నెరవేరిన కల

ABN , First Publish Date - 2022-09-27T05:37:35+05:30 IST

నెరవేరిన కల

నెరవేరిన కల

మరో రెండు మండలాలు ఆవిర్భావం

ఇనుగుర్తి, సీరోలు కేంద్రాలుగా ఏర్పాటు

ఉత్తర్వులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

మహబూబాబాద్‌ జిల్లాలో ఇక 18 మండలాలు


మహబూబాబాద్‌, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి) : ఎట్టకేలకు సొంత మండలాల కల నెరవేరింది. ఇన్నాళ్లు దీక్షలు, పోరాటాలు, వివిధ రకాలుగా తమ వాదనను వినిపించిన ఇనుగుర్తివాసుల కోరిక తీరింది. మహబూబాబాద్‌ జిల్లాలో ఇనుగుర్తి, సీరోలు నూతన మండలాలుగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వు 101, తేది 26-09-2022 పేరిట ఆదేశాలు విడుదల చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం 16 మండలాలతో ఉన్న జిల్లా తాజా ప్రకటనతో సీరోలు, ఇనుగుర్తితో కలిపి 18 మండలాల జిల్లాగా విస్తరించింది. సోమవారం రాత్రి రాష్ట్రంలో పలు నూతన మండలాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  ఇందులో మహబూ బాబాద్‌ జిల్లాలో రెండు మండలాలు ఉన్నాయి. ఏడేళ్లుగా ఇనుగుర్తిని మండలం చేయాలని మండల సాధన సమితి, అఖిలపక్షం ఆధ్వర్యంలో ఉద్యమం ఉధృతంగా కొనసాగింది. స్థానిక ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ కొన్నేళ్లుగా ఇనుగుర్తి మండలం కోసం పలుమార్లు అసెంబ్లీలో ప్రస్తావి ంచడమేకాకుండా నేరుగా సీఎంకు విన్నవించి తీవ్రంగా కృషి చేస్తూ వచ్చారు. రెండు నెలల క్రితం ప్రకటించిన నూతన మండలాల్లో ఇనుగుర్తి లేకపోవడంతో ఎమ్మెల్యేతో సహా జిల్లా ప్రజాప్రతినిధులంతా మూకుమ్మడిగా మండలం సాధించేందుకు సిద్ధమయ్యారు. జిల్లాకు చెందిన మంత్రు లు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌, ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, మాలోత్‌ కవిత, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిలు కలిసి ఇనుగుర్తి మండలం ఏర్పాటు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రగతి భవన్‌లో కలిసి విజ్ఞప్తి చేశారు. ఎట్టకేలకు ఐదు రెవెన్యూ గ్రామాలతో ఇనుగుర్తి, ఆరు గ్రామాలతో సీరోలును ఏర్పాటు చేస్తూ తుది ప్రకటనను విడుదల చేశారు. దీంతో ఆయా మండలాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 

Updated Date - 2022-09-27T05:37:35+05:30 IST