Joe Biden: సొంతవాళ్లే వద్దంటున్నారు.. 2024లో బైడెన్ బైబై చెప్పాల్సిందేనట

ABN , First Publish Date - 2022-07-15T16:52:49+05:30 IST

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden)పై వ్యతిరేకత రోజురోజుకీ పెరిగిపోతుంది.

Joe Biden: సొంతవాళ్లే వద్దంటున్నారు.. 2024లో బైడెన్ బైబై చెప్పాల్సిందేనట

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden)పై వ్యతిరేకత రోజురోజుకీ పెరిగిపోతుంది. ఆయన నాయకత్వ దక్షతను అమెరికన్లు విశ్వాసించడం లేదు. ముఖ్యంగా సొంత పార్టీ డెమోక్రటిక్ (Democratic) వాళ్లే ఆయన నాయకత్వం పట్ల వ్యతిరేకత చూపిస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాజాగా వెలువడిన సర్వే ఫలితాల ఆధారంగా ఆయన మరోసారి అధ్యక్షుడిగా పోటీ చేసే అవకాశం లేదని తెలుస్తోంది. అసలు బైడెన్‌కు అధ్యక్షుడిగా పోటీ చేసే అర్హత లేదని, ఆయన అధికారంలోకి వచ్చిన తరువాత దేశ ఆర్ధిక పరిస్థితి మరింత దిగజారిందనే వాదనలు అమెరికన్లు బలంగా వినిపిస్తున్నారని సర్వే ఫలితాలు చెబుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే... న్యూయార్క్ టైమ్స్ (New York Times), సియానా కాలేజ్ (Siena College) సంయుక్తంగా నిర్వహించిన సర్వే ఫలితాలు ఇప్పుడు అమెరికాలో కలకలం రేపుతున్నాయి. 2024లో బైడెన్ అధ్యక్షుడిగా తమకు వద్దంటూ సుమారు 64 శాతం మంది సొంత పార్టీకి చెందిన ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేసినట్లు సర్వే ఫలితాలు చెబుతున్నాయి. ఇక 30 ఏళ్ల వయసు వారైతే సుమారు 94 శాతం మంది బైడెన్ అభ్యర్ధిత్వాన్ని ఏ మాత్రం అంగీకరించడం లేదని తేలింది. 


అయితే, బైడెన్‌పై ఈ స్థాయిలో వ్యతిరేకత రావడానికి గల కారణాలను కూడా ఈ సర్వే వెల్లడించింది. ఉద్యోగాల కల్పన, ఆర్ధిక అభివృద్ధి విషయాల్లో బైడెన్ నిర్ణయాల పట్ల వారు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సర్వే పేర్కొంది. 75శాతం మంది ఓటర్లు తమకు దేశ ఎకనామీ చాలా ముఖ్యం అని చెప్పారట. అలాగే అగ్రరాజ్యం ప్రస్తుతం ఎదుర్కుంటున్న ఆర్ధిక ద్రవ్యోల్బణం బైడెన్ అసమర్థ నాయకత్వం వల్లే వచ్చిందనే భావనలో వారు ఉన్నారని తెలిపింది. సర్వేలో సుమారు 96 శాతం మంది ఈ విషయాన్ని ధ్రువీకరించారట. ఇక ప్రెసిడెంట్ వయసు విషయాన్ని కూడా యువలోకం పరిగణలోకి తీసుకుని తమ అభిప్రాయాన్ని వెల్లడించింది. అధ్యక్షుడికి 79 ఏళ్లు ఉంటే తమలా ఎలా ఆలోచన చేస్తాడని అందుకే తాము కొత్త అధ్యక్షుడు కావాలని కోరుకుంటున్నామని అమెరికా యువతరం చెబుతున్నమాటగా సర్వే తేల్చింది. 


Updated Date - 2022-07-15T16:52:49+05:30 IST