రఘురామకృష్ణరాజు కేసులో కొత్త ట్విస్ట్‌

ABN , First Publish Date - 2021-06-17T02:16:43+05:30 IST

ఎంపీ రఘురామకృష్ణరాజు కేసులో కొత్త ట్విస్ట్‌ నెలకొంది. రఘురామ రిమాండ్‌ను ఈ నెల 25 వరకు సీఐడీ కోర్టు పొడిగించింది.

రఘురామకృష్ణరాజు కేసులో కొత్త ట్విస్ట్‌

గుంటూరు: ఎంపీ రఘురామకృష్ణరాజు కేసులో కొత్త ట్విస్ట్‌ నెలకొంది. రఘురామ రిమాండ్‌ను ఈ నెల 25 వరకు సీఐడీ కోర్టు పొడిగించింది. రఘురామ వ్యక్తిగత బాండ్‌ను జైలు అధికారులు అమలు చేయాలని సీఐడీ కోర్టు ఆదేశించింది. రిమాండ్‌లో ఉండగా బాండ్‌ను అమలు చేయాల్సిన బాధ్యత జైలు అధికారులదేనని  కోర్టు పేర్కొంది. సుప్రీంకోర్టు ఉత్తర్వులను సీఐడీ కోర్టు దృష్టికి రఘురామ తరపు న్యాయవాదులు తీసుకెళ్లారు. ఆర్మీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యాక 10 రోజుల్లో బాండ్లు సమర్పించాలని, సుప్రీంకోర్టు పేర్కొందని న్యాయవాదులు తెలిపారు. కోర్టు ఉత్తర్వుల సర్టిఫైడ్‌ కాపీ కోసం ఈ రోజు రఘురామ తరపు న్యాయవాదులు దరఖాస్తు చేశారు. 



రాష్ట్ర ప్రభుత్వంపైనా, ప్రభుత్వ పెద్దలపైనా వరుసగా విమర్శల బాణాలు సంధిస్తున్న... రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇతరులతో కలసి కుట్రలు చేయడం (ఐపీసీ సెక్షన్‌ 120 బీ), ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేయడం (124ఏ), ఇతరుల మధ్య విద్వేషాలు కలిగించేలా మాట్లాడటం (153ఏ), వ్యక్తిగత దూషణలు (505) తదితర అభియోగాల కింద అరెస్టు చేస్తున్నట్లు నోటీసు ఇచ్చారు. అయితే... ఆ నోటీసును తీసుకునేందుకుగానీ సంతకం చేసేందుకుగానీ రఘురామ అంగీకరించలేదని, ఆయన భార్య రమాదేవి కూడా నోటీసు తీసుకునేందుకు నిరాకరించడంతో... ఇంటి గోడకు అంటించామని పోలీసులు దానిపై రాశారు. ఆయనపై మంగళగిరి సీఐడీపోలీసులు కేసు (12/2021) నమోదు చేసినట్లు నోటీసులో ఉంది. 


Updated Date - 2021-06-17T02:16:43+05:30 IST