Polio: అత్యయిక స్థితి ప్రకటించిన న్యూయార్క్ రాష్ట్ర గవర్నర్..!

ABN , First Publish Date - 2022-09-10T23:32:19+05:30 IST

పోలియో(Polio) ప్రమాదం పోంచి ఉన్న నేపథ్యంలో న్యూయార్క్(Newyork) రాష్ట్ర గవర్నర్ తాజాగా అత్యయిక స్థితి(State of Emergency) ప్రకటించారు.

Polio: అత్యయిక స్థితి ప్రకటించిన న్యూయార్క్ రాష్ట్ర గవర్నర్..!

ఎన్నారై డెస్క్: పోలియో(Polio) ప్రమాదం పోంచి ఉన్న నేపథ్యంలో న్యూయార్క్(Newyork) రాష్ట్ర గవర్నర్ తాజాగా అత్యయిక స్థితి(State of Emergency) ప్రకటించారు. న్యూయార్క్ నగరంతో పాటూ సిటీకి సమీపంలోని నాలుగు కౌంటీల్లో వ్యర్థ జలాల్లో పోలియో వైరస్ బయటపడటంతో ప్రభుత్వం యంత్రాంగం అప్రమత్తమైంది. వ్యాధిని నిరోధించేందుకు వీలుగా అదనపు నిధులు, మానవవనరులు కేటాయించేందుకు ప్రభుత్వం అత్యయిక స్థితిని ప్రకటించింది. 


1955లోనే అమెరికాలో పోలియో టీకాకరణ ప్రారంభమైంది.  దేశంలో పోలియోను నిర్మూలించినట్టు 1979లో అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో టీకాకరణ చాలా తక్కువగా ఉందని కొందరు అధికారులు చెబుతున్నారు. నానాటికీ పడిపోతున్న టీకాకరణ రేటును పెంచే దిశాగా అత్యయిక స్థితిని ప్రకటించినట్టు వివరించారు. చిన్నారులు అధికంగా పోలీయో బారిన పడతారన్న విషయం తెలిసిందే. చికిత్స లేని ఈ వ్యాధి సోకితే.. కండరాలు బలహీనపడ చివరికి పెరాలిసిస్ వస్తుంది. 


అయితే.. టీకా ద్వారా ఈ వ్యాధి బారిన పడకుండా చిన్నారులను రక్షించవచ్చు. రాష్ట్రంలో టీకాకరణ సగటు రేటు ప్రస్తుతం 79 శాతంగా ఉందని అధికారులు తెలిపారు. దీన్ని 90 శాతానికి చేర్చడమే తమ లక్ష్యమని తెలిపారు. రాక్‌ల్యాండ్ కౌంటీలో ఓ వ్యక్తి జూలై నెలలో పోలియో బారిన పడటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలో వివిధ ప్రాంతాల్లో మురుగునీటి శాంపిళ్లను పరీక్షించగా..పలు చోట్ల వైరస్ బయటపడింది. దీంతో.. అప్రమత్తమైన ప్రభుత్వం వైరస్‌ను ఆదిలోనే కట్టడి చేసేందుకు అత్యయిక స్థితి ప్రకటించింది. 

Updated Date - 2022-09-10T23:32:19+05:30 IST