న్యాయపాలనలో కొత్త పవనం

ABN , First Publish Date - 2021-07-08T05:48:46+05:30 IST

సత్యమేవ జయతే. భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) ఎన్‌విరమణ నేతృత్వంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం మన రాజ్యాంగ విలువలను సంపూర్ణంగా పరిరక్షించగలదనే...

న్యాయపాలనలో కొత్త పవనం

‘ఒక స్వేచ్ఛాయుత సమాజంగా మన మనుగడకు చట్టబద్ధపాలనే అత్యుత్తమ ఆధారం. మనమేకాలంలో నివసిస్తున్నా, మన పాలకులు ఎవరైనా, పాలనా పద్ధతులు ఏవైనా సరే సమన్యాయపాలన తన ప్రాధాన్యాన్ని, ప్రాసంగికతను కోల్పోదు. ఎందుకంటే సమన్యాయపాలన లేదా చట్టబద్ధపాలన అనేది మానవ నాగరికతా వికాస గాథ’.

భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ 


సత్యమేవ జయతే. భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) ఎన్‌విరమణ నేతృత్వంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం మన రాజ్యాంగ విలువలను సంపూర్ణంగా పరిరక్షించగలదనే భరోసా కలుగుతోంది. అత్యున్నత స్థానాలలోని వారు వివేకశీలురు అయినప్పుడు న్యాయం తప్పక వర్ధిల్లుతుంది. గత నెల 30న జస్టిస్ పిడి దేశాయి స్మారకోపన్యాసాన్ని వెలువరిస్తూ వివిధ అంశాలపై సిజెఐ వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఆయన న్యాయవిజ్ఞతకు అద్దం పట్టాయి. 


‘ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పాలకులను మార్చివేసే హక్కు ప్రజలకు ఉన్నంత మాత్రాన నిరంకుశ పాలన నుంచి మనకు రక్షణ లభిస్తుందని చెప్పలేమని’ సిజెఐ అన్న మాట అక్షరాలా సత్యం. ‘న్యాయవ్యవస్థకు పూర్తి స్వేచ్ఛ ఉండాలి. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు దాన్ని ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ, నియంత్రించకూడదు. న్యాయవ్యవస్థను కట్టడి చేస్తే చట్టబద్ధపాలన ఒక భ్రమగా మిగిలిపోతుంది’ అని సిజెఐ స్పష్టం చేశారు. ప్రభుత్వాలను విమర్శించడం, నిరసనలు తెలుపడం పౌరుల హక్కు అని ఆయన నొక్కి చెప్పారు. ‘వివేచనాయుతమైన చర్చ అనేది మానవ హుందా స్వతస్సిద్ధ లక్షణం. ప్రజాస్వామ్యం సక్రమంగా పని చేసేందుకు అది చాలా ముఖ్యం. విమర్శలు, నిరసనలు ప్రజాస్వామ్య ప్రక్రియలో అంతర్భాగాలు’ అని సిజెఐ ఉద్ఘాటించారు. ‘న్యాయమూర్తులు నిష్పక్షపాతంగా, నిర్భయంగా తీర్పులు వెలురించాలి. ఎవరి పట్ల వాత్స్యలం లేదా దుర్భావం చూపకూడదు. రాజ్యాంగ ధర్మాన్ని నిలబెట్టడం, చట్టాల అమలు కచ్చితంగా ఉండేలా చూడడమే న్యాయమూర్తుల బాధ్యత’ అని అన్నారు. ‘సామాజిక న్యాయసాధనకు దోహదం చేయడం న్యాయవాదుల విధ్యుక్త ధర్మం. కులమతాలు, జెండర్, వర్గపరమైన వ్యత్యాసాలు పాటించకూడదు. వృత్తిధర్మ నిర్వహణలో స్వార్థ ప్రయోజనాలకు ప్రాధాన్యమివ్వకూడదు’ అని హితవు చెప్పారు. కొవిడ్ సంక్షోభాన్ని నియంత్రించడంలో ప్రభుత్వాలు తప్పటడుగులు వేశాయని చెబుతూ ప్రస్తుత దశలో మహమ్మారి నుంచి ప్రజలను సంరక్షించడంలో చట్ట బద్ధపాలనను ఏ మేరకు ఉపయోగించామో నిష్పక్షపాతంగా సమీక్షించుకోవల్సి వుంది’ అని సిజెఐ సంయమనస్వరంతో చెప్పారు. ఇవన్నీ ఒక వివేచనాశీలి మాటలు. ఆయన మార్గదర్శకత్వంలో న్యాయవ్యవస్థ, గతి తప్పిన భారత ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ సరైన మార్గంలోకి తీసుకురాగలదనే నమ్మకం కలుగుతోంది.


న్యాయవ్యవస్థతో సహా మన ప్రజాస్వామ్య వ్యవస్థలు, సంస్థలను ఒక పద్ధతి ప్రకారం నిర్వీర్యం చేస్తున్న నరేంద్ర మోదీ–అమిత్ షా పాలనలో ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడగలగడం చాలా సాహసోపేతమైన విషయం. సిజెఐ రమణకు ముందు ప్రధాన న్యాయమూర్తులుగా ఉన్నవారు వెలువరించిన తీర్పులతో, పదవీలాలసతో వ్యవహరించిన తీరుతో సుప్రీంకోర్టు ప్రతిష్ఠ ఎంతగా మసకబారిపోయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటువంటి దౌర్భాగ్య తరుణంలో భారత ప్రధాన న్యాయమూర్తిగా రమణ రావడంతో దేశ సర్వోన్నత న్యాయస్థానం మళ్ళీ పూర్వప్రతిష్ఠను సమకూర్చుకోగలదనే విశ్వాసం ప్రజల్లో అంకురించింది. 


సిజెఐ ప్రసంగం విలువ, విశిష్టత ఏమిటి? ప్రస్తుత దేశపాలకుల ఆధ్వర్యంలో భారత ప్రజాస్వామ్య పరిస్థితి అమితంగా కలవరం కలిగిస్తోందని (పరోక్షంగానే అయినప్పటికీ) నిర్మొహమాటంగా రమణ చెప్పారు. పాలకులపై ఈ దోషారోపణ కంటే ముఖ్యమైనది ‘చట్టబద్ధ పాలన’ లేదా సమన్యాయపాలన’ (రూల్ ‌ఆఫ్‌ లా) పై ఆలోచనలు రేకేత్తించిన ఆయన వ్యాఖ్యలు. ‘ఒక స్వేచ్ఛాయుత సమాజంగా మన మనుగడకు చట్టబద్ధపాలనే ఒక అత్యుత్తమ ఆధారం’ అని సిజెఐ అన్నారు. ‘మనమే కాలంలో నివసిస్తున్నా, మన పాలకులు ఎవరైనా, పాలనా పద్ధతులు ఏవైనా సరే సమన్యాయపాలన తన ప్రాధాన్యాన్ని, ప్రాసంగికతను కోల్పోదు. ఎందుకంటే సమన్యాయ పాలన లేదా చట్టబద్ధపాలన అనేది మానవ నాగరికతా వికాస గాథ’. 


చట్టం అనేది సాధారణ అర్థంలో సామాజిక నియంత్రణా సాధనం. అయితే ఇది సమగ్ర నిర్వచనం కాదు. చట్టాన్ని రెండంచుల కత్తిలా కూడా ఉపయోగించవచ్చు. న్యాయం చేసేందుకే కాకుండా అణచివేతను సమర్థించేందుకు కూడా దానిని ఉపయోగించవచ్చు. కనుక న్యాయం, సమానత్వం ఆదర్శాల స్ఫూర్తిని నింపుకుని చట్టాన్ని నిజంగా ఒక చట్టంగా పరిగణించలేమని సిజెఐ రమణ అన్నారు. చట్టాన్ని అలా దుర్వినియోగపరచడాన్ని వివరిస్తూ బ్రిటిష్ వారు మన దేశాన్ని ‘చట్టబద్ధపాలన’తో కాకుండా ‘చట్టంతో పాలన’ (రూల్ బై లా) దృక్పథంతో పాలించారని ఆయన అన్నారు. భారత ప్రజలను పూర్తిగా తమ అదుపులో ఉంచుకోవడమే వలసపాలకుల లక్ష్యం గనుక వారు చట్టంతో పాలన చేశారని అన్నారు. 1922లో న్యాయస్థానం తనకు జైలు శిక్ష విధించినప్పుడు మహాత్మా గాంధీ చేసిన సుప్రసిద్ధ వ్యాఖ్యలను సిజెఐ ఉటంకించారు. ‘బ్రిటిష్ ఇండియాలో చట్టంతో నెలకొల్పిన ప్రభుత్వం ప్రజలను దోపిడీ చేస్తోందనే సత్యాన్ని వారు గ్రహించలేదు. భారత న్యాయస్థానాలలో భారతీయులకు న్యాయాన్ని నిరాకరిస్తున్నారు. అన్యాయాలకు పాల్పడిన యూరోపియన్లకే మేలు చేస్తున్నారు. ఈ దేశంలో న్యాయపాలన అనేది ఉద్దేశపూర్వకంగానో లేదా అనుద్దేశపూర్వకంగానో దోపిడీదారులకే అనుకూలంగా ఉంది’ అని ఆనాడు మహాత్ముడు కోర్టులో చేసిన ప్రకటన ఆసేతు హిమాచలం భారతీయులను విశేషంగా చైతన్యపరిచింది. సిజెఐ రమణ తన ప్రసంగంలో ఇంకా ఇలా అన్నారు: ‘స్వతంత్ర భారతం 1947 నుంచి చాలా దూరం పయనించింది. భారతీయులు ఇప్పుడు స్వతంత్ర, స్వేచ్ఛాయుత పౌరులు. మన రాజ్యాంగంలో చట్టబద్ధపాలన భావనను పొందుపరిచారు. రాజ్యాంగ ప్రవేశిక, ప్రాథమికహక్కులు, ఆదేశికసూత్రాలు, అధికారాల విభజన మొదలైన వాటిలో ఆ భావన మనకు స్పష్టంగా విశదమవుతుంది. మానవ హుందా, ప్రజాస్వామ్యం, న్యాయం అనే మూడు మహోన్నత విలువల సంగమంలో చట్టబద్ధ పాలనను సుప్రతిష్ఠితం చేయడం ద్వారా మన గణతంత్ర రాజ్య వ్యవస్థాపకులు ప్రపంచానికే మార్గదర్శనం చేశారు’. 


స్ఫూర్తిదాయకమైన సిజెఐ ప్రసంగం కలవరపెడుతున్న పలు ప్రశ్నలకు కూడా తావిస్తోంది. మన చట్టాలలో ఎన్ని ‘కేవలం ఆదేశాలు’గా కాకుండా న్యాయచైతన్యంతో మిళితమై ఉన్నాయి? చట్టాలను అమలుపరిచే యంత్రాంగం నిజంగా చట్టానికి, న్యాయానికి మధ్య అనివార్యమైన సంబంధంగా ఉందా? ఈ సందర్భంగా భారత దేశ న్యాయ నిర్వహణ వ్యవస్థలో సంస్కరణలకు కొన్ని ప్రయోజనకరమైన సూత్రాలను సిజెఐ ప్రతిపాదించారు. ఇవి తెలిసినవే అయినప్పటికీ మరొకసారి నొక్కి చెప్పుకోవాల్సిన అవసరముంది. ‘చట్టాలు, న్యాయస్థానాల తీర్పులను సామాన్య ప్రజలకు వారి వారి మాతృభాషల్లో అందుబాటులో ఉంచాలి’ అని ఆయన పేర్కొన్నారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ ట్రాన్స్‌లేషన్‌ల కాలంలో అదేమంత కష్టమా? కాదు. ‘చట్టం ముందు అందరూ సమానమే ’అన్న న్యాయసూత్రాన్ని కచ్చితంగా పాటించి తీరాలని కూడ సిజెఐ అన్నారు. ముఖ్యంగా జెండర్ సమానత్వానికి ఆయన ఇచ్చిన ప్రాధాన్యం ప్రశంసనీయమైంది. కుటుంబ వ్యవస్థలో మార్పులు వస్తున్న విధంగా కుటుంబంలో స్త్రీ పురుషుల సంప్రదాయ పాత్రలు కూడా మారుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. స్త్రీ పురుష సమానత్వాన్ని, మహిళా హుందాను చాలా దేశాలు రాజ్యాంగ బద్ధంగానో లేదా చట్టబద్ధంగానో గుర్తించాయని ఆయన అన్నారు. ‘పక్షపాతం దురభిమానం అన్యాయానికి దారి తీస్తాయని, ముఖ్యంగా మైనారిటీ వర్గాల విషయంలో అన్యాయానికి దారితీస్తాయని ఆయన నొక్కి చెప్పారు. భవిష్యత్తులో ఆయన భారత న్యాయస్థానాలలో పక్షపాతం, దురభిమానాలకు ఎలా బాధితులు అవుతున్నదీ విశదం చేయగలరని నేను ఆశిస్తున్నాను. 


ప్రభుత్వం తన పౌరులకు శ్రేయో పాలన నందిస్తోందా? సిజెఐ రమణ ఇలా అన్నారు: ‘పౌరులు తమను పాలించే చట్టాల నిర్మాణంలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానే భాగస్వాములు కావడమే ప్రజాస్వామ్య ముఖ్యసూత్రం. భారత్‌లో ఇది ఎన్నికల ద్వారా జరుగుతోంది. సార్వజనీన ఓటు హక్కు ద్వారా ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకుంటున్నారు. చట్టసభలలో వారు చట్టాలను చేస్తున్నారు. ఇంతవరకు జరిగిన 17 సార్వత్రక ఎన్నికలలో ప్రజలు ఎనిమిదిసార్లు పాలక పక్షాలు లేదా కూటములను తిరస్కరించారు. నిరక్షరాస్యత, వెనుకబాటుతనం, అసమానతలు, పేదరికం ముమ్మరంగా ఉన్నప్పటికీ భారత ప్రజలు గొప్ప ప్రజాస్వామిక చైతన్యంతో వ్యవహరిస్తున్నారు. తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. మరి పార్లమెంటు, శాసనసభలకు ఎన్నికైన వారు రాజ్యాంగం తమకు నిర్దేశించిన విధులను సక్రమంగా, చిత్తశుద్ధితో నిర్వర్తిస్తున్నామా, రాజ్యాంగానికి అనుగుణంగా పాలిస్తున్నామా అన్న విషయమై ఆత్మశోధన చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు మాత్రమే మన రాజ్యాంగవ్యవస్థలను కాపాడుకోవడం సాధ్యమవుతుంది’. 


స్వతంత్రమైన, సుదృఢమైన న్యాయవ్యవస్థ చాలా ముఖ్యమని సిజెఐ రమణ వక్కాణించారు. శాసనవ్యవస్థలు తీసుకువచ్చే చట్టాలు రాజ్యాంగానికి అనుగుణంగా ఉండేలా చేసే బాధ్యత న్యాయవ్యవస్థది. అయితే రాజ్యాంగ బద్ధతను కాపాడడటమనే బాధ్యత పూర్తిగా న్యాయస్థానాలది మాత్రమే కాదన్న వాస్తవాన్ని గుర్తించాలి. రాజ్యవ్యవస్థలోని మూడు విభాగాలూ- కార్యనిర్వాహక, శాసన, న్యాయ వ్యవస్థలు-– రాజ్యాంగధర్మ నిక్షేపాలు. తమకు నివేదించిన వాస్తవాల ప్రాతిపదికన మాత్రమే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది గనుక న్యాయవ్యవస్థ పాత్ర, న్యాయచర్యల పరిధి పరిమితమైనవి. ఈ పరిమితులను అర్థం చేసుకుని రాజ్యాంగవిలువలను సంపూర్ణంగా పరిరక్షించేందుకు, ప్రజలందరికీ సమస్థాయిలో న్యాయం సమకూరేందుకు శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలూ ప్రాథమిక బాధ్యత వహించాలి’ అని సిజెఐ అన్నారు. ఆయన వ్యాఖ్యలు మన ప్రజాస్వామ్యంలో ప్రస్తుతం నెలకొన్న అంధకారంలో వెలుగులను విరజిమ్మాయనడంలో సందేహం లేదు. రాజ్యాంగవిలువలు, ఆదర్శాలను కాపాడడంలో సర్వోన్నత న్యాయస్థానం మరింత ధైర్యాన్ని చూపగలదని ఆశిద్దాం. 

సుధీంద్ర కులకర్ణి 

(‘ద క్వింట్’ సౌజన్యం)

Updated Date - 2021-07-08T05:48:46+05:30 IST