కసరత్తు షురూ

ABN , First Publish Date - 2021-06-23T05:29:42+05:30 IST

హన్మకొండ, వరంగల్‌ జంట పట్టణాలు ఇక రెండు జిల్లాల కేంద్రాలుగా మారుతున్నాయి. ఎప్పటి నుంచో ప్రచారంలో ఉన్న హన్మకొండ, వరంగల్‌ జిల్లాల ఏర్పాటు ఇపుడు కార్యరూపం దాల్చుతోంది.

కసరత్తు షురూ

హన్మకొండ (వరంగల్‌ అర్బన్‌), వరంగల్‌ (వరంగల్‌ రూరల్‌) జిల్లాల సరిహద్దుల్లో పలు మార్పులు
2011 జనాభా ప్రాతిపదికన రెండు జిల్లాల కూర్పు
హన్మకొండ జిల్లా పరిధిలోకి వర్ధన్నపేట, రాయపర్తి, పర్వతగిరి మండలాలు?
వరంగల్‌ జిల్లా పరిధిలోకి వరంగల్‌, ఖిలా వరంగల్‌ మండలాలు?


వరంగల్‌ అర్బన్‌, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)
:  హన్మకొండ, వరంగల్‌ జంట పట్టణాలు ఇక రెండు జిల్లాల కేంద్రాలుగా మారుతున్నాయి. ఎప్పటి నుంచో ప్రచారంలో ఉన్న హన్మకొండ, వరంగల్‌ జిల్లాల ఏర్పాటు ఇపుడు కార్యరూపం దాల్చుతోంది.  రెండు పట్టణాల పేరుతో జిల్లాలు ఏర్పాటు చేస్తామని సోమవారం  ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన విషయం విదితమే.  దీంతో అధికార యంత్రాంగం జిల్లాల ఏర్పాటుకు సంబంధించి తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తోంది.  జిల్లాల విభజనను నియోజకవర్గ కేంద్రం సరిహద్దుగా చేయాలా... రెవెన్యూ మండలాల సరిహద్దుల ఆధారంగా  చేయాలా అన్న చర్చ సాగింది. రెవెన్యూ మండలాల ఆధారంగానే జిల్లాల విభజన ఏర్పాటు చేస్తున్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా నుంచి వరంగల్‌  పట్టణం అంటే వరంగల్‌, ఖిలా వరంగల్‌ రెవెన్యూ మండలాలు పాత వరంగల్‌ రూరల్‌ జిల్లా (ఇపుడు వరంగల్‌ జిల్లా)లో కలుస్తున్నాయి. ఈ రెండు మండలాల జనాభాకు అనుగుణంగా వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని మండలాలను హన్మకొండ జిల్లాలో కలిపేందుకు కసరత్తు చేస్తున్నారు..

మండలాలే సరిహద్దులు
జిల్లాల విభజన రెవెన్యూ మండలాల సరిహద్దుల ఆధారంగానే జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు నూతన జిల్లాల ఏర్పాటు సైతం ఇదే విధంగా జరిగింది. వరంగల్‌ పట్టణంలో రెండు మండలాలు ఉన్నాయి. ఒకటి వరంగల్‌, రెండు ఖిలావరంగల్‌. ఇవి అర్బన్‌ జిల్లా నుంచి కొత్తగా ఏర్పడే వరంగల్‌ జిల్లాలో ఉంటాయి. ఇప్పటివరకు వరంగల్‌ రూరల్‌ జిల్లాలో ఉన్న వర్ధన్నపేట, రాయపర్తి, పర్వతగిరి మండలాలు ఇపుడు కొత్తగా ఏర్పడే హన్మకొండ జిల్లాలోకి మారుస్తున్నారు. 2011 జనాభా గణన ప్రకారం వరంగల్‌ అర్బన్‌ జిల్లా జనాభా 10,80,858, వరంగల్‌ రూరల్‌  జిల్లా జనాభా 7,18,537 ఉంది. వీటి నుంచి వరంగల్‌ మండలం జనాభా 1,49,786 కాగా, ఖిలావరంగల్‌ జనాభా 1,72,108 మొత్తం 3,21,894 ఉంటుంది. తగ్గిన ఈ జనాభాను వర్ధన్నపేట - 48,446, రాయపర్తి - 56,189 , పర్వతగిరి - 47,639 మొత్తం 1,52,274 అవుతుంది. పాత జనాభాతో పోలిస్తే దాదాపు 1,50,000 జనాభా తగ్గుతుంది. ఇందుకోసం రూరల్‌ జిల్లాలోని సమీప ఇతర మండలాలను కలిపేందుకు అధికారులు యోచిస్తున్నారు..

ఒకే జిల్లాలోకి వర్ధన్నపేట నియోజకవర్గం
ఇప్పటి వరకు వరంగల్‌ రూరల్‌, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో ఉన్న వర్ధన్నపేట నియోజకవర్గం పూర్తి హన్మకొండ జిల్లాలో ఉంటుంది. దీంతో పూర్తి స్థాయిలో హన్మకొండ జిల్లాలో వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గంతో పాటు  వర్ధన్నపేట  నియోజక వర్గం ఉంటుంది.  హుస్నాబాద్‌, హుజురాబాద్‌, స్టేషన్‌ ఘన్‌పూర్‌,  పాలకుర్తి నియోజకవర్గాలు పాక్షికంగా ఉంటాయి. కొత్తగా ఏర్పడే వరంగల్‌ జిల్లాలో పూర్తిస్థాయిలో పరకాల నియోజకవర్గం, నర్సంపేటలతో పాటు వరంగల్‌ తూర్పు నియోజకవర్గాలు ఉంటాయి. పాక్షికంగా భూపాలపల్లి నియోజకవర్గం ఉంటుంది.

మిల్లు స్థలంలో కలెక్టరేట్‌
నూతనంగా ఏర్పడే వరంగల్‌ జిల్లా కేంద్రం ఆజంజాహిమిల్లు గ్రౌండ్‌లో ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. జిల్లా కలెక్టరేట్‌ ఏర్పాటు చేసేందుకు  ఆజంజాహి మిల్లు గ్రౌండ్‌తో పాటు, పాత సెంట్రల్‌ జైలు వెనుక వైపు ఉన్న ఆటోనగర్‌ ప్రాంతంలో జిల్లా కలెక్టరేట్‌ నిర్మించే ప్రతిపాదనలు ఉన్నాయి. ఆటోనగర్‌ ప్రాంతంలో కలెక్టరేట్‌ నిర్మించాలంటే ఇప్పటికే అక్కడ ఉన్న వారందరికీ ప్రత్నామ్నాయ స్థలం చూపించాల్సి ఉంటుంది. ఆజంజాహిమిల్లు గ్రౌండ్‌లో అయితే ఎలాంటి నిర్మాణాలు లేవు. అందువల్ల నిర్మాణాలు సులభంగా జరుగుతాయన్న భావనలో ఉన్నారు. అయితే ఆ పక్కనే బీపీసీఎల్‌ భారీ నిల్వకేంద్రాలు, భారీ నిర్మాణాలకు ఆటంకంగా మారే అవకాశాలు ఉంటాయన్న వాదన కూడా లేక పోలేదు. వరంగల్‌, హన్మకొండ జిల్లాల ఏర్పాటుకోసం అధికారులు తుది రూపం ఇస్తున్నారు. ఆగమేఘాల మీద సరిహద్దులు, జనాభా, భౌగోళిక, తదితర అన్నిరకాల అంశాలను పరిశీలించి మంగళవారమే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు సమాచారం.





Updated Date - 2021-06-23T05:29:42+05:30 IST