కొత్త ట్రిబ్యునల్‌ న్యాయవిరుద్ధం

ABN , First Publish Date - 2021-10-23T06:28:38+05:30 IST

కృష్ణా జలాల వివాదం ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్యే అని, మిగతా రెండు రాష్ట్రాల వాటాలలో మార్పు ఉండదని ప్రస్తుత ట్రైబ్యునల్ ముందు కేంద్రం ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. ఇప్పుడు ఇంకొక ట్రైబ్యునల్ సెక్షన్ 3 ప్రాతిపదికగా ఏర్పడితే....

కొత్త ట్రిబ్యునల్‌ న్యాయవిరుద్ధం

కృష్ణా జలాల వివాదం ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్యే అని, మిగతా రెండు రాష్ట్రాల వాటాలలో మార్పు ఉండదని ప్రస్తుత ట్రైబ్యునల్ ముందు కేంద్రం ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. ఇప్పుడు ఇంకొక ట్రైబ్యునల్ సెక్షన్ 3 ప్రాతిపదికగా ఏర్పడితే ఆ ప్రమాణాన్ని ఉల్లంఘించినట్లవుతుంది. ప్రస్తుత ట్రైబ్యునల్ కూడా వివాదం రెండు రాష్ట్రాల వరకే అని స్పష్టం చేసింది. మిగతా రెండు రాష్ట్రాల వాటాలకు రక్షణ ఉంటుందని పేర్కొంది. పైగా తెలంగాణ చేస్తున్న వాదనలో పస లేదని 2016 అక్టోబర్‌లో నిర్ద్వంద్వంగా తీర్పు చెప్పింది. ఏ రాష్ట్రానికైనా ఇదివరకు కేటాయించిన వాటాలను తగ్గించి వినియోగంలో ఉన్న జలాలను తెలంగాణకు ఇవ్వడం ఆయా రాష్ట్రాల ఆర్థికమూలాలను దెబ్బతీయయడం కాదా? సహజ న్యాయ సూత్రాలకు ఇది విరుద్ధం కాదా?


ఆంధ్రజ్యోతిలో ఈ నెల 12న ‘కొత్త ట్రైబ్యునల్ వస్తే కొంప కొల్లేరే’- అనే శీర్షికన రాసిన వ్యాసంలో, తెలంగాణ అభ్యర్ధిస్తున్నట్లు కొత్త ట్రైబ్యునల్ ఏర్పడితే ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యంగా రాయలసీమకు అన్యాయం జరిగే అవకాశాలు ఎక్కువ అని సీనియర్ పాత్రికేయులు వి. శంకరయ్య అభిప్రాయపడ్డారు. ఇది ఎంతవరకు సంభవమో పరిశీలిద్దాం.


మొదటి ట్రైబ్యునల్ నిర్ణయం 1976లో తుది పరిష్కారంగా వెలువడింది. ‘సదరు నిర్ణయాన్ని 25 సంవత్సరాల తర్వాత సమీక్షించవచ్చని, అయితే ఆ సమీక్ష, సంబంధిత రాష్ట్రాలకు కేటాయించిన నీటి వాటాలను అవి వినియోగించుకుంటునట్లయితే ఆ వినియోగాలను భంగపరచకూడదని’ ఆ నిర్ణయం స్పష్టం చేసింది. మొదటి ట్రైబ్యునల్ తీర్పును సమీక్షించేందుకు 2000 సంవత్సరం తర్వాత ఏర్పాటు చేసిన బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ పై అంశాన్ని దృష్టిలో ఉంచుకొనే తన అంతిమ తీర్పును 2013లో వెలువరించింది. ఈ తీర్పును సంబంధిత రాష్ట్రాలన్నీ సుప్రీంకోర్టులో సవాలు చేశాయి. అది ఇంతవరకు విచారణకు రాకపోవటంతో ప్రతిష్టంభన కొనసాగుతోంది. 


మూడు రాష్ట్రాలు తమ తమ వాటాలను పూర్తిగా వినియోగించుకోవడం జరుగుతున్నదనీ కనుక మొదటి ట్రైబ్యునల్ కేటాయించిన వాటాలకు ఒక సంపూర్ణ న్యాయబద్ధత ఉందని బ్రిజేష్ ట్రైబ్యునల్ పేర్కొంది. అందుకే అంతవరకు 75 శాతం విశ్వసనీయతతో ఉన్న వాటాలను మార్చకుండానే, అదనపు నీటి కోసం విశ్వసనీయతను 65 శాతానికి తగ్గించి కొన్ని కేటాయింపులు చేసింది. అంతే కాదు అటువంటి కేటాయింపులు అన్ని రాష్ట్రాలు 75 శాతం విశ్వసనీయత జలాలను సాధించిన తర్వాతే వినియోగంలోకి వస్తాయనే ఒక రక్షణ కవచాన్ని కూడా ఏర్పాటు చేసింది.


బ్రిజేష్ ట్రైబ్యునల్ తీర్పు తర్వాత, ఇంకా కేటాయించేందుకు నదిలో నీరే లేదు. ఆ ట్రైబ్యునల్ తీర్పు ఇంకా అనిర్ణీత స్థితిలోనే ఉండగా ఇంకొక ట్రైబ్యునల్‌ను నియమించగలరా? అంతే కాదు, విభజన చట్టంలో ఉన్న సెక్షన్ 89 ప్రకారం కేంద్ర ప్రభుత్వం, 1956 అంతర్ రాష్ట్ర సెక్షన్ 5(3)ని ఉటంకిస్తూ ఉభయ రాష్ట్రాల మధ్య వాటాలను పంచమని ఆదేశాలు ఇచ్చింది. దీనిపై విచారణ జరుగుతోంది. అది ఇంకా కొనసాగుతుండగానే మరొక ట్రైబ్యునల్‌ను సెక్షన్ 3 ప్రకారం సమాంతరంగా ఎలా ఏర్పాటు చేయగలరు? ఈ కొత్త ట్రైబ్యునల్ అప్పుడు నాలుగు రాష్ట్రాలను కక్షిదారులుగా పరిగణించాలి. అయితే, వివాదం ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్యే అని, మిగతా రెండు రాష్ట్రాల వాటాలలో మార్పు ఉండదని ప్రస్తుత ట్రైబ్యునల్ ముందు కేంద్రం ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. ఇప్పుడు ఇంకొక ట్రైబ్యునల్ సెక్షన్ 3 ప్రాతిపదికగా ఏర్పడితే ఆ ప్రమాణాన్ని ఉల్లంఘించినట్లవుతుంది. ప్రస్తుత ట్రైబ్యునల్ కూడా వివాదం రెండు రాష్ట్రాల వరకే అని స్పష్టం చేసింది. మిగతా రెండు రాష్ట్రాల వాటాలకు రక్షణ ఉంటుందని పేర్కొంది. పైగా తెలంగాణ చేస్తున్న వాదనలో పస లేదని 2016 అక్టోబర్‌లో నిర్ద్వంద్వంగా తీర్పు చెప్పింది.


తెలంగాణ కోసమని ఏ రాష్ట్రానికైనా ఇదివరకు కేటాయించిన వాటాలను తగ్గించి వినియోగంలో ఉన్న జలాలను తెలంగాణకి ఇవ్వటం ఆయా రాష్ట్రాల ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే కాదా? సహజ న్యాయ సూత్రాలకు ఇది విరుద్ధం కాదా? విభజన చట్టం షెడ్యూల్ 11లో ఇరు రాష్ట్రాలకు ఇంతకు ముందు ట్రైబ్యునల్ కేటాయించిన వాటాలలో మార్పు ఉండదని చెప్పారు. కొత్త ట్రైబ్యునల్ ఈ రక్షణను అతిక్రమించగలదా? ఒక న్యాయస్థానం తీర్పు అన్ని చట్టాలకు లోబడే ఉండాలి కదా? అయినా కృష్ణా జలాల పంపిణీ సరికొత్తగా ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య చేపట్టాలని తెలంగాణ పట్టుపడితే ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా వ్యతిరేకించడం ఖాయం.


రాష్ట్రాల వ్యతిరేకతను అధిగమించి తెలంగాణకు కేంద్రం వరాలు ప్రసాదించలేదు. కోర్టులకు వెళ్ళినా సత్వర పరిష్కారం లభించకపోవటమే కాక చట్టపరంగా కూడా అది సాధ్యం కాదు. రెండవ ట్రైబ్యునల్ తీర్పుని వ్యతిరేకిస్తూ 2014లో సుప్రీంకోర్టులో తెలంగాణ ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. 2002లో 14వ చట్టం ద్వారా 1956 చట్టానికి చేసిన సవరణ, సదరు సవరణకు ముందు ట్రైబ్యునళ్ల తీర్పులను మార్చటానికి వీలు లేకుండా ఒక ప్రతిబంధకాన్ని సృష్టించింది. దీనిని బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ అతిక్రమించి మునుపటి ట్రైబ్యునల్ చేసిన కేటాయింపు సూత్రాలను మార్చింది (విశ్వసనీయతని 75 శాతం నుంచి 65 శాతానికి తగ్గించడం).2014లో సుప్రీంకోర్టులో ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన సందర్భంగా ఒక అఫిడవిట్‌లో తెలంగాణ ఈ విషయాన్ని పేర్కొంది. ఇప్పుడు ఆ వాదనను మరచిపోయినట్టున్నారు! 


సరే, రాయలసీమకి ఏమైనా నష్టం జరగగలదా అనే విషయాన్ని పరిశీలిద్దాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న 512 టిఎంసీల వాటాలో రాయలసీమ భాగం 145 టిఎంసీలు ఇందులో కృష్ణా జలాలు శ్రీశైలం కుడి కాలువకు ఉన్న 19 టిఎంసీలు మాత్రమే. ఈ 19లో 8 టిఎంసీలు కేసీ కెనాల్ నుంచి పునః కేటాయింపు జరిగింది. నికరంగా కృష్ణా జలాలు 11 టిఎంసీలు మాత్రమే. పైగా తెలంగాణకు తుంగభద్ర జలాల వాటా రాజోలిబండ కాలువకు ఉన్న 16 టిఎంసీలు మాత్రమే. ఇంకా వాటా పెంచాలని ప్రస్తుత ట్రైబ్యునల్ ముందు తెలంగాణ వాదిస్తోంది కానీ ఆ అవకాశాలు చాలా తక్కువ. అయినా ఆ రాష్ట్రం కృష్ణా జలాలపైన, ముఖ్యంగా డెల్టాకు ఉన్న 152.20 (181.20-29) టిఎంసీల పైన దృష్టి పెట్టింది.


డెల్టాకు కావలసిన జలాలు పోలవరం నుంచి, పులిచింతల దిగువ నుంచి లభ్యమయ్యే నీరు చాలు అంటూ పులిచింతల ఎగువ లభించే కృష్ణా జలాలన్నీ తమకే చెందాలనీ వాదిస్తోంది. నీటి వనరుల లభ్యతలో తెలంగాణతో పోలిస్తే రాయలసీమకు ప్రతికూలతలు ఎక్కువ అనీ, కనుకనే ఆ ప్రాంతం బాగా వెనుకబడిందనీ జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ 2012లో స్పష్టంగా చెప్పింది. ఇది సత్య దూరం కాదని విస్తృత అభిప్రాయం ఉంది. కనుక తెలంగాణ అడిగినంత మాత్రాన రాయలసీమ వాటాలకు ఎసరు పెట్టి నష్టం కలిగించే అవకాశాలు లేవు. 


 తెలంగాణ లాగా రాయలసీమ కూడా విడిపోయే రోజు వస్తుందేమోనన్న భయ సందేహాలు తరచు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ విడిపోయి కృష్ణా జలాలపై పై చేయి సాధించే అవకాశాలు లేకపోగా ముఖ్యమైన రెండు ప్రాజెక్టులపై ఆధిపత్యం కోల్పోవటం జరిగింది. తెలంగాణ శ్రీశైలం ఎడమగట్టు విద్యుచ్ఛక్తి కేంద్రం, పులిచింతల విద్యుచ్ఛక్తి కేంద్రంపై పట్టు కోల్పోయి అత్యవసర సమయాలలో స్వంతంగా వాడుకునే అవకాశాన్ని కూడా కోల్పోయింది. బోర్డుకు ఆ కేంద్రాలను అప్పచెప్పడం అనివార్యం. కాకపొతే గోదావరి జలాలు ప్రత్యామ్నాయంగా పెద్ద ఎత్తున వినియోగించుకొనే వీలు చిక్కింది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాణహిత చేవెళ్ళ పథకం, విడిపోయిన తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు వలే వేగంగా ముందుకు వెళ్ళేది కాదేమో. రాయలసీమ విడిపోతే ఆ ప్రాంతానికి కృష్ణా తుంగభద్ర జలాల పరంగా కేటాయింపుల మార్పు సాధ్యం కాదు. ప్రత్యామ్నాయంగా గోదావరి జలాల మళ్ళింపును తెలంగాణ వలే రాయలసీమ చేసుకోలేదు. ఇటువంటి మళ్ళింపు తెలంగాణ లేక ఆంధ్రప్రదేశ్‌తో కలిసి ఉంటేనే సాధ్యం. మూడవ గత్యంతరం కేంద్ర ప్రభుత్వ గోదావరి- కావేరి అనుసంధానం. ఈ పథకం ముందుకు సాగేందుకు చాలా అడ్డంకులు ఉన్నాయి.


కేంద్రంలో ప్రభుత్వం మారితే అసలు ఆ పథకమే మూలనపడే అవకాశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమ అంతర్భాగంగా ఉంటేనే అది సాధ్యమవుతుంది. రాయలసీమ రాజకీయ నాయకులు తలుచుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసినంత వేగంగా గోదావరి జలాల మళ్ళింపు పథకాన్ని పూర్తిచేయించవచ్చు. పంపింగ్ పథకాలకు పెద్ద ఎత్తున నీటి నిల్వ అవసరం. ఇది బల్లేపల్లి రిజర్వాయర్‌తోనే సాధ్యమవుతుంది. ‍సీమ నాయకులు ఒత్తిడి తెచ్చి ప్రస్తుతం కదలిక లేని హంద్రీ-నీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులను సత్వరం పూర్తిచేయడంతో పాటు గోదావరి- బనకచెర్ల లింక్ పూర్తి చేసే దిశగా కృషి చేయాలి.


కురుమద్దాలి వెంకట సుబ్బారావు

Updated Date - 2021-10-23T06:28:38+05:30 IST