భారత్ నుంచి యూఏఈ వెళ్లే.. చార్టర్ విమానాలకు కొత్త రూల్ ఇదే!

ABN , First Publish Date - 2021-05-11T14:42:51+05:30 IST

భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో చాల దేశాలు భారత ప్రయాణిలపై ఆంక్షలు విధించిన విషయం విదితమే.

భారత్ నుంచి యూఏఈ వెళ్లే.. చార్టర్ విమానాలకు కొత్త రూల్ ఇదే!

అబుధాబి: భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో చాల దేశాలు భారత ప్రయాణిలపై ఆంక్షలు విధించిన విషయం విదితమే. భారత్ నుంచి వెళ్లే విమానాలను నిషేధిస్తూ చాలా దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. ఆ దేశాల జాబితాలో యూఏఈ కూడా ఉంది. ఇక యూఏఈ తీసుకున్న ఈ అనుహ్య నిర్ణయం వల్ల వివిధ కారణాలతో స్వదేశానికి వచ్చిన వేలాది మంది ప్రవాసులు ఇక్కడే చిక్కుకుపోయారు. వారంతా తిరిగి యూఏఈ వెళ్లేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో వీరు భారీ మొత్తంలో వెచ్చించి చార్టర్ విమానాల ద్వారా యూఏఈ వెళ్తున్నారు. 


అయితే, తాజాగా ఇలా భారత్ నుంచి యూఏఈ వెళ్తున్న ఈ చార్టర్ విమానాలకు ఆ దేశ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ(జీసీఏఏ) కొత్త రూల్ అమలు చేస్తోంది. చార్టర్ విమానాలు ఎంత పెద్దవి అయినా సరే ఎనిమిది మంది కంటే ఎక్కువ ప్రయాణికులను తీసుకురావొద్దనే నిబంధనను జీసీఏఏ పెట్టింది. దేశంలో వైరస్ వ్యాప్తి నివారణకు ఈ కొత్త రూల్ తీసుకొచ్చినట్లు ఈ సందర్భంగా జీసీఏఏ అధికారులు వెల్లడించారు. అంతేగాక తక్షణమే ఈ రూల్ అమలులోకి వస్తుందని పేర్కొంది. ఇక ఇరు దేశాల మధ్య విమానాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో ప్రైవేట్ జేట్లకు డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో ప్రయాణికుల నుంచి చార్టర్ విమాన యాజమాన్యాలు 22వేల నుంచి 25వేల దిర్హమ్స్ వరకు వసూల్ చేస్తున్నట్లు సమాచారం.         

Updated Date - 2021-05-11T14:42:51+05:30 IST