కూల్చివేతల కొత్త రథయాత్ర

ABN , First Publish Date - 2022-04-21T06:17:11+05:30 IST

ఇందిరాగాంధీని చూసి దేశప్రజలు ఆ సమయంలో ముచ్చటపడ్డారు. అమెరికా సప్తమ నావికాదళం హిందూ మహా సముద్రంలోకి ప్రవేశించినప్పుడు బెంబేలు పడకుండా అగ్రరాజ్యాన్ని ఆమె సవాల్ చేశారు...

కూల్చివేతల కొత్త రథయాత్ర

ఇందిరాగాంధీని చూసి దేశప్రజలు ఆ సమయంలో ముచ్చటపడ్డారు. అమెరికా సప్తమ నావికాదళం హిందూ మహా సముద్రంలోకి ప్రవేశించినప్పుడు బెంబేలు పడకుండా అగ్రరాజ్యాన్ని ఆమె సవాల్ చేశారు. కుటిలురాలు, జిత్తులమారి, ఏ మాత్రం ఆకర్షణ లేని మనిషి.. అంటూ నిక్సన్, కిసింజర్ జనాంతికంగా ఎన్ని తిట్టుకున్నా, అనుకున్నది చేయకుండా ఇందిరను ఆపలేకపోయారు. సరికొత్తగా సోవియట్ యూనియన్‌తో చేసిన సైన్య సహకారసంధి ఇచ్చిన ధీమా మాత్రమే కాదు, ఆమెకు ఆ ధైర్యం ఇచ్చిన అంశాలు చాలా ఉన్నాయి. ఆ సమయంలో తాను దేశాన్ని కొత్త మార్గంలోకి తీసుకువెడుతున్నానని కూడా నమ్మి ఉంటారు. తూర్పు పాకిస్థాన్ ప్రజలకు విముక్తిని ప్రసాదిస్తున్నానని, ధర్మయుద్ధం చేస్తున్నానని కూడా ఆమె అనుకుని ఉంటారు. అనంతర తరాలలో వచ్చే ఉగ్రజాతీయవాదులు కూడా మెచ్చే విధంగా పాకిస్థాన్‌ను తాను రెండు ముక్కలు చేస్తున్నానని కూడా ఆమెకు స్ఫురించి ఉండాలి. దేశంలో అభివృద్ధి, పొరుగుతో యుద్ధం-, ఈ రెండూ కలిస్తే కలిగే పూనకమే వేరు. ఆవేశించే మహా బలమే వేరు.


ఈ మధ్య మన విదేశాంగ మంత్రి జైశంకర్ అమెరికాను నువ్వెంత అంటే నువ్వెంత అన్నప్పుడు ఇందిరాగాంధీ గుర్తుకు వచ్చారు. ఇంకా వర్ధమాన దేశంగానే ఉన్న భారత్, కారణమేదైనా కానీ, ప్రపంచంలో సంపదలోను, దాష్టీకంలోను అగ్రస్థానంలో ఉన్న దేశాన్ని గట్టిగా ఎదిరించినప్పుడు దేశభక్తి నాడీవ్యవస్థ తీవ్రంగా పరవశించడం సహజం. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ వైఖరి అమెరికాకు నచ్చడం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, కొంచెం కూడా దిగిరాకపోయే సరికి, భారత్‌లో మానవహక్కుల పరిస్థితి అమెరికా మంత్రికి గుర్తొచ్చింది. భారతదేశంలో మానవహక్కుల దుస్థితి గురించి పాపం, అమెరికా ఎప్పుడూ బాధపడుతూనే ఉంటుంది కానీ, ఆ బాధ వల్ల బాధిత ప్రజలకు పెద్ద లాభం ఏమీ ఉండదు. మా హక్కుల సంగతి సరే, మరి నువ్వేమి చేస్తున్నావు, అని ఇండియా ఎప్పుడూ ఎదురు మాట్లాడలేదు. ఈ సారి మాత్రం, నీ హక్కుల రికార్డేమిటో చూద్దామా మరి, అంటూ మాటకు మాట అనేసింది. ఇంత ధైర్యం ఎట్లా వచ్చింది? రష్యా చౌక చమురు ఇస్తానన్నంత మాత్రాన ఛాతీ ఉప్పొంగదు కదా? ఇప్పటికే యాభై ఆరు అంగుళాల ఛాతీ ఉన్న దృఢమైన ప్రధానమంత్రి కలిగిన భారత్, దేశానికి సరికొత్త పురోగతిని, తర్కాన్ని, చరిత్రను అందిస్తున్న ఉత్సాహంలో ఉన్న ప్రభుత్వం కలిగిన భారత్, ఏకధ్రువ ప్రపంచం చెదిరిపోతూ, మరొక సుదీర్ఘ ప్రచ్ఛన్నయుద్ధానికి తెరలేస్తున్న అంతర్జాతీయ సందర్భంలో అదను చూసి ఆత్మగౌరవం ప్రకటించడమో, లేదా, అవకాశవాదంతో తోక ఝాడించడమో చేస్తుంది కదా? దురదృష్టవశాత్తూ, విదేశాంగనీతిలో వీరంగం కూడా రాబోయే ఒక ప్రమాదాన్ని సూచిస్తుంది. 


ఇందిర విషయంలో అయినా ఇప్పటి విషయంలో అయినా, ధిక్కారాన్ని వినిపించింది బలమైన ప్రభుత్వం, మరింతగా బలపడుతున్న ప్రభుత్వం.  ఆ ధిక్కారం వెనుక ప్రజల స్వరం కంటె, పాలకులు సమకూర్చుకుంటున్న పరమాధికారమే ఉన్నదనిపిస్తుంది. బంగ్లాదేశ్ యుద్ధం తరువాత ప్రతిపక్షం చేత కూడా విజయేందిర అనిపించుకున్న నాయకురాలు అతి త్వరలోనే జనాగ్రహాన్ని జీర్ణించుకోలేక, నియంతృత్వానికి దిగారు. కొన్ని పరిపాలనా చర్యల ద్వారానో, జనాకర్షక విధానాల ద్వారానో, ఆఖరుకు ఒక యుద్ధం ద్వారానో తిరుగులేని అధికారాన్ని సమకూర్చుకున్న నేత, ప్రజాస్వామికంగా మిగలడం, కొనసాగడం కష్టం. కేంద్రీకృత అధికారం, జనంతో సంబంధాన్ని తెంచివేస్తుంది, అవినీతి అక్రమాలతో చాపకింద నీరు కమ్ముకుంటుంది, తనను తాను ఆరాధించుకునే నేత అహం గాయపడుతుంది. జనంలో శత్రువు కనిపిస్తుంది. పొరుగు యుద్ధం విరమించి, ఇంటి యుద్ధం మొదలవుతుంది. 


యాభై ఏళ్ల కిందటి పరిస్థితికి నేటికి సామ్యాలున్నాయి కానీ, తీవ్రతలో, విస్తృతిలో తేడాలూ ఉన్నాయి. అప్పుడు జనాకర్షక నేత, ప్రజా ఉద్యమాన్ని ఎదుర్కొనే క్రమంలో నియంతగా పరిణమించారు. హక్కులను రద్దు చేసి, జాతి మొత్తాన్ని అణచిపెట్టారు. నాడు ఇందిర ఉక్కుపాదాన్ని అనుభవించివారిలో నేటి పాలకశ్రేణి కూడా ఉన్నది. గత ఏడున్నరేండ్లుగా దేశంలో అమలులో ఉన్న పాలన, ఆరంభం కావడమే నియంతృత్వంతో మొదలయింది. వ్యక్తి జనాకర్షణ కాక, ఒక తీవ్రతతో కూడిన భావాకర్షణ నేపథ్యంలో, ప్రజలే స్వయంగా ఒక నియంత్రిత పాలనను కోరుకునే వాతావరణంలో ఈ కాలం అంతా గడచింది, గడుస్తున్నది. ఇందిర వలె సార్వత్రక, సార్వజనీన నిర్బంధం కాక, ఎంపిక చేసిన మతవర్గాల మీద, అభిప్రాయ వర్గాల మీద, సాంస్కృతిక వర్గాల మీద నిర్బంధాన్ని గురిపెట్టారు. ఆంతరంగిక కల్లోలాలను ఇందిర సృష్టించలేదని, పోషించలేదని, తన రాజకీయ మనుగడకు ఉపయోగించుకోలేదని చెప్పలేము కానీ, అంతర్యుద్ధాన్ని క్రమక్రమంగా పేర్చుకుంటూ రావడం మాత్రం ఆమె చేయలేదు. 


తుర్క్‌మన్ గేట్. దేశరాజధానిలోని నిరుపేదల నివాసాలను కూల్చివేసిన చోటు. అత్యవసర పరిస్థితి చేసిన అనేకానేక గాయాలలో ఒక పేరుపొందిన గాయం అది. తిరుగులేని అధికారానికి, దీనులపై దుర్మార్గ బలప్రయోగానికి గుర్తుగా బుల్‌డోజర్, సుప్రసిద్ధమైపోయింది. అప్పటికే డొల్లగా మారిపోయిన కాంగ్రెస్ పార్టీలో తన వ్యక్తిగత ఆధిపత్యానికి తన అనంతరం వారసత్వ పాలనకు దారులు వేసుకున్న ఇందిరాగాంధీకి పెద్ద సిద్ధాంతాలేమీ లేవు. సోషలిస్టును అనిపించుకోవాలని, అలీననేతగా పేరుపొందాలని ఉండేది కానీ, ఆనాడు ఆ వైఖరులకు ఉన్న ఆకర్షణ తప్ప అందుకు మరో కారణం లేదు. అన్నిటికి మించి ఆమె ప్రయోగించిన బుల్‌డోజర్‌కు మతం లేదు, అప్పుడు కూడా బాధితుల్లో అత్యధికులు ముస్లింలే అయినప్పటికీ.


ఒకనాడు నిందించిన బుల్‌డోజర్ ఇప్పుడొక వేలంవెర్రి. రాజాసింగ్ అన్నాడని ఆనాడు తప్పుపట్టాము కానీ, బుల్‌డోజర్, యుపి నుంచి మధ్యప్రదేశ్‌కు, అక్కడినుంచి గుజరాత్‌కు, ఇప్పుడు ఏకంగా ఢిల్లీకి జైత్రయాత్ర చేసింది. యుపిలో లాగా చేయాలి, బుల్‌డోజర్లతో తొక్కేయాలి, న్యాయం అలాగే ఉండాలి, శిక్ష అలాగే ఉండాలి... అని దేశమంతా జనాలు ఆధునిక విధ్వంసక వాహనాన్ని జయజయధ్వానాలతో ప్రశంసిస్తున్నారు, మా రాష్ట్రానికి రండి, మా వీధికి రండి అంటూ ఆహ్వానం పలుకుతున్నారు. తుర్క్‌మన్ గేట్‌లో జరిగినట్టు, బుల్‌డోజర్ కేవలం నేలను సంపన్నుల కోసం చదునుచేసే యంత్రం మాత్రమే కాదిప్పుడు. అది పరిగణనలలో పరాయిగా మారిపోయిన మనుషులను వారి నివాసాల నుంచి పెకిలించి, నిరాశ్రయులను చేయగల అద్భుత మంత్రం. గురిపెట్టిన ప్రజల గుండెల్లో భయాన్ని రోడ్డు రోలర్‌గా పరిగెత్తించగల అద్భుత తంత్రం. విభజనకు విద్వేషానికి ఇనుపపోత పోస్తే, అది అట్లా దొర్లుకుంటూ చదును చేసుకుంటూ వెళ్లిపోతుంది. నేరం ఎవరిదన్న విచికిత్స అక్కరలేదు. బుల్‌డోజర్ స్పర్శ సోకినవాడే నేరస్థుడు. సందేశం అందింది కదా!


ఏలినవారి మెప్పు పొందడానికి అధికారగణం పడిన అమానవీయ అత్యుత్సాహం తుర్క్‌మన్ గేట్. ఒకే దేశం ఒకే మతం ఒకే పన్ను ఒకే పరీక్ష ఒకే ప్రభుత్వం ఒకే భాష ఒకే పార్టీ దిశగా జరుగుతున్న ప్రయాణం నల్లేరు నడకగా లేదు. ఏ జయప్రకాశ్ నారాయణో నూతన తరం విద్యార్థి యువతరం నేతలో లేరు. ఎక్కడా చడీచప్పుడూ వినిపించడం లేదు, ఒక్క గొంతూ పెగలడం లేదు కానీ, అంతా సజావుగా లేదు. పాపం పెరిగినట్టు పెట్రోలు రేటు పెరుగుతోంది. ధరలు దారుణంగా ఉన్నాయి. ఆత్మహత్యలు, హత్యలు పెరిగిపోతున్నాయి. మతోన్మాదాన్ని ఎంతగా నూరిపోసినా జనం ఆకలిదప్పుల సమస్యలను అవినీతి అక్రమాలను పట్టించుకుంటూనే ఉన్నారు. ఉప ఎన్నికలు జరిగినప్పుడల్లా తీపి కబుర్లేమీ ఉండడం లేదు. యుద్ధం మన చేతిలో లేదు. ఫలితాలు పర్యవసానాలు ఎట్లా ఉంటాయో తెలియదు. కోవిడ్‌తో కూలిపోయిన జీవనవ్యవస్థలు ఇంకా కోలుకోలేదు. యాత్రల వల్ల జీవితాల్లో శోభ రావడం లేదు. 2024 వస్తోంది. మరింత విభజన, మరింత విద్వేషం అయితే కానీ ఫలితం రాదేమో? ఏదయితే అదయిందని రాజసూయం పూర్తి చేయడం కోసమే బుల్‌డోజర్ బయలుదేరిందా? రాజధర్మం ఎప్పుడో పోయింది, ఇక చిట్టచివరి ముఖౌటా కూడా రాలిపోయింది.


బృందా కారత్ మంచి పనిచేశారు. తియాన్మెన్ స్క్వేర్‌లో నాటి విద్యార్థి వలె ఆమె ఆ భూతవాహనం ముందు నిలబడ్డారు. బహుశా, తన చర్యను ఆమె ఎట్లా భావించారో కానీ, ప్రజలు అందులో పరిష్కారాన్ని కనుగొనవచ్చు. ఒక చిన్న సంకేతాత్మక ప్రతిఘటన నిద్రాణమైన సమాజాన్ని అదిలిస్తుంది. అగమ్యంగా అల్లాడుతున్న శక్తులను కదిలిస్తుంది. రాజకీయపక్షాలను, న్యాయవ్యవస్థను, పౌరసమాజాన్ని.. అన్నిటిని వరుసగా మేల్కొల్పగలిగే చిరు చిరు కదలికలన్నిటిని కలిపి కుట్టాలి.


కె. శ్రీనివాస్

Updated Date - 2022-04-21T06:17:11+05:30 IST