బాలిక మృతిలో కొత్త కోణాలు

ABN , First Publish Date - 2021-11-25T05:30:00+05:30 IST

లింగసముద్రంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన బాలిక (16) కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి.

బాలిక మృతిలో కొత్త కోణాలు
బాలిక హత్య కేసులో అనుమానితుడు శ్రీకాంత్‌ను నేర స్థలానికి తీసుకొచ్చిన పోలీసులు

తల్లితో సహజీవనం చేసే  

వ్యక్తే నిందితుడు

బీమా క్లైం కోసమే నేరం చేశాడా..?

మరేదైనా కారణం ఉందా..?

లోతుగా విచారిస్తున్న పోలీసులు

నిజాలు నిగ్గు తేల్చాలంటున్న ప్రజానీకం

లింగసముద్రం, నవంబరు 25 : లింగసముద్రంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన బాలిక (16) కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో ఆమె తల్లితో సహజీవనం చేస్తున్న వ్యక్తే ప్రధాన నిందితుడిగా పోలీసులు భావిస్తున్నారు. ఆ మేరకు పోలీసులు విచారణకు వేగవంతం చేసి పలు కీలక విషయాలు తెలుసుకున్నట్లు సమాచారం.  ఈ కేసులో తల్లి మాధవిని, ఆమెతో సహజీవనం చేస్తున్న శ్రీకాంత్‌, అతని స్నేహితుడు పులి గురుబ్రహ్మంను పోలీసులు బుధవారం విచారించారు. అయితే పామూరు సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిందితులు ముగ్గురిని పామూరులో పోలీసులు తమదైన శైలిలో విచారించగా వాస్తవాలు వెల్లడించారని తెలిసింది. నిందితుడు శ్రీకాంత్‌ బాలికను నగదు కోసం తానే హత్య చేసినట్టు ఒప్పుకున్నాడని సమాచారం. బాలిక పేరుతో రూ.40 లక్షలు ఎల్‌ఐసీ పాలసీ ఉండటం, ఆమెను చంపితే ఆ నగదు తనకు వస్తుందని పోలీసులకు చెప్పినట్టు తెలిసింది. దీంతో పోలీసులు నిందితుడు శ్రీకాంత్‌ను గురువారం లింగసముద్రంలోని అతని ఫైనాన్స్‌ కార్యాలయానికి తీసుకొచ్చి విచారించారు. ఆ గదిలోనే నేరం జరిగిన తీరునుశ్రీకాంత్‌ పోలీసులకు వివరించినట్టు తెలిసింది. అనంతరం బాలిక మృతదేహాన్ని అడవిలో ఒక గుంతలో కాల్చి బూడిద చేసి మట్టితో కప్పిపెట్టిన ప్రదేశాన్ని పోలీసులకు చూపించాడు. అయితే  శ్రీకాంత్‌ బాలికను సోమవారమే చంపి ఇంట్లోనే దాచి పెట్టారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కానీ ఈ విషయం తల్లి మాధవికి తర్వాత తెలిసినప్పటికీ ఆమె బయట పెట్టకుండా ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. బాలిక మృతదేహాన్ని రెండు రోజుల పాటు ఇంటిలో ఉంచుకొని తర్వాత గుట్టుచప్పుడు కాకుండా కాల్చి బూడిద చేసినట్లు తెలిసి ప్రజలు విస్తుపోతున్నారు. కుమార్తె మృతదేహాన్ని ఇంటిలో ఉంచుకొని తాను తన కుమార్తెను తీసుకొని నూజివీడు ట్రిపుల్‌ ఐటీ కౌన్సెలింగ్‌కు వెళ్లాలని అనుమతి ఇవ్వాలని కోరడం గమనార్హం. మంగళవారం ఉదయం పీహెచ్‌సీకి వెళ్లి బయోమెట్రిక్‌ వేసిన వైనంపై ఆరోగ్య కేంద్రం సిబ్బంది కూడా ఆశ్చర్యపోతున్నారు. అయితే డబ్బులు కోసమే ప్రశాంతిని చంపినట్టు శ్రీకాంత్‌ అంగీకరించినప్పటికీ పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నట్లు తెలిసింది.


Updated Date - 2021-11-25T05:30:00+05:30 IST