగా నిలవాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రపంచం ఇచ్చే సర్టిఫికెట్లు చూసుకుని ఉప్పొంగడం భావ దాస్యమని, 130 కోట్ల మంది ప్రజల భారతదేశం ప్రపంచానికే ఉదాహరణగా నిలవాలని మోదీ పిలుపునిచ్చారు. ప్రతి భారతీయుడూ గర్వించే పిలుపు కాదా ఇది?


వై. సత్యకుమార్

(బీజేపీ జాతీయ కార్యదర్శి)

Updated Date - 2022-08-16T06:24:12+05:30 IST