న్యూ ఇయర్‌ వేడుకలపై నిషేధం

ABN , First Publish Date - 2021-12-18T15:03:17+05:30 IST

రాష్ట్రంలో కొత్తరూపు సంతరించుకున్న కరోనా వైరస్‌ ‘ఒమైక్రాన్‌’ ప్రవేశించడంతో నగరంలోను, సబర్బన్‌ ప్రాంతాల్లోనూ ఆంగ్ల సంవత్స రాది వేడుకలపై నిషేధం విధించేందుకు పోలీసు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు.

న్యూ ఇయర్‌ వేడుకలపై నిషేధం

                 - స్టార్‌ హోటళ్లలో మిడ్‌నైట్‌ పార్టీలకు బ్రేక్‌


చెన్నై: రాష్ట్రంలో కొత్తరూపు సంతరించుకున్న కరోనా వైరస్‌ ‘ఒమైక్రాన్‌’ ప్రవేశించడంతో నగరంలోను, సబర్బన్‌ ప్రాంతాల్లోనూ ఆంగ్ల సంవత్సరాది వేడుకలపై నిషేధం విధించేందుకు పోలీసు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మెరీనాబీచ్‌ తదితర తీర ప్రాంతాల్లో ఈ నెల 31 నుంచి జనవరి ఒకటి వరకూ ఆంగ్ల సంవత్సరాది వేడుకలు జరుపరాదంటూ ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో ప్రతియేటా ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా నగరంలోని స్టార్‌హోటళ్లు, శివారు ప్రాంతాల్లోని ఫామ్‌ హౌస్‌ల్లో డిసెంబర్‌ 31వ తేదీ రాత్రి మందు పార్టీలు, విందులు, వినోదాలు, నృత్యకార్యక్రమాలు జరుగుతుంటాయి. అయితే ఈ యేడాది ‘ఒమైక్రాన్‌’ వ్యాప్తి  నిరోధించడానికి చర్యలు చేపట్టమంటూ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ‘ఒమైక్రాన్‌’పై వచ్చే యేడాది జనవరి 15వరకు అప్రమత్తంగా వ్యవహరించాలంటూ హెచ్చరించింది. ఈ పరి స్థితులలో నగరంలోని స్టార్‌ హోటళ్లు, వినోద క్లబ్బుల యజమానులు, ఫామ్‌హౌస్‌ల నిర్వాహకులతో పోలీసు ఉన్నతాధికారులు త్వరలో చర్చలు జరుపనున్నారు. ఈ విషయమైన పోలీసు ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ సముద్రతీర ప్రాంతాల్లో న్యూ ఇయర్‌ వేడుకలను, ప్రజ ల సందర్శనను నిషేధించిన నేపథ్యంలో ఫామ్‌హౌస్‌లు, స్టార్‌హోటళలో ఆ వేడుకలను జరుపుకునేందుకు అనుమతిస్తే వేల సంఖ్యలో ప్రజలు ఒకే చోట గుమికూడి వైరస్‌ వ్యాప్తికి కారకులవుతారన్నారు. ఈ విషయంపై వాటి యజమానులతో త్వరలో చర్చించనున్నట్టు చెప్పారు. నగరంలోని స్టార్‌ హోటళ్ల నిర్వాహకులు మాట్లాడుతూ ఇప్పటి వరకూ తాము ఆంగ్ల సంవత్సరాదికి ఎలాంటి ఏర్పాట్లు చేపట్ట లేదని, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం నడచుకుంటామని తెలిపారు.

Updated Date - 2021-12-18T15:03:17+05:30 IST