NRI: అమెరికాలోనే అత్యంత ఖరీదైన అపార్ట్‌మెంట్.. ధర ఎంతో తెలిస్తే..

ABN , First Publish Date - 2022-09-20T01:53:56+05:30 IST

అమెరికాలో(USA) ఇటీవలే మార్కెట్‌లో అమ్మకానికి వచ్చిన ఓ అపార్ట్‌మెంట్(Apartment) చరిత్ర సృష్టించింది.

NRI: అమెరికాలోనే అత్యంత ఖరీదైన అపార్ట్‌మెంట్.. ధర ఎంతో తెలిస్తే..

ఎన్నారై డెస్క్: అమెరికాలో(USA) ఇటీవలే మార్కెట్‌లో అమ్మకానికి వచ్చిన ఓ అపార్ట్‌మెంట్(Apartment) చరిత్ర సృష్టించింది. యావత్ దేశంలోనే అత్యంత ఖరీదైన అపార్ట్‌మెంట్‌గా(Most Expensive) పేరుపొందింది. దీని ధర 250 మిలియన్ డాలర్లు. మన కరెన్సీలో చెప్పుకోవాలంటే  రూ.19,92,33,50,000. న్యూయార్క్ రాష్ట్రం.. మాన్‌హట్టన్‌(Manhattan) నగరంలోని సెంట్రల్ పార్క్ టవర్‌‌లో ఈ అపార్ట్‌మెంట్ ఉంది. 1550 అడుగుల ఎత్తున్న సెంట్రల్ పార్క్ టవర్‌కు(Central Park tower) ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సముదాయంగా పేరుంది. 


సెంట్రల్ పార్క్ టవర్‌లోని 129 నుంచి 131 అంతస్తుల మధ్య విస్తరించిన ఈ ట్రిప్లెక్స్ పెంట్‌హౌస్‌లో 17,500 చదరపు అడుగుల ఇండోర్ స్పేస్‌తో పాటూ 1400 చదరపు అడుగుల ఔట్‌డోర్ స్పేస్ కలిగిన టెర్రస్ ఉంది. ఇందులో 7 బెడ్‌రూమ్స్, 11 బాత్‌రూమ్స్ ఉన్నాయి. మన్‌హట్టన్‌లో  ‘బిలియనీర్స్‌ రో’ గా పేరుపడ్డ 217 వెస్ట్ 57వ వీధిలో సెంట్రల్ పార్క్ టవర్ ఉంది. సెర్హాంట్ బ్రోకరేజీ(Serhant brokerage) సంస్థ దీన్ని అమ్మకానికి పెట్టింది. ఇటీవల కాలంలో అపరకుబేరులు.. వివిధ రకాల ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నట్టు షర్హాంట్ బ్రోకరేజీ సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. దీంతో.. ఇలాంటి రియల్ ఎస్టేట్ ఆస్తులకు బాగా డిమాండ్ పెరిగిందన్నారు. 


ఇప్పటికే న్యూయార్క్‌లో రియల్ ఎస్టేట్ రంగం మంచి ఊపు మీద ఉంది. ఈ ఏడాదిలో అత్యధిక లాభాలు అందించిన రెసిడెన్షియల్ మార్కెట్‌గా న్యూయార్క్ రికార్డు సృష్టించిందని షర్హాంట్ బ్రోకరేజీ సంస్థ ప్రతినిధి తెలిపారు. ఈ ఆరునెలల్లో ఆస్తుల విలువ ఏకంగా 4 శాతం పెరిగింది. అయితే..ఆస్తుల విలువ పెరుగుదలలో సగటున 12.5 శాతం అభివృద్ధి చూపించిన శాన్‌ఫ్రాన్‌సిస్కో, లాస్ ఏంజిలిస్, మియామీ నగరాలు న్యూయార్క్‌‌ను మించిపోయాయి. ఇక న్యూయార్క్‌లో అద్దెలు కూడా భారీ స్థాయిలో పెరిగాయని పరిశీలకులు అంటున్నారు. గతేడాది ఆగస్టుతో పోలిస్తే..ఈ మారు సింగిల్ బెడ్‌రూం అద్దె ఏకంగా 40 శాతం మేర పెరిగిందట. ఇక రెండు పడక గదులున్న నివాసాల అద్దె 47 శాతం మేర పెరిగింది.  

Updated Date - 2022-09-20T01:53:56+05:30 IST