ఒమైక్రాన్ అడుగుపెట్టినా లాక్‌డౌన్ ప్రసక్తే లేదు: న్యూజిలాండ్

ABN , First Publish Date - 2022-01-21T00:22:24+05:30 IST

కరోనా తొలి దశను సమర్థంగా అణచివేసిన న్యూజిలాండ్ ఒమైక్రాన్‌ను కూడా దూరంగా ఉంచింది.

ఒమైక్రాన్ అడుగుపెట్టినా లాక్‌డౌన్ ప్రసక్తే లేదు: న్యూజిలాండ్

వెల్లింగ్టన్: కరోనా తొలి దశను సమర్థంగా అణచివేసిన న్యూజిలాండ్ ఒమైక్రాన్‌ను కూడా దూరంగా ఉంచింది. అయితే, ఒమైక్రాన్ వ్యాప్తి అనివార్యమైతే కనుక ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న ప్రశ్నకు కివీస్ ప్రధాని జెసిండా అర్డెర్న్ మాట్లాడుతూ.. లాక్‌డౌన్ జోలికి మాత్రం పోబోమన్నారు. ఒమైక్రాన్ వేరియంట్‌ను కనుక గుర్తిస్తే వెంటనే ఆంక్షలను కఠినతరం చేస్తామని చెప్పారు. గతంలో లాక్‌డౌన్లు విధించామని, ఈసారి మాత్రం వాటి జోలికి పోబోమన్నారు.  


కరోనా మహమ్మారితో మనం గతంలో పోరాడిన దానితో పోలిస్తే ఈ పోరాటం భిన్నమని పేర్కొన్న జెసిండా.. ఒమైక్రాన్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతుందన్నారు. కాబట్టి దీనిని ఎదుర్కోవాలంటే మరింత గట్టిగా పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఒకసారి ఇది దేశంలో అడుగుపెడితే దానిని నియంత్రించడం సవాలేనని అన్నారు. అయితే, కొవిడ్ మారితే తామూ మారుతామన్నారు. ఒమైక్రాన్‌ను గుర్తించిన 24 నుంచి 48 గంటల్లోనే దేశం ‘రెడ్’ సెట్టింగ్స్‌లోకి వెళ్లిపోతుందన్నారు. అప్పుడు వ్యాపార కార్యకలాపాలు, దేశీయ ప్రయాణాలకు మాత్రమే అనుమతి ఉంటుందని, విద్యార్థులు మాస్కులు ధరించాలని, వందమందికి మించి జనానికి అనుమతి ఉండదని జెసిండా వివరించారు. 


న్యూజిలాండ్‌లో ప్రస్తుతం ‘ఆరెంజ్’ సెట్టింగ్స్ అమల్లో ఉన్నాయి. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలి. వ్యాక్సినేషన్ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. అయితే జనం ఒక్క చోటికి చేరడంపై ఆంక్షలు లేవు. న్యూజిలాండ్‌లో 12 ఏళ్లు, ఆపైబడిన వారిలో 93 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయింది. 52 శాతం మంది బూస్టర్ షాట్ కూడా తీసుకున్నారు. ప్రస్తుం 5 నుంచి 11 ఏళ్లలోపు పిల్లలకు టీకాలు వేస్తున్నారు.  

Updated Date - 2022-01-21T00:22:24+05:30 IST