ఉన్నత యోగం!

ABN , First Publish Date - 2020-08-08T09:06:59+05:30 IST

జిల్లాలో ఉన్నత విద్యాసంస్థల ఏర్పాటులో ఎగతెగని జాప్యం జరుగుతోంది.

ఉన్నత యోగం!

జిల్లాకు కొత్తగా  విశ్వవిద్యాలయం

సీఎం ప్రకటనతో జిల్లావాసుల్లో మిశ్రమ స్పందన

గతంలో ప్రకటించిన వాటికి కదలిక లేదు

కొత్తది ఎంతవరకు సాకారమవుతుందోనని సందేహం


జిల్లావాసులకు తీపి కబురు. జిల్లాలో మరో విద్యా సంస్థ ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. సాక్షాత్‌ సీఎం జగన్‌ విజయనగరంలో ఉన్నత విద్యాసంస్థ (యూనివర్సిటీ)ని ఏర్పాటు చేయనున్నట్టు స్పష్టం చేయడంతో జిల్లావాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ గతంలో ప్రకటించిన విద్యాసంస్థల పరిస్థితి చూసి పెదవి విరుస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నా వాటి నిర్మాణం ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. దీంతో కొత్తగా విద్యాసంస్థను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా... గత సంస్థల సరసన చేరుతుందా లేక ముందుకు వెళుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.  




(విజయనగరం-ఆంధ్రజ్యోతి):జిల్లాలో ఉన్నత విద్యాసంస్థల ఏర్పాటులో ఎగతెగని జాప్యం జరుగుతోంది. రాష్ట్ర విభజన చట్టంలో  భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గిరిజన యూనివర్సిటీని జిల్లాకు కేటాయించారు.   టీడీపీ ప్రభుత్వ హయాంలో కొత్తవలస మండలంలో తొలుత నిర్మాణ ప్రక్రియను ప్రారంభించారు. ప్రహరీ నిర్మాణం చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత యూనివర్సిటీని తొలుత పాచిపెంట మండలం, ఇప్పుడు సాలూరు మండలాలకు తరలించడానికి ఏర్పాటుచేసింది. సాలూరు పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే కలెక్టర్‌ స్థల పరిశీలన పూర్తిచేశారు. ఆరేళ్లుగా గిరిజన యూనివర్సిటీ ప్రాథమిక స్థాయిలో నిలిచిపోయిందే తప్ప పూర్తికాలేదు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కూడా మహాకవి గురజాడ అప్పారావు పేరిట విశ్వవిద్యాలయాన్ని మంజూరుచేస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు.


ఇంతలో ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో ఆంశం తెరమరుగైంది. తాజాగా సీఎం ప్రకటనతో మరోసారి యూనివర్సిటీ అంశం తెరపైకి వచ్చింది. గురజాడ పేరుతో ఏర్పాటుచేస్తారా లేదా జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాలనే విశ్వ విద్యాలయంగా ప్రకటిస్తారా అన్నది తేలాల్సి ఉంది. గురజాడ విశ్వవిద్యాలయానికి సంబంధించి జేఎన్‌టీయూ ప్రాంగణాలవైపే అప్పటి ఎమ్మెల్యే స్థల పరిశీలన చేశారు.  ఈసారి జేఎన్‌టీయూనే నూతన విశ్వ విద్యాలయంగా మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కాకినాడ జేఎన్‌టీయూకు అనుబంధంగా నడుస్తుండడమే ఇందుకు కారణం. ఇప్పటికే అనుబంధ కళాశాలలు పరిమితికి మించి ఉండడంతో సాంకేతిక, పాలనాపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో జిల్లాకు ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటుచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే జేఎన్‌టీయూనే యూనివర్సిటీగా ప్రకటిస్తారని తెలుస్తోంది. 


ఏయూ క్యాంపస్‌లో?

 విజయనగరంలో గత ఏడాది వరకూ ఏయూ క్యాంపస్‌ను నిర్వహించేవారు. దీనినే అభివృద్ధి చేసి విశ్వవిద్యాలయంగా ప్రకటిస్తారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.  ప్రస్తుతం ఈ క్యాంపస్‌లో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం నడుస్తోంది. ఏయూ క్యాంపస్‌ను తాత్కాలికంగా విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో విలీనం చేశారు. ఈ పరిస్థితిలో ఏయూ క్యాంపస్‌నే విశ్వవిద్యాలయంగా మార్చేందుకు అవకాశం లేకపోలేదు. జేఎన్‌టీయూ, ఏయూ ప్రాంగణం దగ్గరగా ఉన్నాయి.


ఈ రెండింటినీ కలిపి విశ్వవిద్యాలయంగా మార్చే అవకాశముందని ఎక్కువ మంది భావిస్తున్నారు. ప్రస్తుతం జేఎన్‌టీయూ ప్రాంగణానికి ఇచ్చిన స్థలమే విశ్వ విద్యాలయానికి సరిపడే అవకాశం ఉంది. మనకు ప్రత్యేకంగా దూర విద్యకు సంబంధించి విశ్వ విద్యాలయం లేదు. దీనిని దృష్టిలో పెట్టుకుని మన జిల్లాలో ఓపెన్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోందేమోనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చే వరకూ వేచిచూడాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విద్యాసంస్థ నిర్మాణ పనులను వీలైనంత త్వరగా పట్టాలెక్కించాల్సిన అవసరముంది. 

Updated Date - 2020-08-08T09:06:59+05:30 IST