ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 13 జిల్లాలు

ABN , First Publish Date - 2022-01-27T07:27:01+05:30 IST

పదమూడు జిల్లాల ఏపీని.. రాష్ట్ర ప్రభుత్వం 26 జిల్లాలుగా విస్తరించింది. 13 కొత్త జిల్లాలతో పాటు 12 కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై మంగళవారం అర్ధరాత్రి గెజిట్‌ నోటిఫికికేషన్‌ విడుదల చేసింది. దీనిపై ఏవిధమైన అభ్యంతరాలు ఉన్నా..

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 13 జిల్లాలు

  • 12 కొత్త రెవెన్యూ డివిజన్లు..
  • గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ 
  • అభ్యంతరాలకు నెల గడువు..
  • విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్‌ జిల్లా ఏర్పాటు


కొత్తగా ప్రతిపాదించిన 13 జిల్లాలు

1. మన్యం 

2. అల్లూరి సీతారామారాజు 

3. అనకాపల్లి 

4. కాకినాడ 

5. కోనసీమ 

6. ఏలూరు 

7. ఎన్టీఆర్‌ 

8. బాపట్ల 

9. పల్నాడు 

10. నంద్యాల 

11. శ్రీ సత్యసాయి 

12. అన్నమయ్య 

13. శ్రీ బాలజీ. 


కొత్త రెవెన్యూ డివిజన్లు 

1. బొబ్బిలి (విజయనగరం) 

2. భీమునిపట్నం (విశాఖ) 

3. భీమవరం (పశ్చిమగోదావరి) 

4. నందిగామ  (ఎన్టీఆర్‌ జిల్లా) 

5. తిరువూరు (ఎన్టీఆర్‌ జిల్లా) 

6. బాపట్ల (బాపట్ల జిల్లా) 

7. చీరాల (బాపట్ల జిల్లా) 

8. పొదిలి (ప్రకాశం) 

9. ఆత్మకూరు (నంద్యాల) 

10. పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా) 

11. రాయచోటి (అన్నమయ్య జిల్లా) 12. పలమనేరు (చిత్తూరు జిల్లా) 


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

పదమూడు జిల్లాల ఏపీని.. రాష్ట్ర ప్రభుత్వం 26 జిల్లాలుగా విస్తరించింది. 13 కొత్త జిల్లాలతో పాటు 12 కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై మంగళవారం అర్ధరాత్రి గెజిట్‌ నోటిఫికికేషన్‌ విడుదల చేసింది. దీనిపై ఏవిధమైన అభ్యంతరాలు ఉన్నా.. నెలరోజుల్లోగా ఆయా జిల్లాల కలెక్టర్లకు తెలపాలని ప్రజలను కోరింది. ఇందుకు ఫిబ్రవరి 26 వరకు గడువు విధించింది. ఈ మేరకు రెవెన్యూశాఖ తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. జిల్లాల ఏర్పాటు చట్టం-1974లోని సెక్షన్‌ 3(5) కింద కొత్తగా 13  జిల్లాలు, 12 రెవెన్యూ డివిజన్‌లను ప్రతిపాదించారు. దీంతో ఇప్పటి వరకు ఉన్న జిల్లాలతో కలిపి మొత్తంగా 26 జిల్లాలు, 63 రెవెన్యూ డివిజన్‌లను అందులో ప్రతిపాదించారు. అయితే, గెజిట్‌ నోటిఫికేషన్‌లలో పొందుపరిచిన జిల్లాలు, డివిజన్‌ల పేర్లలో తప్పులు వచ్చాయని ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు.. జిల్లాల వారీగా కలెక్టర్ల నుంచి నివేదికలు కోరారు. వారు ఇచ్చే సమాచారం ఆధారంగా సవరణ నోటిఫికేషన్‌లు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఉగాది నాటికి కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రారంభించాలని సర్కారు సన్నాహాలు చేస్తోంది. 


26 జిల్లాల స్వరూపం ఇదే..


1. శ్రీకాకుళం జిల్లా: హెడ్‌ క్వార్టర్‌ శ్రీకాకుళం 

రెవెన్యూ డివిజన్‌లు: 1. టె క్కలి, 2. శ్రీకాకుళం

పాలకొండ రెవెన్యూ డివిజన్‌ను పునర్వ్యవస్థీకరించారు. అందులోని పాతపట్నం, మలియపుట్టి మండలాలను టెక్కలి డివిజన్‌లో కలిపారు. సవకోట, కొత్తూరు, హీర మండలాలను శ్రీకాకులం డివిజన్‌లో పేర్కొన్నారు. 


2. విజయనగరం జిల్లా: హెడ్‌ క్వార్టర్‌ విజయనగరం

రెవెన్యూ డివిజన్లు: 1. విజయనగరం, 2. బొబ్బిలి

విజయనగరం డివిజన్‌లో 15 మండలాలు, బొబ్బిలిలో 11 మండలాలు ఉన్నాయి. 

 

3. మన్యం జిల్లా: హెడ్‌ క్వార్టర్‌ పార్వతీపురం

రెవెన్యూ డివిజన్లు: 1. పాలకొండ, 2. పార్వతీపురం

శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ రెవెన్యూ డివిజన్‌ను పార్వతీపురం జిల్లాలో కలిపేశారు. ఈ డివిజన్‌లోని కొన్ని మండలాలను విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కొంతమేర కలిపారు. ఇప్పుడు పాలకొండ డివిజన్‌లో పాలకొండ, సీతంపేట, భామిని, వీరఘట్టం మండలాలను మన్యం జిల్లాలోకి తీసుకొచ్చారు. ఇక, పార్వతీపురం డివిజన్‌ పరిధిలోని జియమ్మవలస, గరుగుబిల్లి మండలాలను పాలకొండ డివిజన్‌లో కలిపారు. పార్వతీపురం డివిజన్‌లో 9 మండలాలను కొనసాగిస్తూ, కొత్తగా విజయనగరం డివిజన్‌ పరిధిలోని మెంటాడ మండలాన్ని మన్యం జిల్లాలోకి తెచ్చారు. 


4. అల్లూరి సీతారామరాజు జిల్లా: హెడ్‌ క్వార్టర్‌ పాడేరు

రెవెన్యూ డి విజన్లు: 1. పాడేరు. 2. రంపచోడవరం

తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని రంపచోడవరం, యటపాక డివిజన్‌లోని కొన్ని మండలాలను పాడేరు, రంపచోడవరం డివిజన్‌లలో విలీనం చేశారు. పాడేరులో 11 మండలాలను చేర్చారు. యటపాక డివిజన్‌ పరిధిలోని యటపాక, చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం మండలాలను రంపచోడవరం డివిజన్‌లో విలీనం చేశారు. 


5. విశాఖపట్నం జిల్లా: హెడ్‌ క్వార్టర్‌ విశాఖపట్నం 

రెవెన్యూ డివిజన్లు: 1. భీమునిపట్నం. 2. విశాఖపట్నం

విశాఖపట్నం రెవెన్యూ డివిజన్‌ను రెండు భాగాలు చేశారు. భీమునిపట్నం మండలాన్ని రెవెన్యూ డివిజన్‌గా మార్చారు. ఇందులో భీమిలి, ఆనందపురం, పద్మనాభం, విశాఖ రూరల్‌, మహారాణిపేట మండలాలను కలిపారు. విశాఖ డివిజన్‌లో గాజువాక, పెదగంట్యాడ, గోపాలపట్నం, మూలగడ, సీతమ్మధార మండలాలను చేర్చారు. 


6. అనకాపల్లి జిల్లా: హెడ్‌ క్వార్టర్‌ అనకాపల్లి

రెవెన్యూ డివిజన్లు: 1. అనకాపల్లి, 2. నర్సీపట్నం 

అనకాపల్లి డివిజన్‌లో విశాఖ డివిజన్‌ పరిధిలోని పెందుర్తి, పరవాడ, సబ్బవరం మండలాలను విలీనం చేశారు. అనకాపల్లి డివిజన్‌లో 15, నర్సీపట్నం డివిజన్‌లో 10 మండలాలు ఉన్నాయి. 


7. కాకినాడ జిల్లా: హెడ్‌ క్వార్టర్‌ కాకినాడ

రెవెన్యూ డివిజన్లు: 1. పెద్దాపురం, 2. కాకినాడ

పెద్దాపురంలో 12 మండలాలు, కాకినాడలో 7 మండలాలు ఉన్నాయి. రాజమండ్రి మండలంలోని గోకవరంను పెద్దాపురం రెవెన్యూ డివిజన్‌లో కలిపారు. 


8. కోనసీమ జిల్లా: హెడ్‌ క్వార్టర్‌ అమలాపురం

రెవెన్యూ డివిజన్లు: 1. అమలాపురం, 2. రామచంద్రాపురం

తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం, రంపచోడవరం, కాకినాడ, రాజమండ్రి రెవెన్యూ డివిజన్లలోని ప్రాంతాలను కలిపి కోనసీమ జిల్లాగా ఏర్పాటు చేశారు. రామచంద్రాపురం డివిజన్‌లో కాకినాడ డివిజన్‌ పరిధిలోని తాళ్లరేవు, రాజమండ్రి పరిధిలోని ఆలమూరును కలిపారు. దీంతో అమలాపురంలో 16 మండలాలు, రామచంద్రాపురంలో 8 మండలాలు కలిశాయి. 


9. తూర్పుగోదావరి జిల్లా:హెడ్‌ క్వార్టర్‌ రాజమహేంద్రవరం

రెవెన్యూ డివిజన్లు: 1. రాజమహేంద్రవరం 2. కొవ్వూరు

రాజమహేంద్రవరం డివిజన్‌లో రంపచోడవరం పరిధిలోని ఆనపర్తి, బిక్కవోలు, కాకినాడ పరిధిలోని పెదపూడి, పెద్దాపురంలోని రంగంపేట మండలాలను విలీనం చేశారు. కొవ్వూరు డివిజన్‌లో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు డివిజన్‌ పరిధిలోని ద్వారకాతిరుమల, నల్లజెర్ల, జంగారెడ్డి గూడెం డివిజన్‌లోని గోపాలపురం మండలాలను విలీనం చేశారు. 


10. పశ్చిమగోదావరి జిల్లా: హెడ్‌ క్వార్టర్‌ భీమవరం

రెవెన్యూ డివిజన్లు: 1. నర్సాపురం, 2. భీమవరం

నర్సాపురం డివిజన్‌లో 8 మండలాలు, భీమవరంలో 11 మండలాలను విలీనం చేశారు.  కొవ్వూరు డివిజన్‌ పరిధిలోని తణుకు, అత్తిలి, ఇరగవరం మండలాలను, నర్సాపురం డివిజన్‌ పరిధిలోని ఉండి, కల్ల, పాలకోడేరు, ఆకివీడు, ఏలూరు డివిజన్‌లోని తాడేపల్లిగూడెం, పెంటపాడు మండలాలను భీమవరం డివిజన్‌లో కలిపారు. 


11. ఏలూరు జిల్లా: హెడ్‌ క్వార్టర్‌ ఏలూరు

రెవెన్యూ డివిజన్లు: 1. ఏలూరు, 2. నూజివీడు, 3. జంగారెడ్డిగూడెం.

ఏలూరులో 12 మండలాలు, నూజివీడులో 6 మండలాలు, జంగారెడ్డి గూడెంలో 9 మండలాలు ఉన్నాయి. కృష్ణాజిల్లా గుడివాడ రెవెన్యూ డివిజన్‌ లోని కైకలూరు, మండవల్లి, కలిదిండి, ముదినేపల్లి మండలాలు, నూజివీడు డివిజన్‌లోని నూజివీడు, ఆగిరిపల్లి, చాట్రాయి, ముసునూరు మండలాలను ఏలూరు రెవెన్యూ డివిజన్‌లో విలీనం చేశారు. పశ్చిమగోదావరిజిల్లా కుకునూరు డివిజన్‌ పరిధిలోని కుకునూరు, వాలరాయిపాడు మండలాలను జంగారెడ్డి గూడెం డివిజన్‌లో కలిపేశారు. 


12. కృష్ణా జిల్లా: హెడ్‌కార్వర్‌ మచిలీపట్నం

రెవెన్యూ డివిజన్లు: 1. మచిలీపట్నం, 2. గుడివాడ

మచిలీపట్నంలో 12 మండలాలు, గుడివాడ డివిజన్‌లో 13 మండలాలను చేర్చారు. గుడివాడ డివిజన్‌లోని నందివాడ, పెద్దపారుపూడి, పామర్రు, పెనమలూరు మండలాలను మచిలీపట్నం డివిజన్‌లో కలిపారు. విజయవాడ డివిజన్‌లోని కంకిపాడు, తోట్లవల్లూరు, ఉయ్యూరు, పమిడిముక్కల మండలాలు, నూజివీడు డివిజన్‌లోని గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరులను గుడివాడ డివిజన్‌లో కలిపారు. 


13. ఎన్టీఆర్‌ జిల్లా: హెడ్‌క్వార్టర్‌ విజయవాడ

రెవెన్యూ డివిజన్లు: 1. నందిగామ. 2. తిరువూరు. 3. విజయవాడ

నందిగామలో 7 మండలాలు, తిరువూరులో 7 మండలాలు, విజయవాడలో 6 మండలాలు ఉన్నాయి. విజయవాడ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని నందిగామ, కంచికచర్ల, చందర్లపాడు, వీరులపాడు, జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాలు నందిగామ డివిజన్‌లో, మైలవరం, జి. కొండూరు మండలాలు తిరువూరు డివిజన్‌లో చేర్చారు. నూజివీడు డివిజన్‌ పరిధిలోని తిరువూరు, విస్సన్నపేట, గంపలగూడెం, ఎ. కొండూరు మండలాలను తిరువూరు డివిజన్‌ పరిధిలోకి తీసుకొచ్చారు. విజయవాడ రూరల్‌తోపాటు, నగరం పరిధిలోని పలు మండలాలు విజయవాడ డివిజన్‌లోనే ఉంచారు. 


14. గుంటూరు జిల్లా: హెడ్‌క్వార్టర్‌ గుంటూరు

రెవెన్యూ డివిజన్లు: 1. గుంటూరు. 2. తెనాలి

గుంటూరులో 10 మండలాలు, తెనాలి డివిజన్‌లో 8 మండలాలు ఉన్నాయి. గుంటూరు డివిజన్‌లోని మంగళగిరి, తాడేపల్లి మండలాలు తెనాలి డివిజన్‌లో కలిపారు. 


15. బాపట్ల జిల్లా: హెడ్‌క్వార్టర్‌ బాపట్ల

రెవెన్యూ డివిజన్లు: 1. బాపట్ల. 2. చీరాల

తెనాలి డివిజన్‌లోని వేమూరు, కొల్లూరు, సుండూరు, భట్టిప్రోలు, అమృతలూరు, రేపల్లె, నిజాంపట్నం, నగరం, చెరుకుపల్లి, బాపట్ల, పిట్టలవానిపాలెం, కర్లపాలెం మండలాలు బాపట్ల  రెవెన్యూ డివిజన్‌లో కలిపారు. కాగా, ప్రకాశం జిల్లా ఒంగోలు డివిజన్‌లోని చీరాల, వేటపాలెం, అద్దంకి, జె.పంగులూరు, సంతమాగులూరు, బల్లికురవ, కొరిసపాడు, పరుచూరు, యద్దనపూడి, కారెంచేడు, ఇంకొల్లు, చినగంజాం, మార్టూరు మండలాలను చీరాల రెవెన్యూ డివిజన్‌లో కలిపారు. 


16. పల్నాడు జిల్లా: హెడ్‌క్వార్టర్‌ నర్సారావుపేట

రెవెన్యూ డివిజన్లు: 1, గురజాల 2, నర్సారావుపేట

గురజాల డివిజన్‌లో 14 మండలాలున్నాయి. గుంటూరు డివిజన్‌లోని పెద్దకూరపాడు, బెల్లంకొండ, అచ్చంపేట, క్రోసూరు, అమరావతిలను గురజాల రెవెన్యూ డివిజన్‌లో కలిపారు. 


17. ప్రకాశం జిల్లా: హెడ్‌క్వార్టర్‌ ఒంగోలు

రెవెన్యూ డివిజన్లు: 1. మార్కాపురం 2. ఒంగోలు 3. పొదిలి

మార్కాపురంలో 13, ఒంగోలులో 12, పొదిలి డివిజన్‌లో కొత్తగా 13 మండలాలను కలిపారు. కందుకూరు రెవెన్యూ డివిజన్‌లోని తరిపాడును మార్కాపురంలో, మర్రిపూడి, కొండపల్లి, జరుగమల్లి, పొన్నలూరు, సింగరాయకొండలను ఒంగోలు డివిజన్‌లో కలిపారు. ఇక, పొదిలి, హనుమంతునిపాడు, వెలిగండ్ల, కనిగిరి, పెదచర్లోపల్లి, చంద్రశేఖరపురం, పామూరు, కొనకనమిట్ల, దర్శి, దొనకొండ, కురిచేడు, ముండ్లమూరు, తాళ్లూరు మండలాలను కొత్తగా ఏర్పాటు చేసిన పొదిలి రెవెన్యూ డివిజన్‌లో కలిపారు. దీంతో కందుకూరు డివిజన్‌ ఉనికి లేకుండా పోయింది. 


18. ఎస్‌పీఎస్‌ నెల్లూరు: హెడ్‌క్వార్టర్‌ నెల్లూరు. 

రెవెన్యూ డివిజన్లు: 1. కావలి 2. నెల్లూరు 3. ఆత్మకూరు

కందుకూరు డివిజన్‌లోని కందుకూరు, లింగసముద్రం, గుడ్లూరు, ఉలవపాడు, వోలేటివారిపాలెం మండలాలను కావలి రెవెన్యూ డివిజన్‌లో కలిపారు. కావలి డివిజన్‌లోని వర్లకుంటపాడు, దుత్తలూరు మండలాలను ఆత్మకూరు డివిజన్‌లో కలిపారు. కావలి డివిజన్‌లో 12, నెల్లూరులో 12, ఆత్మకూరు డివిజన్‌లో 11 మండలాలు ఉన్నాయి. 


19. క ర్నూలు జిల్లా: హెడ్‌క్వార్టర్‌ కర్నూలు

రెవెన్యూ డివిజన్లు: 1. కర్నూలు 2, ఆదోని

కర్నూలులో 11 మండలాలు, ఆదోనిలో 17 మండలాలు ఉన్నాయి. నంద్యాల డివిజన్‌లోని పాణ్యం, గడివేముల మండలాలను కర్నూలు డివిజన్‌లో కలిపారు. 


20. నంద్యాల జిల్లా: హెడ్‌క్వార్టర్‌ నంద్యాల

రెవెన్యూ డివిజన్లు: 1. నంద్యాల 2. డోన్‌ 3. ఆత్మకూరు

నంద్యాల డివిజన్‌లో 9, డోన్‌లో 8, ఆత్మకూరు డివిజన్‌లో 10 మండలాలు ఉన్నాయి. కర్నూలు డివిజన్‌లోని బేతంచర్ల, డోన్‌, పేయేపల్లి మండలాలను నంద్యాల జిల్లాలో కలిపారు. ఇవి కొత్తగా ఏర్పాటైన డోన్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోకి తెచ్చారు. కర్నూలు డివిజన్‌లోని శ్రీశైలం, ఆత్మకూరు, వెలిగోడు, నందికొట్కూరు, పగిడ్యాల, జె.బంగ్లా, కొత్తపల్లి, పాములపాడు, మిడుతూర్‌ మండలాలను ఆత్మకూరు డివిజన్‌లో కలిపారు. 


21. అనంతపురం జిల్లా: హెడ్‌క్వార్టర్‌ అనంతపురం

రెవెన్యూ డివిజన్లు: 1. కల్యాణదుర్గం 2. అనంతపురం 3. గుంతకల్లు

కల్యాణదుర్గంలో 12, అనంతపురంలో 14, గుంతకల్లులో 8 మండలాలు ఉన్నాయి. ధర్మవరం డివిజన్‌లోని రామగిరి మండలాన్ని కల్యాణదుర్గం డివిజన్‌లో కలిపారు. ధర్మవరం డివిజన్‌లోని కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి, రాప్తాడు మండలాలను అనంతపురం డివిజన్‌లో కలిపారు. ఇవి ఇంతకుముందు ధర్మవరం డివిజన్‌లో ఉండేవి. అనంతపురం డివిజన్‌ పరిధిలోని ఉరవకొండ, విడపనగల్లు, వజ్రకరూరు, గుంతకల్లు, గుత్తి, పామిడి, యాడికి, పెద్దవడుగు మండలాలను గుంతకల్లు డివిజన్‌ కిందకు తెచ్చారు. 


22. శ్రీ సత్యసాయి జిల్లా: హెడ్‌క్వార్టర్‌ పుట్టపర్తి

రెవెన్యూ డివిజన్లు: 1. ధర్మవరం 2. పెనుకొండ 3. పుట్టపర్తి 

ధర్మవరంలో 4, పెనుకొండలో 13, పుట్టపర్తిలో 12 మండలాలున్నాయి. ఇంతకుముందు కదిరి డివిజన్‌లో ఉన్న 12 మండలాలను పుట్టపర్తి డివిజన్‌ పరిధిలోకి తీసుకొచ్చారు. 


23. వైఎస్‌ఆర్‌ జిల్లా: హెడ్‌క్వార్టర్‌ వైఎ్‌సఆర్‌

రెవెన్యూ డివిజన్లు: 1. వైఎస్‌ఆర్‌ 2, జమ్మలమడుగు 3. బద్వేలు

వైఎ్‌సఆర్‌లో 10, జమ్మలమడుగులో 12, బద్వేలులో 12 మండలాలున్నాయి. రాజంపేట డివిజన్‌లోని 11 మండలాలను వైఎ్‌సఆర్‌ డివిజన్‌లోని ఖాజీపేట మండలాన్ని బద్వేలు డివిజన్‌లో కలిపారు. 


24. అన్నమయ్య జిల్లా: హెడ్‌క్వార్టర్‌ రాయచోటి

రెవెన్యూ డివిజన్లు: 1. మదనపల్లె 2. రాజంపేట 3. రాయచోటి

మదనపల్లెలో 11 మండలాలు, రాజంపేటలో 11, రాయచోటిలో 10 మండలాలు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో ఉన్న మదనపల్లి డివిజన్‌ను సింహభాగం అన్నమయ్య జిల్లాలో కలిపారు. కడప డివిజన్‌లోని వీరబయలు, టి.సుండుపల్లె మండలాలను రాజంపేట డివిజన్‌లో కలిపారు. కడప డివిజన్‌లోని రాయచోటి, సంబేపల్లె, చిన్నమండం, గాలివీడు, లక్కిరెడ్డిపల్లి, రామాపురం మండలాలు, మదనపల్లి డివిజన్‌లోని పీలేరు, గుర్రంకొండ, కలక్కాడ, కేవీపల్లెలు రాయచోటి డివిజన్‌లో కలిపారు. 


25. చిత్తూరు జిల్లా: హెడ్‌క్వార్టర్‌ చిత్తూరు.

రెవెన్యూ డివిజన్లు: 1. చిత్తూరు. 2. పలమనేరు 

చిత్తూరులో 18 మండలాలు, పలమనేరులో 15 మండలాలున్నాయి. మదనపల్లె డివిజన్‌లోని పలమనేరు, గంగవరం, బైరెడ్డిపల్లె, వి. కోట, పెద్దపంజని, శాంతిపురం, కుప్పం, గుడుపల్లె, రామకుప్పం, రొంపిచెర్ల, సోమల, చౌడిపల్లి, పుంగనూరు, సోడం మండలాలు పలమనేరు డివిజన్‌లో చేర్చారు. తిరుపతి డివిజన్‌లోని పులిచెర్ల మండలాన్ని ఈ డివిజన్‌లో కలిపారు. 


26. శ్రీ బాలజీ జిల్లా: హెడ్‌క్వార్టర్‌ తిరుపతి

రెవెన్యూ డివిజన్లు: 1. గూడూరు 2. తిరుపతి 3. నాయుడుపేట

గూడూరులో 11, తిరుపతిలో 11, నాయుడుపేటలో 13 మండలాలు ఉన్నాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిధిలోని కాలువలోయ, నెల్లూరు డివిజన్‌ పరిధిలోని రాపూరు మండలాలను బాలాజీ జిల్లా గూడూరు రెవెన్యూ డివిజన్‌లో కలిపారు. సూళ్లూరుపేట, ఓజిలి, నాయుడుపేట, పెళ్లకూరు, దొరవారిసత్రం, తడ, తిరుపతి డివిజన్‌ పరిధిలోని శ్రీకాళహస్తి, ఏర్పేడు, తొట్టంబేడు, కేవీబీ పురం, సత్యవేడు, బి.ఎన్‌. కండ్రిగ, వరదయ్యపాలెం మండలాలను నాయుడు పేట డివిజన్‌లో కలిపారు. 


అమరావతి, ఆంధ్రజ్యోతి



Updated Date - 2022-01-27T07:27:01+05:30 IST