Brooklyn subway షూటర్ కోసం న్యూయార్క్ పోలీసుల గాలింపు

ABN , First Publish Date - 2022-04-13T14:47:18+05:30 IST

న్యూయార్క్ నగరంలోని బ్రూక్లిన్ సబ్‌వేలో కాల్పులు జరిపిన ముష్కరుడి కోసం న్యూయార్క్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు...

Brooklyn subway షూటర్ కోసం న్యూయార్క్ పోలీసుల గాలింపు

న్యూయార్క్ (అమెరికా): న్యూయార్క్ నగరంలోని బ్రూక్లిన్ సబ్‌వేలో కాల్పులు జరిపిన ముష్కరుడి కోసం న్యూయార్క్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.న్యూయార్క్‌లోని సబ్‌వేలో ఓ దుండగుడు కాల్పులు జరపడంతో 20 మందికి పైగా గాయపడ్డారు. మాన్‌హాటన్‌కు వెళ్లే సబ్‌వే రైలు బ్రూక్లిన్‌లోని సన్‌సెట్ పార్క్ పరిసరాల్లోని భూగర్భ స్టేషన్‌లోకి వస్తున్నప్పుడు ఈ దాడి జరిగింది.బుధవారం  ఉదయం కాల్పులు జరిపిన వ్యక్తిని న్యూయార్క్ పోలీసులు గుర్తించారు.కాల్పులు జరిపిన అనుమానిత వ్యక్తి ప్రాంక్ జేమ్స్ గా పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలంలో ఓ వ్యాన్ కీని స్వాధీనం చేసుకున్నామని, ఆ వ్యాన్ ఫిలడెల్ఫియాలో దుండగుడు అద్దెకు తీసుకున్నాడని పోలీసులు చెప్పారు. జేమ్స్ కు ఫిలడెల్పియా, విస్కాన్సిన్ లలో చిరునామాలున్నాయని అధికారులు పేర్కొన్నారు. ప్రాంక్ జేమ్స్ సమాచారం తెలిసిన వారు తమకు సమాచారం అందించాలని న్యూయార్క్ పోలీసులు కోరారు. 


కాల్పులు జరిపిన వ్యక్తి ఎత్తుగా ఉన్నాడని, నారింజరంగు, బూడిద రంగు చొక్కా, ఆకుపచ్చ హెల్మెట్, సర్జికల్ మాస్క్ ధరించాడని పోలీసులు వివరించారు. రైలు స్టేషనులోకి ప్రవేశించబోతున్నపుడు గ్యాస్ మాస్కు ధరించిన సాయుధుడు స్మోక్ బాంబు పేల్చి కాల్పులు జరిపాడు. దీంతో రైలులో పొగ వ్యాపించింది.దుండగుడు గ్లోక్ 9 ఎంఎం సెమీ ఆటోమేటిక్ హ్యాండ్ గన్ తో 33 రౌండ్లు కాల్పులు జరిపాడని, సంఘటన స్థలంలో మందుగుండు మ్యాగజైన్ లు, ఒక హాట్ చెట్, బాణసంచా, గ్యాసోలిన్ కంటైనరును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.న్యూయార్క్ సిటీ సబ్‌వే కాల్పుల ఘటనలో తాజా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌కు వివరించినట్లు వైట్ హౌస్ తెలిపింది. వైట్ హౌస్ సీనియర్ సిబ్బంది న్యూయార్క్ మేయర్, పోలీసు కమిషనర్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు.


Updated Date - 2022-04-13T14:47:18+05:30 IST