న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్ర గవర్నర్ ఆండ్రూ క్యూమోపై మరో మాజీ మహిళా ఉద్యోగిని లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఈసారి ఆరోపణలు 25 ఏళ్ల మాజీ ఆరోగ్య సలహాదారు షార్లెట్ బెన్నెట్ నుండి వచ్చాయి. 2020 జూన్‌లో ఆండ్రూ తనను లైంగికంగా వేధించాడని ప్రముఖ న్యూస్ ఏజెన్సీతో ఆమె తెలిపింది. బెన్నెట్ మాట్లాడుతూ 63 ఏళ్ల గవర్నర్ గతేడాది జూన్‌లో తాను 20 ప్లస్ వయస్సు గల మహిళతో డేటింగ్‌కు సిద్ధంగా ఉన్నట్లు చెప్పాడని... అయితే, మా ఇద్దరి మధ్య శృంగార సంబంధంపై వయస్సులో తేడా ప్రభావం చూపగలదా? అని తనను ప్రశ్నించినట్లు న్యూస్ ఏజెన్సీతో బెన్నెట్ పేర్కొంది.
క్యూమో తనను ఎప్పుడూ అసభ్యకరంగా తాకకపోయినప్పటికీ, ఆయన తనతో గడపాలని అనుకుంటున్నట్లు తనకు అర్థమైందని బెన్నెట్ తెలిపింది. గవర్నర్ ఆ ఉద్దేశంతోనే తనను అలా అడిగి ఉంటాడని.. దాంతో తనకు అసౌకర్యంగా, భయంగా అనిపించిందని బెన్నెట్ చెప్పుకొచ్చింది. వెంటనే తాను క్యూమో చీఫ్ ఆఫ్ స్టాఫ్, న్యాయ సలహాదారుతో మాట్లాడి వేరే పోస్టులో వేరే భవనానికి మారిపోయానని చెప్పింది. ప్రస్తుతం తన కొత్త జాబ్ చాలా బాగుందని ఆమె పేర్కొంది. ఇదిలాఉంటే.. తనపై బెన్నెట్ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలను క్యూమో ఖండించారు. ఆమె పట్ల తాను ఎప్పుడూ అలా ప్రవర్తించలేదన్నారు. అసలు ఆమెను ఎప్పుడు కూడా ఆ ఉద్దేశంతో చూడలేదని చెప్పారు.
అలాగే మరో మాజీ సలహాదారు లిండ్సే బోయ్లాన్ కూడా బుధవారం గవర్నర్ క్యూమోపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. 2015-18 మధ్య కాలంలో గవర్న్‌తో కలిసి పనిచేసినప్పుడు తనపై వేధింపులకు పాల్పడినట్లు తెలిపింది. గవర్నర్ తన పెదవులపై అవాంఛనీయమైన ముద్దు ఇచ్చాడని 36 ఏళ్ల బోయ్లాన్ ఆరోపించింది. తనతో స్ట్రిప్ పోకర్ ఆడమని కోరుతూ తనను తాకరాని చోట తాకాడని ఆమె చెప్పుకొచ్చింది. కాగా, బోయ్లాన్ ఆరోపణలను క్యూమో ఆఫీస్ కొట్టిపారేసింది. ఆమె చెబుతుందంతా పచ్చి అబద్దమని పేర్కొంది. ఇక గత పదేళ్లుగా డెమొక్రటిక్ పార్టీకి చెందిన ఆండ్రూ క్యూమో న్యూయార్క్ గవర్నర్‌గా కొనసాగుతున్నారు. 2022తో ఆయన మూడో టర్మ్ గవర్నర్ గిరి ముగియనుంది.