శ్రీలంక కొత్త ప్రధాని Wickremesinghe అనూహ్య నిర్ణయం..

ABN , First Publish Date - 2022-05-17T23:59:49+05:30 IST

దేశం అత్యంత క్లిష్టస్థితిలో ఉన్నప్పుడు అధికార పగ్గాలు అందుకున్న శ్రీలంక కొత్త ప్రధాని రణిల్ విక్రమసింఘే.. పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

శ్రీలంక కొత్త ప్రధాని Wickremesinghe అనూహ్య నిర్ణయం..

కొలంబో : దేశం అత్యంత క్లిష్టస్థితిలో ఉన్నప్పుడు అధికార పగ్గాలు అందుకున్న శ్రీలంక కొత్త ప్రధాని రణిల్ విక్రమసింఘే ఆర్థిక సవాళ్ల పరిష్కరించే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించే ప్రయత్నంలో భాగంగా కొత్త ప్రభుత్వ ప్రణాళికలను సిద్ధం చేశారు. ప్రభుత్వంపై భారాలను తగ్గించడంలో భాగంగా శ్రీలంక  ప్రభుత్వరంగ ఎయిర్‌లైన్స్‌ను విక్రయించాలని ఆయన నిర్ణయించారు. శ్రీలంక జాతినుద్దేశించి సోమవారం ఆయన చేసిన ప్రసంగంలో ఈ అంశాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. మార్చి 2021తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఎయిర్‌లైన్స్ నష్టం 124 బిలియన్ డాలర్లుగా ఉందన్నారు. విమానంలో కనీసం ఒక్కసారి కూడా  అడుగుపెట్టని పేదలపై ఈ భారం పడకూడదని, అందుకే ఈ సంస్థను విక్రయిస్తున్నట్టు రణిల్ విక్రమసింఘే స్పష్టం చేశారు. కాగా ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు చెల్లించేందుకు నగదు ముద్రణ పెంచాలని అధికారులపై ఆయన ఒత్తిడి చేస్తున్నారు. వీలైనంత త్వరగా సంక్షోభం గట్టెక్కాలని యోచిస్తున్నారు. అయితే కరెన్సీ ముద్రణ పెరిగితే మరిన్ని ఇబ్బందులు ఉంటాయని అధికారులు చెబుతున్నారు.


మరోవైపు 2022లో ఆదాయం 2.3 ట్రిలియన్ రూపాయలుగా అంచనా వేయగా 1.6 ట్రిలియన్ రూపాయలు మాత్రమే సమకూరే అవకాశం ఉందని దేశ ప్రజలకు విక్రమసింఘే తెలిపారు. అత్యవసరాల నుంచి బయటపడేందుకు రోజుల వ్యవధిలోనే 75 మిలియన్ డాలర్లు అవసరమని ఆయన వివరించారు. రానున్న రోజుల్లో ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉంది. పెట్రోల్, డీజెల్‌పై ప్రభుత్వ సబ్సిడీలు కూడా అనుమానమేనని ఆయన సందేహం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో శ్రీలంక ప్రజల జీవితాల్లోనే అత్యంత కష్టమైన రోజులు ఎదురుకాబోతున్నాయని ఆయన పేర్కొన్న విషయం తెలిసిందే.

Updated Date - 2022-05-17T23:59:49+05:30 IST