APPSC : గౌతమ్ సవాంగ్‌ నియామకంలో కొత్త ట్విస్ట్..

ABN , First Publish Date - 2022-02-17T19:57:21+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ డీజీపీగా పనిచేసిన గౌతమ్ సవాంగ్‌ను ఆ పదవి నుంచి తొలగించి..

APPSC : గౌతమ్ సవాంగ్‌ నియామకంలో కొత్త ట్విస్ట్..

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ డీజీపీగా పనిచేసిన గౌతమ్ సవాంగ్‌ను ఆ పదవి నుంచి తొలగించి.. రెండ్రోజులపాటు వెయిట్ చేయించి ఏపీపీఎస్సీ చైర్మన్‌గా నియమిస్తున్నట్లు ప్రభుత్వం ఇవాళ ఉదయం ప్రకటించింది. అయితే కొన్ని గంటల గ్యాప్‌లోనే సవాంగ్ నియామకంలో కొత్త ట్విస్ట్‌ వెలుగుచూసింది. వాస్తవానికి ఆయన్ను వేరే శాఖకు బదిలీ చేసుంటే పరిస్థితి వేరేలా ఉండేది. అయితే.. ఏపీపీఎస్సీ అనేది రాజ్యాంగబద్ధ పదవి కావటంతో సవాంగ్‌ కచ్చితంగా ఐపీఎస్‌గా రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో 17 నెలలు సర్వీస్ ఉండటంతో సవాంగ్‌ స్వచ్ఛంద పదవీ విరమణ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆయన్ను బదిలీ చేసిన నాటి నుంచి ఇప్పటివరకూ సవాంగ్ స్వచ్ఛంద పదవీ విరమణ ఫైల్ సచివాలయానికి చేరలేదు. అయితే ఈలోపే గౌతమ్‌ సవాంగ్‌ ఏపీపీఎస్సీ చైర్మన్ అంటూ పెద్ద ఎత్తున లీకులు వచ్చేశాయ్. అంతేకాదు.. వికీపీడియాలో కూడా అప్పుడే ఏపీపీఎస్సీ చైర్మన్ అంటే గౌతమ్ సవాంగ్ పేరుండటం గమనార్హం.


కాగా.. ఇవాళ ఏపీపీఎస్సీ చైర్మన్‌గా గౌతమ్‌ సవాంగ్‌ను ఇవాళ ఉదయం ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఇందుకు సంబంధించి ప్రతిపాదనలను గవర్నర్‌ భిశ్వభూషణ్ హరిచందన్‌కు ప్రభుత్వం పంపింది. అయితే.. గవర్నర్‌ ఆమోదం పొందిన తర్వాత ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. రెండ్రోజుల క్రితం డీజీపీ పోస్ట్ నుంచి సవాంగ్ బదిలీ అయ్యారు. ఏపీపీఎస్సీ చైర్మన్‌‌గా ఉన్న ఉదయ్‌భాస్కర్ పదవీ కాలం ఆరు నెలల క్రితం ముగిసింది. ప్రస్తుతం ఆ పోస్ట్ ఖాళీగానే ఉంది. ఈ నేపథ్యంలో సవాంగ్‌ను నియమించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఇవాళ ఉదయం ఆ పదవిని కేటాయించింది. ఈ పోస్ట్ ఇవ్వడంపై సవాంగ్ ఇంతవరకూ స్పందించలేదు.

Updated Date - 2022-02-17T19:57:21+05:30 IST