ఇళ్లల్లో పనిచేసేవారి వీసాలకు సంబంధించి సౌదీ సంచలన నిర్ణయం

ABN , First Publish Date - 2022-07-01T01:55:26+05:30 IST

వీసా కేటగిరీల మార్పుకు సంబంధించి సౌదీ అరేబియా ప్రభుత్వం గురువారం ఒక సంచలన నిర్ణయం తీసుకోంది.

ఇళ్లల్లో పనిచేసేవారి వీసాలకు సంబంధించి సౌదీ సంచలన నిర్ణయం

భారతీయులకు భారీగా ఉపశమనం

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: వీసా కేటగిరీల మార్పుకు సంబంధించి సౌదీ అరేబియా(Saudi Arabia) ప్రభుత్వం గురువారం సంచలన నిర్ణయం తీసుకోంది. స్థానికంగా ఇళ్ళల్లో పని చేసేందుకు సౌదీకి వచ్చే భారతీయులు, ఇతర దేశాల వారు సులువుగా తమ వీసా కేటగిరీని మార్చుకునేలా కొత్త మార్పులు తీసుకొచ్చింది. తద్వారా.. కొత్త ఉద్యోగాలలో చేరడం లేదా మాతృదేశానికి తిరిగెళ్లిపోవడం మరింత సులభతరం చేసింది. ఈ నిర్ణయంతో వేలాది మంది భారతీయులకు ఉపశమనం కలగనుంది. 


ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం.. విదేశీయులు మరో ఉద్యోగంలో చేరేందుకు వీలుగా వీసా కేటగిరీ మార్చుకునేందుకు,  స్వదేశం తిరిగి వెళ్ళేందుకు యాజమాని ఆంగీకారం తప్పనిసరి. ఫలితంగా.. వందలాది మంది తెలుగు ప్రవాసీ డ్రైవర్లు, ఇళ్లల్లో సహాయకులుగా ఉండేందుకు వచ్చిన వారు తాము మోసపోయిన సందర్భాల్లో కూడా ఎక్కడికీ కదల్లేక చిక్కుకుపోయే వారు. ఇటువంటి వారికి అండగా నిలిచే భారతీయ ఎంబసీ కొన్ని సందర్భాల్లో అక్కడి కఠిన చట్టాల కారణంగా నిస్సహాయంగా ఉండిపోవాల్సి వస్తోంది. కాగా ప్రభుత్వ తాజా నిర్ణయంతో పరిస్థితులు మారనున్నాయి.


తాజా మార్గదర్శకాల ప్రకారం.. ఉద్యోగంలో చేరిన మూడు నెలల పాటు యజమాని సక్రమంగా వేతనం చెల్లించని పక్షంలో అతడి అనుమతి లేకుండానే మరో ఉద్యోగంలోకి మారిపోవచ్చు.  దేశంలోకి వచ్చిన 15 రోజుల వరకు అఖమా ఇవ్వని సందర్భంలోనూ ఈ వెసులుబాటు వర్తిస్తుంది. ఇక అఖమా గడువు ముగిసిన ఒక నెలలోపు విదేశీ ఉద్యోగి మళ్లీ రెన్యూవల్ చేయించుకున్న సందర్భంలోనూ యాజమాని సమ్మతితో నిమిత్తం లేకుండా మరో ఉద్యోగంలో చేరవచ్చు. స్వదేశానికి తిరిగి వెళ్లాలనుకున్న వారికి కూడా యజమాని అనుమతి అవసరం లేదు. 

Updated Date - 2022-07-01T01:55:26+05:30 IST