ఈ పడిగాపులు ఇంకెన్నాళ్లు?

Dec 1 2021 @ 01:01AM

కొత్త పింఛన్ల కోసం నెలల తరబడి నిరీక్షణ

నాలుగు నెలలుగా మంజూరుకాని పింఛన్లు

సర్వర్‌ సామర్థ్యం పెంపు వంకతో జాప్యం

డీఆర్డీయే అధికారులకు తెలియనివ్వని సిబ్బంది


కొత్త పింఛన్ల మంజూరులో ప్రభుత్వం దరఖాస్తుదారులతో దోబూచులాడుతోంది. అన్ని అర్హతలూ ఉన్నా, నూతన పింఛను కోసం దరఖాస్తు చేసుకున్న వారు నెలలతరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ప్రతినెలా ఒకటో తేదీన పింఛను వస్తుందని ఆశతో ఎదురు చూస్తున్న వీరికి నిరాశే మిగులుతోంది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు సచివాలయాల చుట్టూ తిరుగుతున్నా, ఇంకా మంజూరు కాలేదనే సమాధానమే వస్తోంది. గతంలో పింఛను కోసం దరఖాస్తు చేసుకుంటే, 21 రోజుల వ్యవధిలో పరిశీలించి, మంజూరు చేసేవారు. ప్రస్తుతం ఆర్థిక వనరులు అందుబాటులో లేవనే నెపంతో తొక్కిపెట్టేస్తున్నారు.


ఆంధ్రజ్యోతి, మచిలీపట్నం : నూతన పింఛన్ల కోసం అర్హత ఉండి, అన్ని పత్రాలూ సక్రమంగా ఉన్న వారిని గుర్తించి వలంటీర్లు సచివాలయాల్లో ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అప్‌లోడ్‌ చేయాల్సి ఉంది. గత నాలుగు నెలలుగా వారి నుంచి పింఛన్ల దరఖాస్తులు స్వీకరించే సర్వర్‌ పనిచేయడం లేదనే సమాధానం వస్తోంది. అయినా పనిగట్టుకుని   పింఛను దరఖాస్తులను ఆన్‌లైన్‌లో పెడుతున్నారు. ఆయా దరఖాస్తులు సచివాలయాల నుంచిఎంపీడీవోలు, మునిసిపల్‌ కమిషనర్ల పరిశీలనకు చేరాలి. వాటిని ఆమోదించడం లేదా తిరస్కరించడం జరగాలి. అనంతరం ఈ దరఖాస్తులను గొల్లపూడిలోని ప్రధాన కార్యాలయానికి పంపుతారు. సర్వర్‌ పనిచేయకపోవడంతో దరఖాస్తులు ముందుకు కదలడం లేదు. తాము పెట్టుకున్న దరఖాస్తులు ఏమయ్యాయో తెలియకపోవడంతో, అసలు పింఛను వస్తుందో రాదోన నే భయం దరఖాస్తుదారులను వెంటాడుతోంది.  జిల్లా నుంచి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? వాటిలో ఎన్ని మంజూరు చేశారు? మిగిలిన వాటి పరిస్థితి ఏమిటి? అనే వివరాలు డీఆర్డీయే అధికారులకు కూడా తెలియని స్థితి నెలకొంది. ప్రతినెలా జిల్లాలో ఇంతమందికి  పింఛను సొమ్ము మంజూరైందంటూ రిపోర్టు రావడమే తప్ప నూతన పించన్లకు సంబంధించిన సమాచారం తమ వద్ద లేదని డీఆర్డీయే అధికారులు  చెబుతున్నారు.  


సదరం క్యాంపులు ఏవి?

దివ్యాంగులకు పింఛన్లు ఇవ్వాలంటే సదరం క్యాంపులు ఏర్పాటు చేయాలి. ఆ క్యాంపులకు వెళ్లాలంటే ముందస్తుగా వారు స్లాట్‌లో కేటాయించిన తేదీన ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలి. గతంలో ఈ వ్యవహారాన్ని డీఆర్డీయే అధికారులు పర్యవేక్షించేవారు. ఇప్పుడు ఆ బాధ్యతను ఆ శాఖ అధికారుల నుంచి తప్పించి, వైద్యశాఖకు అప్పగించారు. రెండు నెలలుగా ఈ ప్రక్రియ  కొనసాగడంలేదు. ‘పింఛను పొందేందుకు అర్హత ఉన్న వారి  దరఖాస్తులను సచివాలయంలో ఇస్తున్నాం. అంత వరకే మా పని’.. అంటున్నారు వలంటీర్లు. నాలుగు నెలలుగా సర్వర్‌ పనిచేయకపోవడంతో దరఖాస్తులన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయని, రెండు రోజుల క్రితం సర్వర్‌ కాస్త పని చేసిందని చెబుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 5,13,250 మందికి వివిధ రకాల పింఛన్లకుగాను రూ.119 కోట్లు చెల్లిస్తున్నారు. నూతన పింఛన్లు మంజూరు చేస్తే ఇంకా ఆర్థిక భారం పడుతుందనే భయంతోనే సర్వర్‌ పనిచేయడం లేదనే సాకు చూపుతున్నారనే వాదన వినిపిస్తోంది.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.