కొత్త ప్రభాత ప్రార్థన

ABN , First Publish Date - 2021-01-01T06:19:24+05:30 IST

...ఎక్కడ భారతీయ అస్తిత్వం కుల మతాల, ప్రాంతీయ అభిజాత్యాలతో విభజితమవకుండా పౌరసత్వంతో నిర్ధారితమై తేజరిల్లుతుందో...

కొత్త ప్రభాత ప్రార్థన

ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మనుషులు తలలెత్తి తిరుగుతారో...


బాధాకర, అల్లకల్లోల 2020 సంవత్సరం కాలవాహినిలో కలిసిపోయింది. కొత్త సంవత్సర ఆగమనాన్ని స్వాగతించే సమయం, సరికొత్త ఆశాభావం చిగురించే శుభ తరుణం. బెంగాల్ ఎన్నికలు ఆసన్నమయినందున నేతలు మళ్ళీ రవీంద్రనాథ్ టాగోర్‌ను కనుగొన్నారు కదా! 2021లో మన పురా నవ భారతావనిలో ఉదయించాల్సిన నవోదయాల కోసం ఆ మహర్షి, ఆ మహాకవి ‘గీతాంజలి’ స్ఫూర్తితో ఒక ప్రార్థన. 


...ఎక్కడ భారతీయ అస్తిత్వం కుల మతాల, ప్రాంతీయ అభిజాత్యాలతో విభజితమవకుండా పౌరసత్వంతో నిర్ధారితమై తేజరిల్లుతుందో; ఎక్కడ రాజ్యవ్యవస్థలు, అధికార సంస్థలు ఏ మతం పట్ల పక్షపాతం లేదా వివక్ష చూపకుండా అన్ని మతాలను సమానంగా గౌరవించడమే రాజ్యాంగ లౌకికవాదానికి ప్రాతిపదికగా ఉండితీరాలన్న ఆధునిక ప్రజాస్వామ్య సత్యాన్ని మన నేతలు గ్రహించి, గౌరవిస్తారో..


ఎక్కడ ప్రేమప్రపూరిత మతాంతర వివాహం ‘లవ్ జిహాద్’గా నిరసింపబడదో; ఎక్కడ పరస్పర అంగీకారంతో సహజీవనం చేస్తున్న వయోజన జంట తమ ప్రేమను ఒక జిల్లా కలెక్టర్ లేదా స్థానిక పోలీసు అధికారికి నిరూపించవలసిన (ఉత్తరప్రదేశ్‌లో పరిణామాలను గమనిస్తున్నారా?) అవసరం లేదో; ఎక్కడ గో మాంసం తినడం నేరంగా పరిగణన పొందదో; ఏమి తినాలి, ఏ బట్టలు ధరించాలి, ఎవరిని ప్రేమించాలి, వివాహం చేసుకోవాలి, ఆమాటకొస్తే ఏ మతాన్ని అనుసరించాలి అనేవి వ్యక్తిగత స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు సంబంధించిన వ్యవహారాలుగా గుర్తించి పౌరుల వైయక్తిక జీవితాలలో ఎటువంటి జోక్యం చేసుకోకుండా రాజ్యవ్యవస్థ ఎక్కడ కచ్చితంగా ప్రవర్తిస్తుందో..


ఎక్కడ ధర్మాగ్రహంతో రగిలిపోతున్న రైతులపై బాష్పవాయు గోళాలను ప్రయోగించరో లేదా ఎముకలు కొరికే చలిలో రోజుల తరబడి గడపవలసిన అగత్యాన్ని ఆ మట్టి మనుషులకు కల్పించరో; ఎక్కడ బతుకును బుగ్గి పాలు చేస్తున్న సమస్యలను పరిష్కరించాలని ఆక్రోశిస్తున్న అన్నదాతను ఏలికలు అనుమానించరో; ఎక్కడ సంప్రదాయ తలపాగా ధరించిన సిక్కు మతస్థుడిని ఒక ఖలిస్థానీగా కాకుండా ఒక కిసాన్ పుత్రుడుగా ఆదరిస్తారో; ఎక్కడ ‘జై జవాన్, జై కిసాన్’ ఒక నిరర్థక నినాదం కాదో; ఎక్కడ సరిహద్దుల రక్షణలో ఉన్న సైనికుడికి మెరుగైన సదుపాయాలు, హలాలతో పొలాలు దున్ని రాజనాలు పండించే కిసాన్‌కు మరింత మెరుగైన ఆదాయ భద్రత సమకూరుస్తారో..


ఎక్కడ ప్రభుత్వాధినేత హుకుంతో కాకుండా సంప్రదింపుల ప్రక్రియతో కీలక చట్టాలను ఆమోదిస్తారో; ఎక్కడ సంబంధిత చట్ట ప్రభావితులు అందరూ శాసన నిర్మాణ పూర్వ దశ చర్చల్లో భాగస్వాములు అవుతారో; ఎక్కడ భిన్నాభిప్రాయాల వ్యక్తీకరణను నేరంగా పరిగణించరో; ఎక్కడ ప్రభుత్వ నిర్ణయాలు, చర్యలకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న విద్యార్థులు, విద్యావేత్తలు, మానవ హక్కుల కార్యకర్తలతో చర్చలు జరిపితీరాలో; సదరు ఆందోళనకారులను ఎక్కడ కఠోర ఉగ్రవాద నిరోధక చట్టాల కింద ‘జాతి-వ్యతిరేకులు’గా ముద్రవేసి జైళ్ళలో నిర్బంధించడం జరగదో; ఎక్కడ పౌరులకు దేశభక్తులుగా ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడమనేది రాజకీయ వేత్తల వ్యవహారం కాబోదో..


ఎక్కడ వివిఐపీలుగా చెలామణీ అవుతున్న వారికి కాకుండా , నిజంగా ప్రాణహాని లేదా తీవ్ర ఆరోగ్యముప్పు ఎదుర్కొంటున్న వారికి కరోనా వ్యాక్సిన్‌ను అందుబాటులో ఉంచాలో; ఎక్కడ ఒక నిర్దిష్ట సామాజిక సమూహాన్ని కరోనా విషక్రిమిని వ్యాప్తిచేస్తున్న జన సముదాయంగా ఏ ఒక్కరూ భావించరో, ఎక్కడ నాణ్యమైన వైద్య చికిత్సలు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా ఆరోగ్య భద్రతా వ్యవస్థలను అభివృద్ధి పరుస్తారో; లాభాలకు, లాభార్జనా యావకూ మధ్య ఉన్న తేడాను ప్రైవేట్ వైద్య సంస్థలు గుర్తిస్తాయో; ఎక్కడ బృహత్ విగ్రహాలు, భారీ స్మారక చిహ్నాల నిర్మాణానికి కాకుండా ప్రశస్త ప్రమాణాలతో కూడిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక పాఠశాలలను నిర్మించేందుకై బడ్జెట్ కేటాయింపులు భారీగా చేస్తారో..


ఎక్కడ మూఢ విశ్వాసాలను నిర్మూలించి శాస్త్ర విజ్ఞానం జయపతాక ఎగురవేస్తుందో; ఎక్కడ ‘తాలీ,   థాలీ బజావో’ (చప్పట్లూ, పళ్ళేల మోతలు) లాంటి రుగ్మతలను రూపుమాపడంలో వైద్య సేవలు విజయం సాధిస్తాయో; ఎక్కడ శిలాజ ఇంధనాలకు కాకుండా స్వచ్ఛ ఇంధన వనరులకు ప్రాధాన్యం లభిస్తుందో; ఎక్కడ వాయు కాలుష్యం వార్షిక ఉపద్రవంగా పరిణమించదో; ఎక్కడ పర్యావరణ సమస్యలు తక్షణ ప్రాధాన్యంతో పరిష్కరింపబడతాయో; ఎక్కడ అడవుల విచక్షణారహిత నరికివేతను నిలిపి, పర్యావరణ వ్యవస్థలను కాపాడుకోవలసిన అవసరాన్ని మనం గుర్తించవలసి ఉన్నదో..


ఎక్కడ పట్టణ, నగర నిరుపేదల దుస్థితిని గుర్తించేందుకు ఒక మహమ్మారి విరుచుకు పడవలసిన అవసరం ఉండదో; ఎక్కడ ఆపత్కాలంలో కట్టుబట్టలతో వందలాది కిలోమీటర్ల దూరంలోఉన్న స్వస్థలాలకు నడిచి వెళ్ళవలసిన దుస్థితి ఎవరికీ దాపురించకుండా ఉంటుందో..


ఎక్కడ ‘ప్రధానమంత్రి కేర్స్ ఫండ్’ ప్రైవేట్ విరాళాలు స్వీకరిస్తున్నదనే నెపంతో సమాచార హక్కు చట్టం పరిధిలోకి రాదనే వాదన న్యాయసమ్మతం కాబోదో; పన్నుల రూపేణా తాము చెల్లిస్తున్న డబ్బును ప్రభుత్వం ఏ విధంగా ఖర్చు చేస్తుందనే సమాచారాన్ని తెలుసుకునే హక్కు ఎక్కడ సామాన్య పౌరునికి ఉంటుందో; ఎక్కడ ఎన్నికల వ్యయాలకు సమకూరే నిధులు మరింత పారదర్శకంగా సమకూరడం జరుగుతుందో; అతిగా దుర్వినియోగమవుతున్న ఎన్నికల బాండ్ల పథకాన్ని అడ్డుతోవలో వినియోగించుకుంటున్న రాజకీయ దాతల వివరాలను వెల్లడించడంలో ‘ప్రజాహితం’ ఏమీలేదన్న వైఖరిని సమాచార కమిషన్ ఎక్కడ అనుసరించదో..


కొత్త పార్లమెంటు భవనం కన్నా పార్లమెంటరీ ప్రజాస్వామ్య సమున్నత స్ఫూర్తిని తొట్టతొలుత పునరుద్ధరించడం ఎక్కడ జరుగుతుందో; ఎక్కడ ప్రజాస్వామ్యం ఒక అధినేత సర్వాధిపత్యం కాకుండా అధికార వ్యవస్థ వికేంద్రీకరణను ప్రోత్సహిస్తుందో; ఎక్కడ రాజకీయ పార్టీలు ఒక కుటుంబ వారసత్వ ఆస్తులుగా ఉండవో; ఎక్కడ నేతల వైయక్తిక ప్రతిభా పాటవాల ఆధారంగా రాజకీయ పార్టీలు అభివృద్ధి చెందడమే ప్రజాస్వామ్యం అన్న సత్యాన్ని గుర్తించడం జరుగుతుందో..


ఎక్కడ ఒక పార్టీకి అనుకూలంగా ప్రజలు ఇచ్చిన తీర్పును కాలరాసేందుకు ఎంపీల, ఎమ్మెల్యేలను ధన ప్రలోభాలకు గురి చేయడం జరగదో; ఎక్కడ దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రత్యర్థులను బెదిరింపులకు గురిచేసేందుకు దుర్వినియోగపరచడం జరగదో; ఎక్కడ రాజ్యవ్యవస్థలు, అధికార సంస్థలు ఒక వ్యక్తికి లేదా ఒక భావజాలానికి దాసోహమవడం జరగదో; ఎక్కడ అధికారులు తమ రాజకీయ యజమానులకు విధేయులుగా కాకుండా, నిర్భీక, నిష్పాక్షిక వివేచనాశీలురుగా తమ విధ్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తారో.. 


భారత్ లాంటి సువిశాల దేశ వ్యవహారాలను సర్వాంతర్యామి అయిన పాలక పార్టీ అధిష్టాన వర్గం ఢిల్లీ నుంచి నడపడం కాకుండా నిజమైన సమాఖ్య విధానాన్ని అనుసరించడం ఎక్కడ జరుగుతుందో; ఎక్కడ రాత్రికి రాత్రే ఒక రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా కుదించివేయడం జరగదో; ఎక్కడ ఒక రాష్ట్ర గవర్నర్ అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి కాకుండా రాజ్యాంగానికి మాత్రమే నిబద్ధుడు అవుతాడో; ఎక్కడ రాజ్‌భవన్, ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి మధ్య ఘర్షణ ప్రమాదకరంగా పరిణమించదో; ఎక్కడ రాష్ట్ర గవర్నర్ రాజకీయ కార్యకలాపాలకు సమాంతర కేంద్రం కావడం జరగదో.. 


ఎక్కడ స్వేచ్ఛా విపణి హామీ మార్కెట్ గుత్తాధిపత్యంగా పరిణమించదో; ఎక్కడ గతించిన కాలంలోని లైసెన్స్-పర్మిట్ రాజ్ వర్తమాన పోషకుల-ఆశ్రితుల పాలనగా మారదో; ఎక్కడ నవకల్పనా ప్రతిభా పాటవాలు, నిర్వహణ దక్షతతో వ్యాపార సంస్థలు అభివృద్ధిచెందుతాయో; ఎక్కడ అనియత రంగానికి గణనీయమైన మేలు జరుగుతుందో; ఎక్కడ ఉద్యోగాల సృష్టికి విశేషంగా దోహదం చేసే పరిశ్రమలకు ప్రోత్సాహమివ్వడం జరుగుతుందో; ఎక్కడ అభివృద్ధి గణాంకాలను వక్రీకరించడం జరగదో; ఎక్కడ కల్పనలు కాకుండా వాస్తవాలు మాత్రమే ప్రాధాన్యత పొందుతాయో ..


వ్యక్తి స్వేచ్ఛా భావనలు ప్రతి ఒక్కరికీ వర్తిస్తాయని, వ్యక్తి స్వేచ్ఛ ఒక ప్రాథమిక హక్కు అన్న సత్యాన్ని ఎక్కడ న్యాయమూర్తులు గుర్తించి, సంరక్షణకు నిబద్ధమవుతారో; ఎక్కడ జైలు నిర్బంధంలో సప్తపదుల, అష్ట పదుల వయస్సులో ఉన్న కవులు, మేధావులు, సామాజిక క్రియాశీలురకు సిప్పర్ కూడా వారాల తరబడి ఇవ్వడానికి నిరాకరిస్తూ, రాజకీయ పలుకుబడి గల ఘరానా పెద్ద మనుషులకు అరెస్ట్, ప్రాసిక్యూషన్ నుంచి మినహాయింపు జరూరుగా ఇవ్వడం జరగదో; ఎక్కడ న్యాయమూర్తులు పదవీ విరమణ అనంతర ప్రయోజనాలకు దూరంగా ఉంటారో; ఎక్కడ హెబియస్ కార్పస్ పిటీషన్ల తక్షణ విచారణకు ప్రాధాన్యం ఇవ్వబడుతుందో..


ఎక్కడ ఒక నటుడి ఆత్మహత్యకు అపరిమిత ప్రాధాన్యం ఇస్తూ ఒక రైతు ఆత్మహత్యను కేవలం ఒక గణాంకంగా పరిగణించడం జరగదో; ఎక్కడ న్యూస్ మీడియా పెంపుడు కుక్క వలే కాకుండా ఒక కావలి కుక్కలా వ్యవహరిస్తుందో; ఎక్కడ టీవీ ఛానెల్స్ తమ వీక్షకులను రెచ్చగొట్టడం కాకుండా సంఘటనల పూర్వాపరాలపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తాయో; ఎక్కడ సంచలనం సృష్టించడానికి కాకుండా సమాచార నివేదనకు ప్రాధాన్యం లభిస్తుందో; ఎక్కడ టిఆర్‌పీలు టెలివిజన్ రెస్పెక్ట్ పాయింట్స్‌గా గౌరవం పొందుతాయో; అసత్య వార్తలు, విద్వేష ప్రసంగాలను తమ వెబ్‌సైట్లపై అనుమతిస్తున్న సామాజిక మాధ్యమాల వేదికలు ఎక్కడ చట్టం బారినుంచి తప్పించుకోలేకపోతాయో; మన సమున్నత ప్రజాస్వామిక గణతంత్ర రాజ్య వ్యవస్థాపకులు విశ్వసించిన విలువలు, పెంపొందించిన సంప్రదాయాలను పరిత్యజిస్తే ‘నవ’ భారత్‌ నిర్మాణం అసాధ్యమన్న విజ్ఞతా వివేకాలు ఎక్కడ ఉదయిస్తాయో.. ఆ స్వేచ్ఛా స్వర్గానికి, తండ్రీ, నా దేశాన్ని మేల్కొలుపు. 

ప్రతి ఒక్కరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!


రాజ్‌దీప్‌ సర్దేశాయి

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్‌్ట)

Updated Date - 2021-01-01T06:19:24+05:30 IST