అంగనవాడీ కేంద్రాల్లో వచ్చే నెల నుంచి కొత్త మెనూ

ABN , First Publish Date - 2022-06-30T06:41:02+05:30 IST

అంగనవాడీ కేంద్రాల్లో వచ్చే నెల మొదటి వారం నుంచి కొత్త మెనూ అమలు కానుంది. వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకంలో భాగంగా ఇక నుంచి అంగనవాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజనం పెట్టనున్నారు. అక్కడే వంటలు చేసి పోషకాహార లోపం, రక్తహీనతతో బాధపడుతున్న పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పోషక విలువలతో కూడిన భోజనం పెడతారు.

అంగనవాడీ కేంద్రాల్లో వచ్చే నెల నుంచి  కొత్త మెనూ
అంగనవాడీ కేంద్రంలో భోజనాలు చేస్తున్న చిన్నారులు (పాత చిత్రం)

  • మండపేట, జూన 29: అంగనవాడీ కేంద్రాల్లో వచ్చే నెల మొదటి వారం నుంచి కొత్త మెనూ అమలు కానుంది. వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకంలో భాగంగా ఇక నుంచి అంగనవాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజనం పెట్టనున్నారు. అక్కడే వంటలు చేసి పోషకాహార లోపం, రక్తహీనతతో బాధపడుతున్న పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పోషక విలువలతో కూడిన భోజనం పెడతారు. అమలులో ప్రణాళికాయుతంగా వ్యవహరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటికే అరకొర వసతుల నడుమ నడుస్తున్న తమకు కొత్త మెనూ అమలు భారమవుతుందని నిర్వాహకులు చెప్తున్నారు. కేంద్రాలకు అవసరమైన వంట సామగ్రి, కుక్కర్లు, గ్యాస్‌ కొరత పట్టిపీడిస్తున్నాయి. గతంలో ఇచ్చిన వంట సామాన్లు చాలాచోట్ల పాడైపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో వేడివేడిగా మధ్యాహ్న భోజనం అమలు సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వంట చేయడం కష్టం కాదు కానీ... నిత్యావసర ధరలు బాగా పెరిగినందున కొనుగోలు చేయడం కష్టమ వుతుందంటున్నారు. ప్రభుత్వం కందిపప్పు, నూనె, బియ్యం, కోడిగుడ్లు మాత్రమే సరఫరా చేస్తుంది. ఆకు కూరలు, చింతపండు, పసుపు, ఉప్ప, మసాలా దినుసులు వగైరా బయటి నుంచి కొనుగోలు చేయాలి. పోపు సామగ్రి, వంట గ్యాస్‌ సిబ్బందే కొనాలి. ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి పోపు సామగ్రి నిమిత్తం రూ.1.40, గ్యాస్‌ నిమిత్తం 50 పైసలు ఇస్తుంది. ఇవి ఏమూలకూ రావంటున్నారు. పదేళ్ల క్రితం నాటి చార్జీలనే ఇస్తుండడంతో తమ చేతి చమురు వదులుతోందని వాపోతున్నారు. ప్రస్తుతం నిత్యావసరాల ధరలు నాలుగింతలు పెరిగాయని, అందుకు తగ్గట్టుగా ధరలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

సోమవారం 

తల్లులకు: అన్నం, దోసకాయ పప్పు, ఉడికించిన గుడ్డు, కూర, 200 మి.లీ. పాలు

పిల్లలకు: అన్నం, ఆకుకూర, పప్పు, ఉడికించిన గుడ్డు, 200 మి.లీ. పాలు

మంగళవారం 

తల్లులకు: అన్నం, ఆకుకూర, పప్పు, ఉడికించిన గుడ్డు, కూర, 200 మి.లీ. పాలు, 

పిల్లలకు: అన్నం, ఆకుకూర, పప్పు, ఉడికించిన గుడ్డు, 200 మి.లీ పాలు, 

బుధవారం 

తల్లులకు: అన్నం, ఆకు కూర, ఉడికించిన గుడ్డు, కూర, 200 మి.లీ. పాలు

పిల్లలకు: పులిహోర, టమాట పప్పు, ఉడికించిన గుడ్డు, 200 మి.లీ. పాలు

గురువారం 

తల్లులకు: ఎగ్‌ ఫ్రైడ్‌రైస్‌, ఆకు కూర, కూరగాయలతో సాంబారు

పిల్లలకు: అన్నం, కూర, సాంబారు, ఉడికించిన గుడ్డు, 200 మి.లీ. పాలు, 

శుక్రవారం 

తల్లులకు: అన్నం, బీరకాయ (లేదా) సొరకాయ పప్పు, మునగాకు (లేదా) 

పాల కూరతో ఉడికించిన గుడ్డు, 200 మి.లీ. పాలు

పిల్లలకు: అన్నం, బీరకాయ (లేదా) సొరకాయ పప్పు, మునగాకు (లేదా) 

పాల కూరతో ఉడికించిన గుడ్డు, 200 మి.లీ. పాలు

శనివారం 

తల్లులకు: వెజిటబుల్‌ రైస్‌, ఆకు కూర, కూరగాయలతో సాంబారు, ఉడికించిన గుడ్డు,

200 మి.లీ. పాలు 

పిల్లలకు: వెజిటిబుల్‌ రైస్‌, ఆకు కూర, కూరగాయలతో సాంబారు, ఉడికించిన గుడ్డు,

200 మి.లీ. పాలు


Updated Date - 2022-06-30T06:41:02+05:30 IST