కొత్త ఆపరేషన్‌

ABN , First Publish Date - 2022-05-29T06:11:01+05:30 IST

రేషన్‌కార్డుదారుల్లో అనర్హుల ఏరివేతకు మరోసారి కేంద్రం సిద్ధమైంది.

కొత్త ఆపరేషన్‌

రేషన్‌కార్డుకు కొత్త నిబంధనలు

అనర్హులకు చెక్‌ పెట్టేందుకు చర్యలు

అర్హత లేనివారు సరెండర్‌ చేయాలని స్పష్టీకరణ

లేదంటే చట్టపరమైన చర్యలకు ఉపక్రమణ

రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు


 రేషన్‌కార్డుదారుల్లో అనర్హుల ఏరివేతకు మరోసారి కేంద్రం సిద్ధమైంది. అర్హత లేని వారు వెంటనే కార్డులను సరెండర్‌ చేయాలని స్పష్టం చేసింది. లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం నుంచి ఆదేశాలు అందాయి. దీంతో ఉమ్మడి జిల్లాలో ఎంతమందికి కోత పడుతుందోనని కార్డుదారుల్లో టెన్షన్‌ మొదలైంది.


కర్నూలు (కలెక్టరేట్‌), మే 28


రేషన్‌ కార్డుల సంఖ్య మరింత తగ్గించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈమేరకు కొత్త నిబంధనలను కేంద్రం తెరపైకి తెచ్చింది. ఉమ్మడి జిల్లాలో 11,88,000 కార్డులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ తాజా నిబంధనల నేపథ్యంలో వాటిలో ఎన్ని ఉంటాయో, ఊడుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. జాతీయ ఆహార భద్రతా చట్టం-2013ను అనుసరించి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్‌ కార్డులు జారీ చేశాయి. వీటిని పుడ్‌ సెక్యూరిటీ కార్డులని కూడా పిలుస్తారు. కరోనా నుంచి దారిద్య్ర రేఖకు దిగువన ఉండి... రేషన్‌ కార్డులో ఉన్న ఒక్కో లబ్ధిదారుడికి కేంద్ర ప్రభుత్వం ఐదు కిలోల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తోంది. ఈ ఏడాది నవంబరు వరకు పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో అధికారులను తప్పుదారి పట్టించి కొంత మంది రేషన్‌కార్డుల ద్వారా రేషన్‌తో పాటు మరికొన్ని ఉచితాలు పొందుతున్నారని కేంద్ర ప్రభుత్వం తెలుసుకుంది. అలాంటి వారు తక్షణం తమ కార్డులు సరెండర్‌ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మేరకు చర్యలు తీసుకోవాలని మార్గదర్శకాలు జారీ చేసింది. ఒకవేళ అనర్హులు కార్డులను సరెండర్‌ చేయకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.


పేదల బియ్యం అక్రమార్కుల పాలు


ఇప్పటికే పేదలకు ఇచ్చే బియ్యం పక్కదారి పడుతున్నాయి. ఉభయ జిల్లాలో 55 మండలాల్లో 17 ఎంఎల్‌ఎస్‌ పాయింట్లు ఉన్నాయి. వీటి నుంచి 2,436 మంది రేషన్‌ డీలర్లకు సరుకు సరఫరా అవుతోంది. ఇందులో కర్నూలు జిల్లాలో 1,232 రేషన్‌షాపులు, నంద్యాలలో 1,204 రేషన్‌షాపులు ఉన్నాయి. వాటి నుంచి ఎండీయూ వాహనాల ద్వారా రేషన్‌ సరఫరా చేస్తున్నారు.  కేంద్ర ప్రభుత్వం పీఎంజీకేవై ద్వారా నెలనెలా ఒక్కొక్కరికీ ఐదు కిలోల వంతున బియ్యం ఉచితంగా ఇస్తోంది. కేంద్ర ప్రభుత్వం అదనంగా ఇచ్చే బియ్యాన్ని అత్యధిక శాతం మంది పేదలు విక్రయిస్తున్నారు. జిల్లాలో కొంత మంది దళారులు, వ్యాపారులు ఈ బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అక్రమంగా తరలిన రేషన్‌ బియ్యానికి పాలిష్‌పట్టి సన్నరకంగా మార్చి బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ఇలాంటి అక్రమాలు అడపాదడపా జరుగుతూనే ఉన్నాయి. కొన్ని గోదాముల్లో నేరుగా  ంటి దొంగలే ఈ అక్రమాలకు తెరతీస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల నాగులాపురం వద్ద అక్రమంగా తరలిస్తున్న 560 టన్నుల బియ్యాన్ని పోలీసులు సీజ్‌ చేయడాన్ని బట్టి ఏ స్థాయిలో అక్రమ రవాణా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు.


 తాజా నిబంధనలు ఇవీ..


గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,50,000 లోపు ఆదాయం ఉన్న వారు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల లోపు ఆదాయం ఉన్నవారే కార్డులకు అర్హులని తాజా నిబంధనల్లో పేర్కొన్నారు. మాగాణి భూములు 3.5 ఎకరాల్లోపు ఉన్నవారు, బీడు భూములైతే 7.5 ఎకరాల్లోపు ఉన్నవారు రేషన్‌ కార్డు తీసుకోవడానికి అర్హులని పొందుపర్చారు. గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10 వేలలోపు  , పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.15 వేలు ఆదాయం వచ్చేవారు అర్హులని పేర్కొన్నారు. వంద చదరపు మీటర్ల ఇల్లు, ఫ్లాట్‌ ఉన్నవారు, కారు, ట్రాక్టర్‌, గ్రామాల్లో రూ.1.5 లక్షల కంటే ఎక్కువ ఆదాయం, పట్టణాల్లో రూ.2 లక్షల కంటే ఎక్కువ ఆదాయం, నగరాల్లో రూ.3 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే కార్డులు సంబంధిత తహసీల్దార్‌ కార్యాలయంలో సరెండర్‌ చేయాల్సి ఉంటుంది. ప్రొఫెషనల్‌ ట్యాక్స్‌, ఇన్‌కంట్యాక్స్‌, సేల్స్‌ ట్యాక్స్‌ చెల్లించని వారు మాత్రమే రేషన్‌కార్డు పొందడానికి అర్హులని తాజా నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. డాక్టర్లు, లాయర్లు, చార్టర్డ్‌ అకౌంటెంట్లు రేషన్‌కార్డులు పొందడానికి అనర్హులు. గతంలో రేషన్‌ కార్డు తీసుకున్నవారు ఎవరైనా ఆర్థికంగా స్థిరపడితే సరెండర్‌ చేయాల్సిందేనని చెబుతున్నారు. 

Updated Date - 2022-05-29T06:11:01+05:30 IST