UAE Visas: ఈ నెల 3వ తేదీ నుంచి అమల్లోకి రానున్న యూఏఈ కొత్త వీసాలివే.. ఆ దేశానికి వెళ్లేవారు ఈ వివరాలు తప్పకుండా తెలుసుకోండి..

ABN , First Publish Date - 2022-10-01T16:35:30+05:30 IST

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ఇటీవల ప్రవాసుల కోసం కొన్ని కొత్త వీసాలను ప్రకటించిన విషయం తెలిసిందే.

UAE Visas: ఈ నెల 3వ తేదీ నుంచి అమల్లోకి రానున్న యూఏఈ కొత్త వీసాలివే.. ఆ దేశానికి వెళ్లేవారు ఈ వివరాలు తప్పకుండా తెలుసుకోండి..

అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ఇటీవల ప్రవాసుల కోసం కొన్ని కొత్త వీసాలను ప్రకటించిన విషయం తెలిసిందే. వీటిలో కొన్ని ఇప్పటికే అమలులో ఉన్నాయి. అయితే, అమలులో ఉన్న ఈ వీసాలకు కొన్ని మార్పులు చేసింది. ఇలా మార్పులతో కొత్తగా తీసుకువస్తున్న ఈ వీసాలలో కొన్నింటిని ఈ నెల 3 నుంచి వాడుకలోకి తీసుకువస్తున్నట్లు యూఏఈ తాజాగా వెల్లడించింది. ఇప్పటికే ప్రవాసులకు దీర్ఘకాలికి రెసిడెన్సీ కోసం అమలు చేస్తున్న గోల్డెన్ వీసా పథకాన్ని(Golden Visa scheme) అక్కడి ప్రభుత్వం విస్తరించింది. అలాగే గ్రీన్ రెసిడెన్సీ (Green residency) పేరిట ఐదేళ్ల కాలానికి కొత్త వీసా తీసుకొచ్చింది. దీంతో పాటు ఉద్యోగార్థుల కోసం ఉద్యోగ అన్వేషణ ఎంట్రీ పర్మిట్ వీసాను ప్రకటించింది. ఇవన్నీ కూడా ఈ నెల 3 నుంచి అమలులోకి రానున్నాయి. యూఏఈ ప్రకటించిన కొత్త వీసాలు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను పరిశీలిస్తే..


గ్రీన్ వీసా: ఐదేళ్ల వ్యవధితో వచ్చే గ్రీన్ వీసా (Green visa) ద్వారా వీసాదారులు తమ కుటుంబ సభ్యులను స్పాన్సర్ లేదా యజమాని లేకుండా తీసుకురావడానికి అనుమతిస్తుంది. ఈ వీసా నైపుణ్యం కలిగిన కార్మికులు, స్వీయ-యజమానులు, ఫ్రీలాన్సర్లు మొదలైన వారికి వర్తిస్తుంది. ఐదేళ్ల కాలపరిమితో ఇచ్చే ఈ మల్టీ-ఎంట్రీ టూరిస్ట్ వీసా (Multi-entry tourist visa)కు స్పాన్సర్ అవసరం లేదు. అలాగే 90 రోజుల వరకు యూఏఈలో ఉండేందుకు వీలు కల్పిస్తుంది. మరో 90 రోజుల పాటు పొడిగించుకునే వెసులుబాటు కూడా ఉంది. ఇలా ఓ వ్యక్తి ఈ వీసాతో ఆ దేశంలో 180 రోజులు ఉండొచ్చు. అయితే, దరఖాస్తుదారుడు దరఖాస్తు చేయడానికి ముందు గత ఆరు నెలల్లో తప్పనిసరిగా 4వేల డాలర్లు(రూ.3.16లక్షలు) లేదా విదేశీ కరెన్సీలలో దానికి సమానమైన బ్యాంక్ బ్యాలెన్స్ కలిగి ఉండాలి.   


గోల్డెన్ వీసాలు: యూఏఈ అనేక రకాల ప్రొఫెషనల్ కేటగిరీలు మరియు దీర్ఘకాల ప్రాతిపదికన దేశంలోని అత్యుత్తమ జీవన నాణ్యతను ఆస్వాదించే పెట్టుబడిదారుల కోసం ఈ గోల్డెన్ వీసాలను (Golden Visas) ప్రకటించింది. 2018 యూఏఈ కేబినెట్ తీర్మానం నెం. 56 ప్రకారం పెట్టుబడిదారులు(కనీసం రూ. 20.50కోట్లు), పారిశ్రామికవేత్తలు, సైన్స్, నాలెడ్జ్, స్పోర్ట్స్ రంగంలోని నిపుణులు, ప్రత్యేక ప్రతిభావంతులకు గోల్డెన్ వీసా ఇస్తారు. ఈ గోల్డెన్ వీసా ద్వారా ఆ దేశంలో దీర్ఘకాలిక రెసిడెన్సీకి వీలు కలుగుతుంది. 2019లో యూఏఈ ప్రభుత్వం ఈ దీర్ఘకాలిక రెసిడెన్సీ వీసాల కోసం ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థ యూఏఈలో విదేశీయులకు నివాసం, పనిచేసుకోవడం, అధ్యయనంకు ఎలాంటి స్పాన్సర్షిప్ అవసరం లేకుండా చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. అలాగే వందశాతం ఓనర్‌షిప్‌తో ఆ దేశంలో సొంతంగా వ్యాపారాలు నిర్వహించుకోవచ్చు. ఇక యూఏఈ ఇచ్చే ఈ లాంగ్‌టర్మ్ వీసా 10, 5ఏళ్ల కాలపరిమితో ఉంటుంది. అంతేగాక ఆటోమెటిక్‌గా పునరుద్ధరించబడుతుంది.  


జాబ్ వీసా: యూఏఈలో ఉద్యోగ అవకాశాలను అన్వేషించడానికి ఉద్యోగార్ధులు ఈ కొత్త జాబ్ వీసా (Job visa)ను పొందవచ్చు. ఈ వీసాకు స్పాన్సర్ గానీ, హోస్ట్ గానీ అవసరం. ఇది బ్యాచిలర్ డిగ్రీ హోల్డర్‌లకు, ప్రపంచంలోని అత్యుత్తమ 500 విశ్వవిద్యాలయాలకు చెందిన గ్రాడ్యుయేట్‌లతో పాటు మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ విభజించిన మొదటి, రెండవ, మూడవ నైపుణ్య కేటగిరీల కిందకు వచ్చే వారికి మంజూరు చేయబడుతుంది. 


ఫ్యామిలీ వీసా: గతంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు 18 ఏళ్లలోపు మాత్రమే స్పాన్సర్ చేసే వీలు ఉండేది. తాజాగా తీసుకువస్తున్న ఈ ఫ్యామిలీ వీసా (Family visa)ద్వారా ఇప్పుడు మగ పిల్లలను 25 సంవత్సరాల వయస్సు వరకు స్పాన్సర్ చేయవచ్చు. వికలాంగ పిల్లలు కూడా ప్రత్యేక అనుమతిని పొందుతారు. అవివాహిత కుమార్తెలకు తల్లిదండ్రులు నిరవధిక సమయం వరకు స్పాన్సర్ చేయవచ్చు.


చదువు/శిక్షణ కోసం వీసా: ఈ వీసా శిక్షణ, పరిశోధన కోర్సులు, ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లకు హాజరు కావాలనుకునే వ్యక్తులు లేదా విద్యార్థుల కోసం ఉద్దేశించబడింది. ఈ వీసాను ప్రభుత్వ, ప్రైవేట్ రంగ విద్యా మరియు పరిశోధనా సంస్థలు స్పాన్సర్ చేసే వెసులుబాటు ఉంది. దీనికి అధ్యయనం లేదా శిక్షణ లేదా ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్, దాని వ్యవధి వివరాలను స్పష్టం చేస్తూ సంబంధిత సంస్థ నుండి తీసుకున్న లేఖ సమర్పించాల్సి ఉంటుంది.


Updated Date - 2022-10-01T16:35:30+05:30 IST