కొరియర్‌కు నిబంధనలు

ABN , First Publish Date - 2022-05-19T06:25:44+05:30 IST

కొరియర్‌కు నిబంధనలు

కొరియర్‌కు నిబంధనలు

స్టేషన్ల వారీగా కొరియర్‌ కార్యాలయ వివరాలు సేకరణ

త్వరలో ప్రత్యేక సమావేశం

నిబంధనలు తప్పనిసరి అని పోలీసుల స్పష్టీకరణ

ఎపిడ్రిన్‌ కేసు నేపథ్యంలోనే.. 


(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : ఇప్పటి వరకు ఓ లెక్క. ఇక నుంచి ఇంకో లెక్క. స్నేహితులు, బంధువులకు పంపే వస్తువులను ఇంట్లో పార్శిల్‌ చేసుకుని తీసుకెళ్లి కొరియర్‌ కార్యాలయంలో ఇచ్చేద్దామంటే కుదరదు. పార్శిల్‌ ఇవ్వడంతోనే అక్కడ పని అయిపోయిందని అనుకోవద్దు. ఇకపై ప్రభుత్వం నిషేధించిన ఎలాంటి వస్తువులు, పదార్థాలు ఆ పార్శిల్‌లో లేవని స్వీయ హామీ పత్రాన్ని రాసి, సంతకం చేసి ఇవ్వాల్సి ఉంటుంది. భారతీనగర్‌లోని డీఎస్‌టీ కొరియర్‌ సర్వీస్‌ నుంచి కెనడాకు వెళ్లిన చెన్నై చీరల పార్శిల్‌లో ఉన్న ఎపిడ్రిన్‌ను బెంగళూరు విమానాశ్రయంలోని కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ తరుణంలో కొరియర్‌ సర్వీసెస్‌కు స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ (ఎస్‌వోపీ)ని పోలీసులు ఖరారు చేశారు. చీరల పార్శిల్‌లో ఎపిడ్రిన్‌ చెన్నై నుంచి వచ్చినా, కొరియర్‌ మాత్రం భారతీనగర్‌లోని డీఎస్‌టీ సర్వీసెస్‌ నుంచి వెళ్లడం చర్చనీయాంశమైంది. దీంతో కమిషనరేట్‌లోని అన్ని పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఉన్న కొరియర్‌ సర్వీసెస్‌ సంస్థల వివరాలను పోలీసులు సేకరించారు. ఒక్కో పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఎన్నెన్ని కొరియర్‌ కార్యాలయాలు ఉన్నాయో లెక్క తేల్చారు. వాటన్నింటికీ ఈ ఎస్‌వోపీని పంపాలని నిర్ణయించారు. అన్ని కొరియర్‌ సంస్థల ప్రతినిధులతో త్వరలో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. కాగా, ఎపిడ్రిన్‌ వ్యవహారంలో డీఎస్‌టీ కొరియర్‌ ఉద్యోగి గుత్తుల తేజతో పాటు హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయ ఉద్యోగులు ఎర్రం శ్యామ్‌సుందర్‌, కీర్తిపాటి ప్రవీణ్‌వర్మ, తుమ్మల శ్రీనివాస్‌ పాత్ర ఉందని విజయవాడ పోలీసులు నిర్ధారించారు. ఏప్రిల్‌ 30న బెంగళూరు విమానాశ్రయంలోని కస్టమ్స్‌ అధికారులు తేజను అరెస్టు చేశారు. తాజాగా ఎర్రం శ్యామ్‌సుందర్‌, కీర్తిపాటి ప్రవీణ్‌వర్మ, తుమ్మల శ్రీనివాస్‌ను పటమట పోలీసులు అరెస్టు చేశారు.

తాజా నిబంధనలివీ..

పార్శిల్‌ను స్వీకరించే సమయంలో కొరియర్‌ ఉద్యోగి అందులోని వస్తువులను కచ్చితంగా తనిఖీ చేయాలి. 

పార్శిల్‌లో నిషేధిత వస్తువులు, పదార్థాలు లేవని నిర్ధారించుకున్నాకే స్వీకరించాలి.

కస్టమర్ల పార్శిళ్లకు కేవైసీ కోసం కొరియర్‌ ఉద్యోగులు తమ ఆధార్‌కార్డును ఇవ్వకూడదు.

పార్శిల్‌ను బుక్‌ చేసే సమయంలో కస్టమర్లు తమ ఒరిజినల్‌ కేవైసీని కచ్చితంగా కొరియర్‌ కార్యాలయ ఉద్యోగులకు చూపించాలి.

ఆధార్‌కార్డుపై వివరాలు స్పష్టంగా కనిపించేలా ఫొటోస్టాట్‌ కాపీని కొరియర్‌లో ఇవ్వాలి.

ఇలా ఇచ్చే ఫొటోస్టాట్‌ కాపీలపై కస్టమర్‌ తప్పనిసరిగా సంతకం చేయాలి.

తాము చేసిన పార్శిల్‌లో ఎలాంటి నిషేధిత వస్తువులు, పదార్థాలు లేవని కస్టమర్లు స్వీయ హామీ పత్రంపై సంతకం చేసి కొరియర్‌ కార్యాలయంలో ఇవ్వాలి. 


Updated Date - 2022-05-19T06:25:44+05:30 IST