‘కొత్త’ చర్చ

ABN , First Publish Date - 2022-01-27T04:48:20+05:30 IST

కొత్త జిల్లాలతో ప్రభుత్వం ఇచ్చిన గెజిట్‌ నోటిఫికేషన్‌పై జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొందరు వ్యతిరేకంగా.. కొందరు అనుకూలంగా మాట్లాడుకుంటున్నారు. వివిధ అంశాల ఆధారంగా విశ్లేషించుకుంటున్నారు. ప్రభుత్వం ప్రకటించిన కొత్త జాబితా పూర్తిగా అమలైతే జిల్లా నుంచి పార్వతీపురం వీడిపోయి... మన్యం జిల్లా కేంద్రంగా ఆవిర్భవించనుంది.

‘కొత్త’ చర్చ

మన్యం జిల్లాగా పార్వతీపురం 

గెజిట్‌ నోటిఫికేషన్‌తో జిల్లాలో ఒకటే చర్చ

పార్లమెంట్‌ పరిధి కంటే అసెంబ్లీ స్థానాల సర్దుబాటుకే ప్రాధాన్యం


కొత్త జిల్లాలతో ప్రభుత్వం ఇచ్చిన గెజిట్‌ నోటిఫికేషన్‌పై జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొందరు వ్యతిరేకంగా.. కొందరు అనుకూలంగా మాట్లాడుకుంటున్నారు. వివిధ అంశాల ఆధారంగా విశ్లేషించుకుంటున్నారు. ప్రభుత్వం ప్రకటించిన కొత్త జాబితా పూర్తిగా అమలైతే జిల్లా నుంచి పార్వతీపురం వీడిపోయి... మన్యం జిల్లా కేంద్రంగా ఆవిర్భవించనుంది. జిల్లాల విభజనలో పార్లమెంట్‌ పరిధి కంటే అసెంబ్లీ స్థానాల సర్దుబాటుకే ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తోంది. విజయనగరం జిల్లా రెంటింటింగా రూపాంతరం చెందనుంది. 


(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

విజయనగరం జిల్లా 1979 జూన్‌ 1న ఏర్పాటైనప్పుడు శ్రీకాకుళం జిల్లాలోని కొంత భాగాన్ని... విశాఖ జిల్లాలోని కొంత భాగాన్ని వేరే చేసి 6,539 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 34 మండలాల(అప్పట్లో తాలూకాలు)తో ప్రకటించారు. మళ్లీ 43 ఏళ్ల తరువాత జిల్లా స్వరూపం మారే అవకాశం కనిపిస్తోంది.  కొత్త జిల్లాలు పార్లమెంట్‌ నియోజకవర్గాలకు అనుగుణంగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది కానీ అసెంబ్లీ నియోజకవర్గాలను చీల్చకుండా పునర్విభజన జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం మన జిల్లా తొమ్మిది అసెంబ్లీ స్థానాలు.. మూడు పార్లమెంట్‌ స్థానాల పరిధిలో ఉంది. ఎస్‌.కోట అసెంబ్లీ నియోజకవర్గం విశాఖ పార్లమెంట్‌లో ఉంది. కురుపాం, పార్వతీపురం, సాలూరు నియోజకవర్గాలు అరకు పార్లమెంట్‌లో ఉన్నాయి. విజయనగరం పార్లమెంట్‌ పరిధిలో విజయనగరం, నెల్లిమర్ల, గజపతినగరం, బొబ్బిలి, చీపురుపల్లి నియోజకవర్గాలతో పాటు శ్రీకాకుళం జిల్లాలోని రాజాం, ఎచ్చెర్ల నియోజకవర్గాలు ఉన్నాయి. ఇది ప్రస్తుత స్వరూపం. కొత్తగా ఏర్పడబోయే జిల్లాలతో విజయనగరం రెండుగా చీలనుంది. విజయనగరం పేరుతోనే కొనసాగే జిల్లాలో ఎస్‌.కోట(విశాఖ పార్లమెంట్‌)తో పాటు విజయనగరం, గజపతినగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి, బొబ్బిలి, శ్రీకాకుళం జిల్లా రాజాం(విజయనగరం పార్లమెంట్‌) అసెంబ్లీ స్థానాలు చేరనున్నాయి. విజయనగరం పార్లమెంట్‌ పరిధిలో ఉన్న శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని శ్రీకాకుళం జిల్లాకే పరిమితం చేస్తున్నారు. విశాఖ ఎంపీ పరిధిలోని ఎస్‌.కోటను విజయనగరం జిల్లా పరిధిలోనే ఉంచనున్నారు. విజయనగరం జిల్లా నుంచి పార్వతీపురం విడిపోయి ’మన్యం’ జిల్లాగా ఏర్పాటు కానుంది.  బొబ్బిలి డివిజన్‌ కేంద్రం కొత్తగా అవతరించి విజయనగరంలో రెండు డివిజన్లు ఏర్పాటు కానున్నాయి.

 అరకు పార్లమెంట్‌ నియోజకవర్గం నాలుగు జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ, మన జిల్లాలోని కురుపాం, పార్వతీపురం, సాలూరు, విశాఖ జిల్లాలోని పాడేరు, అరకు. తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరం నియోజకవర్గాలు ఉన్నాయి. ఇది నాలుగు జిల్లాల పరిధిలో విస్తరించడం.. భౌగోళికంగా పెద్దది కావడంతో దూరాభారాన్ని దృష్టిలో పెట్టుకుని కొత్త జిల్లాకు అవకాశం కల్పించారు. 

 మొత్తం రిజర్వుడ్‌ స్థానాలుగా.. ఎస్టీ జనాభా కలిగిన జిల్లా కావడంతో ‘మన్యం’ జిల్లాగా నామకరణం చేసి పార్వతీపురం కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నారు. అంటే అరకు పార్లమెంట్‌ పరిధిని రెండు జిల్లాలుగా విభజిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ(ఎస్టీ), కురుపాం(ఎస్టీ), పార్వతీపురం(ఎస్సీ), సాలూరు(ఎస్టీ) నాలుగు నియోజకవర్గాలతో కొత్త జిల్లా ఏర్పాటు కానుంది. ఇప్పటికే పార్వతీపురం, పాలకొండ రెవెన్యూ డివిజన్లుగా ఉన్నాయి. ఇవి కొనసాగుతాయి. 

-----------------------------------------

విజయనగరం జిల్లా మండలాలు:

విజయనగరం(డివిజన్‌/జిల్లా), గంట్యాడ, ఎస్‌.కోట, కొత్తవలస, జామి, వేపాడ, ఎల్‌.కోట, భోగాపురం, డెంకాడ, పూసపాటిరేగ, నెల్లిమర్ల, గుర్ల, గరివిడి, చీపురుపల్లి, బొండపల్లి.

బొబ్బిలి(కొత్తడివిజన్‌), గజపతినగరం, దత్తిరాజేరు, మెరకముడిదాం, రామభద్రపురం, బాడంగి, తెర్లాం. శ్రీకాకుళం జిల్లాలోని రాజాం, వంగర, రేగిడి, సంతకవిటి మండలాలుంటాయి.   

పార్వతీపురం జిల్లా మండలాలు

పార్వతీపురం, సీతానగరం, బలిజిపేట, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, జియ్యమ్మవలస, గరుగుబిల్లి, మక్కువ, సాలూరు, పాచిపెంట, మెంటాడతో పాటు శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజవర్గ పరిధిలోని పాలకొండ, సీతంపేట, భామిని, వీరఘట్టం మండలాలతో నూతనంగా పార్వతీపురం జిల్లా ఏర్పాటు కానుంది. జియ్యమ్మవలస, గరుగుబిల్లి మండలాలు ఇంతవరకు పార్వతీపురం రెవెన్యూ డివిజన్‌లో ఉన్నాయి. అవి పాలకొండ డివిజన్‌కు వెళ్లనున్నాయి. దీంతో వీరికి పాలకొండ దూరాభారం కానుంది. అయితే జిల్లా కేంద్రం దగ్గర కానుంది. 

-----------------------------------------------------------------------------------

జిల్లా         రెవెన్యూ డివిజన్లు     మండలాలు   చ.కి.మీ   జనాభా  

-----------------------------------------------------------------------------------

విజయనగరం    విజయనగరం         15         2113     11.61

                 బొబ్బిలి            11          1713     7.23

మన్యం          పార్వతీపురం         10         2927     6.32

(పార్వతీపురం)

                పాలకొండ           6          1008     3.40

==============

Updated Date - 2022-01-27T04:48:20+05:30 IST