Dubaiలో తెలుగు సంఘం

ABN , First Publish Date - 2021-11-20T13:38:05+05:30 IST

సేవా, సంస్కృతి, సమైక్యత లక్ష్యంగా దుబాయిలో తెలుగు అసోసియెషన్ ఆవిర్భవించింది. దుబాయిలోని కొందరు తెలుగు వ్యాపారవేత్తలు గత రెండు సంవత్సరాలుగా చేసిన ప్రయత్నాల ఫలితంగా ఏర్పాటయిన ఈ సంఘం దుబాయి ప్రభుత్వం ఆమోదం పొందడం విశేషం. ఇందులో తెలుగు వారితో పాటు దుబాయిలోని స్ధానిక చట్టాలకు అనుగుణంగా ఇద్దరు..

Dubaiలో తెలుగు సంఘం

దుబాయి ప్రభుత్వ ఆమోదంతో తెలుగు సంఘం విర్భావం

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: సేవా, సంస్కృతి, సమైక్యత లక్ష్యంగా దుబాయిలో తెలుగు అసోసియెషన్ ఆవిర్భవించింది. దుబాయిలోని కొందరు తెలుగు వ్యాపారవేత్తలు గత రెండు సంవత్సరాలుగా చేసిన ప్రయత్నాల ఫలితంగా ఏర్పాటయిన ఈ సంఘం దుబాయి ప్రభుత్వం ఆమోదం పొందడం విశేషం. ఇందులో తెలుగు వారితో పాటు దుబాయిలోని స్ధానిక చట్టాలకు అనుగుణంగా ఇద్దరు యూఏఈ జాతీయులు కూడా సభ్యులుగా ఉన్నారు. శుక్రవారం రాత్రి దుబాయిలో జరిగిన ఒక కార్యక్రమంలో దీన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ సందేశాన్ని పంపించారు.


యూఏఈలో పని చేస్తున్న తెలుగువారి నుండి ఒక లక్ష మందిని సభ్యులుగా చేర్పించాలనే లక్ష్యంతో ఉన్నామని, సగటు కార్మికుని సంక్షేమానికి భరోసాగా బీమా పథకాన్ని అమలు చేయాలనుకొంటున్నట్లుగా అంతర్జాతీయ వ్యవహారాల డైరెక్టర్ కటారు సుదర్శన్ (తిరుపతి) తెలిపారు. దేశవ్యాప్తంగా పని చేస్తున్న తెలుగు ప్రవాసీయుల నుండి ఒక ఐదు శాతం అంటే సుమారు లక్ష మంది చేరినా వారి సభ్యత్వం ద్వారా 18 మిలియన్ దిర్హాంలు సమకూరుతాయని ఆయన అంచనా వేశారు. దుబాయి చరిత్రలోనే మొదటిసారిగా అక్కడి ప్రభుత్వ అనుమతితో పూర్తిగా వారి నిబంధనలకు లోబడి తెలుగు అసోసియేషన్ ఏర్పాటయిందని కమ్యూనిటి సేవాల విభాగం డైరెక్టర్ రవికుమార్ కొమర్రాజు(వరంగల్) పేర్కొన్నారు.  ఇరు రాష్ట్రాల సంస్కృతి, సమైక్యతతో పాటు తెలుగు వారికి సేవ చేయాలనేది తమ ప్రధాన ధ్యేయమని ఈ సందర్భంగా రవికుమార్ అన్నారు. కష్టాలలో ఉన్న తెలుగువాడిని ఆదుకోవాలనేదే తమందరి లక్ష్యమని ఆయన తెలియజేశారు.


అసోసియేషన్‌కు ఛైర్మన్‌గా విశాఖపట్టణానికి చెందిన దినేశ్ కుమార్, వైస్ ఛైర్మన్‌గా హైద్రాబాద్‌కు చెందిన మసీయోద్దీన్ మోహమ్మద్, ప్రధానకార్యదర్శిగా వివేకానంద బాలుస, కోశాధికారిగా కడప జిల్లా పోరుమామిళ్ళకు చెందిన నూకల మురళీకృష్ణా ఎంపికయ్యారు. ఇక కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రెండు రాష్ట్రాలకు ప్రత్యేకంగా రెండు విభాగాలకు ఇద్దరిని డైరెక్టర్లుగా నియమించారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రవాసీయులు విజయవాడకు చెందిన ఎండూరి శ్రీనివాస రావును( మొబైల్ నం.00971505024459), తెలంగాణ ప్రవాసీయులు హైద్రాబాద్‌కు చెందిన షేక్ షా వలీను(మొబైల్ నం.00971506986775) ద్వారా సంప్రదించవచ్చని నిర్వహకులు తెలిపారు. అలాగే www.tauae.org వెబ్‌సైట్‌పై సంఘానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.


డాక్టర్ రాజశేఖర్ గుజ్జు, వక్కలగడ్డ వెంకట సురేశ్, దామర్ల శ్రీధర్ రావు, రాజీవ్ చింతకాయల, సురేంద్రనాథ్ ధనేకుల, వివేకానంద బాలుసా, ప్రకాశ్ ఇవటూరి వివిధ విభాగాల డైరెక్టర్లుగా, జీవితకాలపు వ్యవస్థాపక సభ్యులుగా రిజిష్టర్ చేయబడ్డారు. వీరందరు కలిసి వివిధ కార్యక్రమాలకు సంబంధించి వర్కింగ్ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. కార్యక్రమానికి మైత్రి వ్యాఖ్యాతగా వ్యవహిరించగా చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక విభాగం డైరెక్టర్ వి. వెంకట సురేశ్ వందన సమర్పన చేశారు. విందుకు ముందు దుబాయిలోని కొందరు తెలుగు వాణిజ్యవేత్తలను సన్మానించారు. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని శుభోదయ గ్రూప్ స్పాన్సర్ చేసింది. ఇప్పటి వరకు దుబాయిలో ఏర్పాటయిన తెలుగు సంఘాలకు విభిన్నంగా ఈ తెలుగు అసోసియేషన్ పూర్తిగా కార్పోరేట్ సంస్కృతితో ఏర్పాటైంది.



Updated Date - 2021-11-20T13:38:05+05:30 IST