కొత్త మంత్రులు.. విశేషాలు

ABN , First Publish Date - 2022-04-11T08:20:14+05:30 IST

కొత్త మంత్రులు.. విశేషాలు

కొత్త మంత్రులు.. విశేషాలు

ఉన్నత విద్య నుంచి రాజకీయాల్లోకి కాకాణి  

రాష్ట్ర కేబినెట్‌లో చోటు దక్కించుకున్న కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఉన్నత విద్యను అభ్యసించి రాజకీయాల్లోకి వచ్చారు. 2014, 2019 ఎన్నికల్లో సర్వేపల్లి నుంచి ఆయన వైసీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన స్వస్థలం పొదలకూరు మండలం తోడేరు. తండ్రి రమణారెడ్డి 18 ఏళ్లపాటు పొదలకూరు సమితి అధ్యక్షుడిగా, తల్లి లక్ష్మీకాంతమ్మ 25 ఏళ్లపాటు తోడేరు సర్పంచిగా పని చేశారు. 1964 నవంబరు 10న పుట్టిన గోవర్ధన్‌రెడ్డి మైసూరు యూనివర్సిటీలో సివిల్‌ ఇంజనీరింగ్‌, దూరవిద్య ద్వారా పెరియార్‌ యూనివర్సిటీలో ఎంబీఏ, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ పట్టభద్రులయ్యారు. విక్రమ సింహపురి యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్నారు. 2006 జడ్పీటీసీ ఎన్నికల్లో సైదాపురం నుంచి పోటీచేసి గెలిచారు. ఏకగ్రీవంగా జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం అసెంబ్లీ ప్రివిలేజ్‌ కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. ఆయనకు భార్య విజిత, కుమార్తెలు పూజిత, సుచిత్ర ఉన్నారు.


ధర్మానకు నాలుగోసారి మంత్రి హోదా 

శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం మబగాం గ్రామానికి చెందిన ధర్మాన ప్రసాదరావు 1958 మే 21న జన్మించారు. 1983లో మబగాం సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 1987లో పోలాకి మండల ఎంపీపీగా పనిచేశారు. 1987లో తొలిసారి  నరసన్నపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. నేదురమల్లి జనార్దనరెడ్డి హయాంలో 1991 నుంచి 94వరకు చేనేత, మధ్యతరహా సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2004లో శ్రీకాకుళం ఎమ్మెల్యేగా గెలుపొంది 2009 వరకు రెవెన్యూ మంత్రిగా వైఎస్సార్‌ కేబినెట్‌లో పనిచేశారు. 2009 నుంచి 2014 వరకు రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ మంత్రిగా పనిచేశారు. 2014లో వైసీపీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. 2019లో శ్రీకాకుళం ఎమ్మెల్యేగా గెలుపొందారు.


తణుకు నుంచి తొలి మంత్రి కారుమూరి 

తణుకు నుంచి తొలిసారి మంత్రి పదవి పొందిన వ్యక్తిగా కారుమూరి వెంకట నాగేశ్వరరావు నిలిచారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన రామకృష్ణ, సూర్యకాంతమ్మ దంపతులకు అత్తిలిలో 1964 అక్టోబరు 2న కారుమూరి జన్మించారు. పదో తరగతి వరకు చదివిన ఆయన వ్యాపార రంగంలో ఉండేవారు. 2006లో ద్వారకాతిరుమల జడ్పీటీసీగా గెలిచి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 2014లో దెందులూరు నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2019లో తణుకు నుంచి గెలిచారు. 


కొట్టు సత్యనారాయణకు లక్కీ చాన్స్‌

తాడేపల్లిగూడెం శాసన సభ్యుడు కొట్టు సత్యనారాయణ స్వగ్రామం ఉంగుటూరు మండలం పట్టంపాడు. ఇంటర్‌ వరకు చదివిన ఆయన తండ్రి బాటలోనే వ్యాపారం మొదలు పెట్టారు. 1994లో రాజకీయ జీవితం ప్రారంభించారు. 2004లో తాడేపల్లిగూడెం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా విజయం సాధించారు. 2009, 2014లో ఓటమి పాలయ్యారు. 2019లో వైసీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. ఆయన తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచే రెండుసార్లు గెలిచారు. ఇప్పటి వరకూ ఎమ్మెల్యేగా, ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. 


బంగారం షాపు నుంచి... దాడిశెట్టి ప్రస్థానం 

దాడిశెట్టి రాజా తాత నరసయ్య బంగారం దుకాణం ప్రారంభించారు. అయన అనంతరం తండ్రి శంకరరావు కూడా అదే వ్యాపారాన్ని కొనసాగించారు. డిగ్రీ చదివిన రాజా ఆయనకు చేదోడు వాదోడుగా ఉండేవాడు. ప్రముఖ సినీ నటుడు చిరంజీవి అభిమాని అయిన రాజా, తునిలో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించినా.. టికెట్టు దక్కలేదు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ నేత యనమల రామకృష్ణుడు సోదరుడు కృష్ణుడుపై గెలుపొందారు. 


వార్డు స్థాయి నుంచి మంత్రిగా బూడి 

వ్యవసాయ కుటుంబానికి చెందిన ముత్యాలనాయుడు 1981లో రాజీవ్‌గాంధీ గ్రామ యువజన సంఘం అధ్యక్షుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టారు. యూత్‌ కాంగ్రె్‌సలో జిల్లా, రాష్ట్రస్థాయి పదవులు నిర్వహించారు. 1984లో యువజన కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షునిగా వ్యవహరించారు. కొణతాల రామకృష్ణతో కలిసి ‘రైవాడ నీరు రైతులకే’ అనే నినాదంతో పాదయాత్ర చేశారు. 2006లో కొత్తపెంట ఎంపీటీసీగా ఎన్నికయ్యారు. 2008లో దేవరాపల్లి ఎంపీపీ పదవి చేపట్టారు. వైఎస్‌ మరణం తరువాత 2010లో వైసీపీలో చేరారు. 2014లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 ఎన్నికల్లోనూ విజయం సాధించి ప్రభుత్వ విప్‌గా నియమితులయ్యారు. 


జోగి.. యూత్‌ కాంగ్రెస్‌ నుంచి మంత్రి దాకా..

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన జోగి రమేశ్‌ డిగ్రీ పూర్తయిన తర్వాత తన బంధువుల వైన్‌ షాపుల్లో లెక్కలు రాసే పని నిమిత్తం విజయవాడలో పనిచేశారు. లగడపాటి రాజగోపాల్‌ ఎంపీగా పనిచేసిన కాలంలో జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిని జోగికి ఇప్పించారు. వైఎస్‌ హయాంలో 2009లో కాంగ్రెస్‌ తరపున పెడన నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో మైలవరం నుంచి వైసీపీ తరపున పోటీచేసి ఓడిపోయారు. 2019లో పెడన నుంచి ఎమ్మెల్యేగారు. జోగి రమేశ్‌ తండ్రి మోహనరావు 1987లో ఇబ్రహీంపట్నం ఎంపీపీగా పనిచేశారు.


వైఎస్‌ కుటుంబానికి విధేయుడు రాజన్నదొర

పార్వతీపురం మన్యం జిల్లాలో సాలూరు(ఎస్టీ) నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పీడిక రాజన్నదొర మొదటి నుంచీ వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబానికి విధేయుడుగా ఉన్నారు. సీఎం జగన్‌ వద్ద కూడా అలానే కొనసాగారు. 1985లో గిరిజన సహకార సంస్థలో అసిస్టెంట్‌ మేనేజర్‌గా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు. 2004 ఫిబ్రవరి 29న ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. అదే సంవత్సరం కాంగ్రెస్‌ పార్టీ తరఫున సాలూరు నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. అనూహ్యంగా 2006 మార్చి 9న కోర్టు తీర్పుతో ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగు పెట్టారు. 2009లో కాంగ్రెస్‌ నుంచి, 2014, 2019లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 


నాగార్జున.. ప్రొఫెసర్‌ నుంచి మినిస్టర్‌ 

ఉమ్మడి గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం వెల్లటూరుకు చెందిన మేరుగ నాగార్జున రాజకీయాల్లోకి రాకముందు ఆంధ్రా యూనివర్సిటీలో కామర్స్‌ ప్రొఫెసర్‌గా పనిచేశారు. 2007లో ఆయన ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా పనిచేశారు. వైసీపీ ఎస్సీ సెల్‌ ప్రెసిడెంట్‌గానూ పనిచేసిన ఆయన 2009, 2014లో వేమూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. 2019లో విజయం సాధించారు. మంత్రివర్గ విస్తరణలో భాగంగా జగన్‌ కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు.   


న్యాయవాద వృత్తి నుంచి అంబటి 

రాష్ట్ర కేబినెట్‌లో తాజాగా చోటు లభించిన అంబటి రాంబాబు న్యాయవాద వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. గుంటూరు జిల్లా రేపల్లెలో ఏవీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, వెంకటసుబ్బమ్మ దంపతులకు జన్మించిన ఆయన 1986లో బీఎల్‌ పూర్తి చేశారు. న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించి, కాంగ్రెస్‌ పార్టీ ద్వారా రాజకీయ రంగప్రవేశం చేశారు. 1988లో జిల్లా లీగల్‌సెల్‌ కన్వీనర్‌గా నియమితులయ్యారు. 1989లో రేపల్లె నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1994లో అక్కడి నుంచే పోటీ చేసి ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో తిరిగి సత్తెనపల్లి నుంచే పోటీ చేసి గెలుపొందారు. నెడ్‌క్యాప్‌ చైర్మన్‌గా, ఏపీఐఐసీసీ చైర్మన్‌గానూ పనిచేశారు. వైసీపీ అధికార ప్రతినిధిగానూ ఉన్నారు. ఆయనకు భార్య విజయలక్ష్మి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.  


సేవా కార్యక్రమాలతో ఉషశ్రీ రాణింపు

రాష్ట్ర కేబినెట్‌లో చోటు దక్కించుకున్న కురుబ విరుపాక్షప్పగారి ఉషశ్రీ చరణ్‌ సేవా కార్యక్రమాలతో రాజకీయాల్లో రాణిస్తున్నారు. తాజా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఆమెకు మంత్రి పదవి దక్కింది. 16-07-1976న అనంతపురం జిల్లా రాయదుర్గంలో డాక్టర్‌ కే విరుపాక్షప్ప, కేవీ రత్నమ్మ దంపతులకు జన్మించిన ఆమె ఎమ్మెస్సీ పూర్తి చేశారు. 2012లో తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2014లో తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. సామాజిక సేవా కార్యక్రమాలూ కొనసాగిస్తున్నారు. 2019లో కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి 19,896 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆమెకు భర్త శ్రీచరణ్‌, సంతానం దివిజిత్‌ శ్రీచరణ్‌, జయనా శ్రీచరణ్‌ ఉన్నారు. 


సినిమా నుంచి రాజకీయాల్లోకి రోజా 

రాష్ట్ర కేబినెట్‌లో చోటు దక్కించుకున్న నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా తొలుత సినిమాల్లో రంగప్రవేశం చేశారు. ఆమె సొంతూరు చిత్తూరు జిల్లాలోని చింతపర్తి. 1972లో నాగరాజరెడ్డి, లలిత దంపతులకు ఆమె జన్మించారు. శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. కూచిపూడి కూడా నేర్చుకున్న ఆమె సినిమాల్లో రంగప్రవేశానికి ముందు నృత్య ప్రదర్శనలు కూడా ఇచ్చారు. 1991లో సినిమాల్లోకి రంగప్రవేశం చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ సినిమాల్లోనూ ఆమె నటించారు. 1999లో రాజకీయ రంగప్రవేశం చెశారు. తొలుత తెలుగుదేశం పార్టీలో ఆమె చేరారు. 2004లో నగరి, 2009లో చంద్రగిరి నియోజకవర్గాల నుంచి టీడీపీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీలో చేరి 2014, 2019లలో నగరి నుంచి రెండుసార్లు గెలుపొందారు. ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌గా కూడా పనిచేశారు. తాజా కేబినెట్‌  పునర్వ్యవస్థకరణలో మంత్రిగా ఆమెకు అవకాశం లభించింది. ఆమె భర్త సినిమా డైరెక్టర్‌ ఆర్కే సెల్వమణి. వీరి పిల్లలు అన్షుమాలిక, కృష్ణలోహిత్‌.  


పిన్న వయసులోనే అమాత్యుడిగా అమర్‌నాథ్‌ 

విశాఖ నగరంలోని మింది ప్రాంతంలో రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు గుడివాడ అమర్‌నాథ్‌. ఆయన తాత గుడివాడ అప్పన్న కాంగ్రె్‌స(ఐ) తరపున 1978లో పెందుర్తి ఎమ్మెల్యేగా గెలిచారు. తండ్రి గురునాఽథరావు 1989లో పెందుర్తి ఎమ్మెల్యేగా విజయం సాధించి మంత్రిగా పనిచేశారు. 1998 మధ్యంతర ఎన్నికల్లో అనకాపల్లి నుంచి లోక్‌సభకు పోటీచేసి ఎంపీ అయ్యారు. గురునాఽథరావు మరణం తరువాత ఆయన భార్య నాగమణి 2004లో టీడీపీలో చేరి పెందుర్తి నుంచి పోటీచేసి ఓటమి చెందారు. తరువాత 2009లో విశాఖ పశ్చిమ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అమర్‌ 2007లో టీడీపీ నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. డిప్యూటీ ఫ్లోర్‌ లీడరుగా పనిచేశారు. 2011లో వైసీపీలో చేరారు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా, అనకాపల్లి నియోజకవర్గం ఇన్‌చార్జిగా పనిచేశారు. 2014లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో అనకాపల్లి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 


28 ఏళ్లకే ఎమ్మెల్యే... 31 ఏళ్లకు మంత్రిగా రజనీ  

రాష్ట్ర కేబినెట్‌లో మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న విడదల రజనీ 28 ఏళ్లకే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 15వ అసెంబ్లీలో అతి పిన్న వయస్కురాలిగా ఉన్న ఆమెకు మరో అరుదైన అవకాశం దక్కింది. 31 ఏళ్లకే అమె మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. పల్నాడు జిల్లా, నరసరావుపేట పార్లమెంటు పరిధిలో తొలి మహిళా మంత్రిగా గుర్తింపు పొందనున్నారు. 

Updated Date - 2022-04-11T08:20:14+05:30 IST