అదనపు కట్నం కోసం వేధింపులు.. గృహిణి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-07-14T16:47:23+05:30 IST

అదనపు కట్నం వేధింపులు తాళలేక గృహిణి ఆత్మహత్య చేసుకుంది. వలిగొండ మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన ధనలక్ష్మి(27)కి, చిట్యాల మండలం, వెలిమినేడు గ్రామానికి చెందిన పబ్బు

అదనపు కట్నం కోసం వేధింపులు.. గృహిణి ఆత్మహత్య

హయత్‌నగర్‌, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): అదనపు కట్నం వేధింపులు తాళలేక గృహిణి ఆత్మహత్య చేసుకుంది. వలిగొండ మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన ధనలక్ష్మి(27)కి, చిట్యాల మండలం, వెలిమినేడు గ్రామానికి చెందిన పబ్బు గోపాల్‌కు 13 ఏళ్ల క్రితం వివాహం అయింది. వివాహ సమయంలో 10 తులాల బంగారం, రూ. 5 లక్షలు ఇచ్చారు. భార్యాభర్తలు ఇద్దరూ హయత్‌నగర్‌ ఇన్ఫర్మేషన్‌ కాలనీలో ఉంటున్నారు. అదనపు కట్నం తీసుకురావాలంటూ గోపాల్‌ భార్యను కొన్నేళ్ల నుంచి వేధిస్తున్నాడు. ధనలక్ష్మి పుట్టింటి వారు వలిగొండ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. కొద్ది రోజులు బాగానే ఉన్న అతడు తర్వాత వేధింపులు ప్రారంభించాడు. పదిరోజుల క్రితం భార్యను కొట్టగా ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమె తల్లిదండ్రులు 4 తులాల బంగారం, లక్ష రూపాయలు ఇచ్చి ధనలక్ష్మిని భర్త వద్దకు పంపించారు. మూడు రోజుల క్రితం గోపాల్‌, అతడి అన్న షెట్టయ్య ఆమెను అదనపు కట్నం తీసుకురావాలని మళ్లీ సతాయించారు. మనస్తాపం చెందిన ధనలక్ష్మి ఆదివారం ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుంది. మృతురాలి తండ్రి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు హయత్‌నగర్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

Updated Date - 2020-07-14T16:47:23+05:30 IST