క్లస్టర్‌ వర్సిటీకి కొత్త పేరు

ABN , First Publish Date - 2021-12-03T05:52:00+05:30 IST

జిల్లా కేంద్రంలోని క్లస్టర్‌ యూనివర్సిటీ రూపురేఖలు మారనున్నాయి.

క్లస్టర్‌ వర్సిటీకి కొత్త పేరు

  1. ఎంపిక కోసం కమిటీ ఏర్పాటు
  2. పరిశోధనలకు వర్సిటీలో ప్రాధాన్యం
  3. జీతభత్యాలకు రూ.28 కోట్లు కేటాయింపు
  4. పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు


కర్నూలు(అర్బన్‌), డిసెంబరు 2: జిల్లా కేంద్రంలోని క్లస్టర్‌ యూనివర్సిటీ రూపురేఖలు మారనున్నాయి. పోటీ ప్రపంచంలో ఇతర వర్సిటీలకు తీసి పోని విధంగా తీర్చి దిద్దేందుకు అఽధికారులు చర్యలు చేపట్టారు. విజయవాడలోని ఉన్నత విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయంలో గురువారం జరిగిన పాలక మండలి సమావేశంలో అనేక వినూత్న నిర్ణయాలు తీసుకున్నారు. ఇతర వర్సిటీలకు దీటుగా పని చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఉపకులపతి డీవీఆర్‌ సాయి గోపాల్‌ తెలిపారు. క్లస్టర్‌ యూనివర్సిటీకి ముందు ఒక పేరు చేర్చాలని పాలక మండలి యోచన చేసిందని తెలిపారు. జిల్లాకు సంబంధించిన చారిత్రాత్మక అంశాలు లేదా ప్రముఖ వ్యక్తుల పేర్లను చేర్చాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఒక కమిటీని నియమించారు. వర్సిటీ పరిధిలో సిల్వర్‌జూబ్లీ, ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాల, కేవీఆర్‌ డిగ్రీ కళాశాల ఉన్నాయి. ఈ కళాశాలలతో పాటు బయట కళాశాలల విద్యార్థులు కూడా రిసెర్చ్‌ కోర్సుల్లో ప్రవేశించే దిశగా అవకాశాలు కల్పిస్తున్నారు. రీసెర్చ్‌ కోర్సులకు ప్రాధాన్యం ఇస్తున్నామని, వచ్చే ఏడాది నుంచి జాతీయ నూతన విద్యా విధానంలో భాగంగా యూజీ, పీజీల్లో మరో 7 కొత్త కోర్సులు ప్రవేశ పెడతామని వీసీ తెలిపారు. అడ్మినిస్ట్రేషన్‌ అకడమిక్‌తో పాటు పరీక్షల నిర్వహణ బాధ్యతలను ఇకపై ఇక్కడే రూపొందిస్తామని తెలిపారు. వర్సిటీలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు, జీతభత్యాలకు గాను రూ.28 కోట్లు కేటాయించామని వెల్లడించారు. అధ్యాపకులు, నాన్‌ టీచింగ్‌ ఉద్యోగులకు క్లస్టర్‌ వర్సిటీ నుంచే ఇకపై వేతనాలు ఇస్తామని తెలిపారు. ఈ సమీక్షలో జిల్లా నుంచి రిజిస్ట్రార్‌ బి.శ్రీనివాసులు, సిల్వర్‌ జూబ్లీ కళాశాల ప్రిన్సిపాల్‌ వీవీ కుమార్‌, బాలుర డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ పి.కళావతి పాల్గొన్నారు.

Updated Date - 2021-12-03T05:52:00+05:30 IST