కొత్తగా 30 వేల ఓటర్లు

ABN , First Publish Date - 2021-01-25T04:20:25+05:30 IST

ఎన్నికల సంఘం విడుదల చేసిన తాజా జాబితా ప్రకారం జిల్లాలో 18,95,099 మంది ఓటర్లు ఉన్నారు. ఇటీవల కొత్తగా 30 వేల మంది ఓటు హక్కు పొందారు. జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని సోమవారం నుంచి ఇ-ఎపిక్‌ కార్డు డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది.

కొత్తగా 30 వేల ఓటర్లు

నేటి నుంచి ఇ-ఎపిక్‌ కార్డు డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం

కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా జాతీయ ఓటర్ల దినోత్సవ ఏర్పాట్లు

కలెక్టరేట్‌, జనవరి 24: ఎన్నికల సంఘం విడుదల చేసిన తాజా జాబితా ప్రకారం జిల్లాలో 18,95,099 మంది ఓటర్లు ఉన్నారు. ఇటీవల కొత్తగా 30 వేల మంది ఓటు హక్కు పొందారు. జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని సోమవారం నుంచి ఇ-ఎపిక్‌ కార్డు డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. గత ఏడాది ఫిబ్రవరి నెలలో 18,56,000 మంది ఓటర్లు ఉండగా నవంబరు 16న విడుదల చేసిన డ్రాఫ్ట్‌ రోల్‌ ప్రకారం 18,65,266 మంది ఓటర్లు ఉండేవారు. తాజా జాబితా ప్రకారం 18,95099కు చేరారు. అంటే సుమారు 30 వేల మంది కొత్తగా ఓటు హక్కు పొందారు. ఇటీవల నిర్వహించిన ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమంలో 34,277 మంది ఓటు హక్కు పొందగా, వివిధ కారణాల వల్ల 4444 దరఖాస్తులను తిరష్కరించారు. ప్రస్తుతం విడుదల చేసిన జాబితా ప్రకారం జిల్లాలో  9,33,495  మంది పురుషులు, 9,61,464  మంది  మహిళలు ఉన్నారు. పురుషులు కంటే మహిళలు 27,969  మంది అధికంగా ఉన్నారు. విజయనగరం నియోజకవర్గంలో అత్యధికంగా  2,42,309 మంది ఓటర్లు ఉండగా, పార్వతీపురం నియోజకవర్గంలో అత్యల్పంగా 1,88,714 మంది ఓటర్లు ఉన్నారు. 

ఇ-ఎపిక్‌ డౌన్‌ లోడ్‌ 

ప్రత్యేక సమ్మరీ రివిజన్‌ - 2021లో భాగంగా ఇ- ఎపిక్‌ కార్యక్రమాన్ని భారత ఎన్నికల సంఘం సోమవారం ప్రారంభిస్తోంది. ఇ-ఎపిక్‌ ద్వారా కొత్త  ఓటర్లు తమ ఎపిక్‌ (ఓటరు ఫోటో గుర్తింపు కార్డు)ను డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ప్రత్యేక సమ్మరీ రివిజన్‌లో కొత్తగా ఓటరుగా నమోదైనవారు ఈ నెల 25నుంచి 31 వరకూ తమ గుర్తింపు కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. వచ్చే నెల 1 నుంచి ఓటర్ల జాబితాలో ఉన్న ఓటర్లంతా ఇ-ఎపిక్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం ఉంది. 

కొవిడ్‌ నిబంధనల నడుమ

ప్రతి ఏడాది సెప్టెంబరు నుంచి డిసెంబరు వరకూ ప్రత్యేక ఓటర్లు నమోదు చేపట్టి జనవరి రెండో వారంలో తుది జాబితా విడుదల చేసి  25న  ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈసారి జిల్లా వ్యాప్తంగా కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా జాతీయ ఓటర్ల దినోత్సవం వేడుకలు  నిర్వహించేందుకు రెవెన్యూ అధికారులు ఏర్పాట్లు చేశారు. అలాగే సీనియర్‌ ఓటర్లను సన్మానించనున్నారు. కలెక్టరు హరిజవహర్‌లాల్‌ను ఉత్తమ ఎన్నికల అధికారిగా ఎన్నికల సంఘం ఎంపిక చేసింది. ఓటర్ల దినోత్సవం రోజున అవార్డును ప్రదానం చేయనుంది. 



Updated Date - 2021-01-25T04:20:25+05:30 IST