రెండు పక్కపక్క ఇళ్లల్లో 9 మృతదేహాల కేసులో షాకింగ్ ట్విస్ట్.. వాళ్లందరిదీ ఆత్మహత్య కాదు.. చంపింది ఎవరంటే..

ABN , First Publish Date - 2022-06-29T00:27:10+05:30 IST

ఈ నెల 20న మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతదేహాలు పక్క పక్క ఇళ్లలో లభ్యమయ్యాయి..

రెండు పక్కపక్క ఇళ్లల్లో 9 మృతదేహాల కేసులో షాకింగ్ ట్విస్ట్.. వాళ్లందరిదీ ఆత్మహత్య కాదు.. చంపింది ఎవరంటే..

ఈ నెల 20న మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతదేహాలు పక్క పక్క ఇళ్లలో లభ్యమయ్యాయి.. పక్క పక్క ఇళ్లలో నివసిస్తున్న ఇద్దరు సోదరుల కుటుంబ సభ్యులు మరణించారు.. అప్పులపాలు కావడంతో అందరూ ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా భావించారు.. అయితే వారివి ఆత్మహత్యలు కావని, అందరివీ హత్యలేనని తాజాగా తేలింది. ఆ ఇళ్లకు పూజలు చేయడానికి వచ్చిన తాంత్రికుడు, అతని డ్రైవర్ విషం కలిపిన టీ ఇచ్చి వారిని చంపినట్టు స్పష్టమైంది.. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. 


ఇది కూడా చదవండి..

తల్లి బ్యాంక్ అకౌంట్లోంచి రూ.5 లక్షలు మాయం.. 17 ఏళ్ల కొడుకు చేతికి ఫోన్ ఇస్తే జరిగింది ఇదీ..!


సాంగ్లీ జిల్లా మిహిసల్ గ్రామానికి చెందిన మాణిక్ వార్మోర్, యల్లప్ప వార్మోర్ ప్రభుత్వ ఉద్యోగులు. అయితే వీరు గ్రామంలోని చాలా మంది నుంచి వ్యాపార నిమిత్తం అప్పులు చేశారు. వ్యాపారాల్లో నష్టపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకున్నారు. దీంతో అబ్బాస్ మహ్మద్ అలీ బగ్వాన్ అనే తాంత్రికుడిని ఆశ్రయించారు. తమ కష్టాలు తొలిగిపోయేలా పూజలు చేయాలని అడిగారు. అతను ఈ నెల 20న తన డ్రైవర్ ధీరజ్ చంద్రకాంత్‌తో కలిసి వారి ఇళ్లకు చేరుకున్నారు. పూజలు చేసిన అనంతరం మొత్తం కుటుంబ సభ్యులందరి చేతా వారు విషం కలిపిన టీ తాగించారు. 


తర్వాతి రోజు ఆ కుటుంబాల నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో గ్రామస్తులకు అనుమానం వచ్చింది. కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసినా ఎవరూ స్పందించలేదు. దీంతో లోపలికి వెళ్లి చూడగా అందరూ చనిపోయి కనిపించారు. గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అన్నదమ్ములిద్దరూ గ్రామంలోని చాలా మంది దగ్గర అప్పులు తీసుకున్నారని, వాటిని తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుని ఉంటారని గ్రామస్తులు పోలీసులకు చెప్పారు. అయితే, పోస్ట్‌మార్టమ్‌లో అందరి మృతదేహాల్లోనూ విషం ఉన్నట్టు బయటపడింది. కేసు నమోదు చేసుకుని విచారించిన పోలీసులు దర్యాఫ్తు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. అయితే వారిని తాంత్రికుడు ఎందుకు చంపాడనేది బయటకు రావాల్సి ఉంది. 

Updated Date - 2022-06-29T00:27:10+05:30 IST