కులోన్మాద హత్య కేసు : నీరజ్‌కు నివాళి.. కన్నీరుమున్నీరైన సంజన.. బోసిపోయిన బేగంబజార్‌

ABN , First Publish Date - 2022-05-22T19:18:46+05:30 IST

కులోన్మాద హత్యను బేగంబజార్‌ వ్యాపారులంతా ముక్తకంఠంతో

కులోన్మాద హత్య  కేసు : నీరజ్‌కు నివాళి.. కన్నీరుమున్నీరైన సంజన.. బోసిపోయిన బేగంబజార్‌

  • హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ 
  • ‘ఉస్మానియా’లో పోస్టుమార్టం పూర్తి
  • శవయాత్రలో భారీగా వ్యాపారులు

హైదరాబాద్‌ సిటీ/అఫ్జల్‌గంజ్‌ : కులోన్మాద హత్యను బేగంబజార్‌ (Begum Bazar) వ్యాపారులంతా ముక్తకంఠంతో ఖండించారు. హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. నీరజ్‌ కుటుంబానికి న్యాయం చేయాలంటూ వందలాది మంది వ్యాపారులు రోడ్డుమీదకు వచ్చారు. ప్లకార్డులు పట్టుకొని ధర్నా నిర్వహించారు. హత్యకు నిరసనగా వ్యాపారులంతా దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేసి శనివారం బంద్‌ పాటించారు. దాంతో నిత్యం రద్దీగా ఉండే బేగంబజార్‌ బోసిపోయింది. నీరజ్‌ మృతదేహానికి ఉస్మానియాలో పోస్టుమార్టం పూర్తయిన తర్వాత సాయంత్రం 5గంటలకు మృతదేహన్ని బేగంబజార్‌ కోల్సావాడి నివాసానికి తరలించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, భార్య సంజన నీరజ్‌ భౌతికకాయంపై పడి కన్నీరుమున్నీరుగా విలపించారు. అనంతరం ఇంటి నుంచి బేగంబజార్‌, కోల్సావాడీ, బేగంబజార్‌ ఛత్రి తదితర ప్రాంతాల మీదుగా గౌలిగూడ ఇమ్లిబన్‌లో హిందూ శ్మశాన వాటికకు అంతిమయాత్ర చేరుకుంది. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా బలగాలను మోహరించారు.


నెల క్రితమే ఇంటికి.. 

అకారణంగా నా కొడుకును పొట్టన పెట్టుకున్న నిందితులను కఠినంగా శిక్షించాలి. ప్రభుత్వం కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలి. ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే పోలీసులు నిందితులను పట్టుకోవడం సంతోషం. అయితే తమకు జరిగిన నష్టం ఎవరికీ జరగకుండా ఉండాలంటే నిందితులను న్యాయస్థానం వెంటనే ఉరి తీయాలి. నా కొడుకును చంపుతారనే భయంతోనే పెళ్లైన తర్వాత కొన్ని నెలలు బంధువుల ఇంట్లో పెట్టాం. నెల రోజుల క్రితమే ఇక్కడికి వచ్చి ఈ రోజు శవమై కనిపించాడు.- రాజేందర్‌ ప్రసాద్‌ పన్వార్‌ (మృతుడి తండ్రి).


కళ్లెదుటే హతమార్చారు..

నేను, నా మనవడు ద్విచక్ర వాహనంపై వ్యాపార డబ్బులు తీసుకొని వస్తుండగా ఐదుగురు దుండుగులు ఎదురుగా వచ్చి ఢీకొట్టారు. కత్తులు, రాడ్‌లతో దాడి చేసి హత్య చేశారు. చంపొద్దంటూ ప్రాధేయపడినా కనికరించకుండా కత్తితో ఎడమ చేతిపై దాడి చేశారు. దీంతో నేను కిందపడిపోయాను. లేచి చూసేసరికి మనవడు రక్తపు మడుగులో చనిపోయి ఉన్నాడు. - తాత జగదీష్‌ ప్రసాద్‌ పన్వార్‌.


కఠినంగా శిక్షించాలి..

నీరజ్‌ను దారుణంగా హత్య చేసి సంజన కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశారు. పుట్టిన మూడు నెలల బాబుకు తండ్రి లేకుండా చేశారు. ప్రభుత్వం సంజన కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటుంది. నిందితులను ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా వెంటనే ఉరి తీసేలా మంత్రులు కేటీఆర్‌, మహమూద్‌ అలీలతో మాట్లాడి బాధిత కుటుంబానికి  న్యాయం చేస్తా. - పూజ వ్యాస్‌ బిలాల్‌,  టీఆర్‌ఎస్‌ మహిళా నాయకురాలు.


ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా శిక్ష వేయాలి

ఇద్దరూ మేజర్లే.. ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నారు. కొడుకు పుట్టాడన్న సంతోషంలో ఉన్న కుటుంబాన్ని హత్య చేసి చిన్నాభిన్నం చేశారు. ఈ కుటుంబానికి పట్టిన గతి ఏ కుటుంబానికి పట్టకుండా ఉండాలంటే ప్రభుత్వం వెంటనే ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేసి నిందితులను ఉరి తీయాలి. అప్పుడే సంజన కుటుంబానికి న్యాయం జరుగుతుంది. - జీవన్‌లాల్‌ బాటి (బేగంబజార్‌ కిరాణా మర్చంట్‌ అసోసియేషన్‌ అడ్వయిజర్‌).


హత్యతో మాకు సంబంధంలేదు

మా అల్లుడు నీరజ్‌ను మేం చంపలేదు. ఈ హత్యతో మాకు ఎలాంటి సంబంధంలేదు. ఎవరో కావాలనే కక్షగట్టి మా కూతురు సంసారాన్ని నాశనం చేశారు. మాకు ఇష్టంలేని పెళ్లి చేసుకుందని మేం కోపంగా ఉన్న మాట నిజమే కానీ.. నీరజ్‌ను నా కొడుకు గానీ, నా బావ కొడుకులు గానీ చంపలేదు. హత్య జరిగిన సమయంలో అందరం ఇంట్లోనే ఉన్నాం. కొడుకు పుట్టాడని తెలిసినప్పటి నుంచి ఫోన్‌లో సంజనతో మాట్లాడుతున్నాం. - సంజన తల్లి

Updated Date - 2022-05-22T19:18:46+05:30 IST