Cantonment Board : తీరనున్న మూసి‘వెతలు’.. కేటీఆర్‌ సూచనతో రంగంలోకి.. ఏం జరుగుతుందో..!?

ABN , First Publish Date - 2022-05-10T16:23:34+05:30 IST

తీరనున్న మూసి‘వెతలు’.. కేటీఆర్‌ సూచనతో రంగంలోకి.. ఏం జరుగుతుందో..!?

Cantonment Board : తీరనున్న మూసి‘వెతలు’.. కేటీఆర్‌ సూచనతో రంగంలోకి.. ఏం జరుగుతుందో..!?

  • కంటోన్మెంట్‌లో ప్రత్యామ్నాయ రోడ్లకు ఎల్‌ఎంఏ ఓకే
  • సమాన విలువైన భూమి ఇవ్వాలని షరతు
  • క్షేత్రస్థాయి పరిస్థితులు పరిశీలించిన ఉన్నతాధికారుల బృందం
  • మంత్రి కేటీఆర్‌ సూచనతో రంగంలోకి..
  • సర్కారు కోర్టులో బంతి ప్రభుత్వ నిర్ణయం ఏమిటో..?


హైదరాబాద్‌ సిటీ : కంటోన్మెంట్‌ బోర్డు (Cantonment Board) పరిధిలో రోడ్ల మూసివేత ఇబ్బందులకు చెక్‌ పడనుందా..? ఆ మార్గాల్లో రాకపోకలు సాగించే ప్రయాణికులకు చిక్కులు తప్పనున్నాయా..? ప్రత్యామ్నాయ మార్గాల నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయా..? అంటే అవుననే చెబుతున్నాయి జీహెచ్‌ఎంసీ వర్గాలు. ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణానికి భూములిచ్చేందుకు లోకల్‌ మిలిటరీ అథారిటీ (ఎల్‌ఎంఏ)అధికారులు సానుకూలత వ్యక్తం చేశారని ఉన్నతాధికారులు తెలిపారు. కాకపోతే.. సేకరిస్తున్న ఆస్తులకు సమాన విలువైన భూములను మరో చోట కేటాయించాలని షరతు పెట్టారు. భూ కేటాయింపు జరిగిన వెంటనే పనులు చేసుకోవచ్చని క్షేత్రస్థాయి పర్యటన సందర్భంగా ఆర్మీ అధికారులు స్పష్టం చేసినట్టు తెలిసింది.


ఆర్మీ ఆర్డినెన్స్‌ సర్కిల్‌(AOC)లో వెల్లింగ్టన్‌, గఫ్‌ రోడ్లు ప్రధానమైనవి. భద్రతా కారణాల దృష్ట్యా ఎల్‌ఎంఏ అధికారులు తరచూ వీటిని మూసివేస్తున్నారు. గుర్తింపు కార్డులు చూసి రోడ్లపై వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. దీంతో సికింద్రాబాద్‌ (Secunderabad) వైపు నుంచి కుషాయిగూడ, నేరేడ్‌మెట్‌, మల్కాజ్‌గిరి, ఏఎస్‌రావునగర్‌, తిరుమలగిరి తదితర ప్రాంతాలకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్ల మూసివేతతో మూడు నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరం అదనంగా ప్రయాణించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఎల్‌ఎంఏ అధికారుల తీరుపై పలుమార్లు ఆయా ప్రాంతాలవాసులు నిరసన, సంతకాల సేకరణ చేపట్టారు. ఈ నేపథ్యంలో భద్రతాపరమైన ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ రహదారుల నిర్మాణాన్ని జీహెచ్‌ఎంసీ (GHMC) ప్రతిపాదించింది. భూసేకరణ సమస్యలతో దాదాపు ఏడాదిన్నరగా రోడ్ల నిర్మాణంలో ముందడుగు పడలేదు. గత నెలలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఎల్‌ఎంఏ ఉన్నతాధికారులతో సమావేశమై ఈ సమస్యపై చర్చించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి.. తగిన నిర్ణయం తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, ఎల్‌ఎంఏ అధికారులకు సూచించారు. దీంతో ఇటీవల బోర్డు పరిధిలో ఉన్నతాధికారుల బృందం పర్యటించింది. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో రోడ్ల నిర్మాణ పనులు చేసుకునేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ (Green Signal) ఇచ్చినట్టు ఓ అధికారి తెలిపారు.


42 ఎకరాలు.. రూ.450 కోట్లు..

ఆర్మీ ఆర్డినెన్స్‌ సర్కిల్‌ రోడ్లలోకి వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రత్యామ్నాయ రహదారుల (Roads) నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మారేడ్‌పల్లిలోని సికింద్రాబాద్‌ క్లబ్‌ వెనుక వైపు నుంచి ఆర్మీ భూముల గుండా ఆర్‌కే పురం, సైనిక్‌పురి వైపు 8.1 కి.మీల మేర నాలుగు లేన్ల రహదారి నిర్మించేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు.  ఓ చోట అరకిలోమీటర్‌ మేర వంతెన నిర్మించే ప్రతిపాదనా డిజైన్‌లో ఉంది. ఇందుకు రూ.400 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఎల్‌ఎంఏకు చెందిన 42 ఎకరాల భూమిని రోడ్ల నిర్మాణం కోసం సేకరించాలి. ఈ భూమి విలువ 400 కోట్ల నుంచి 450 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. నగర శివార్లలో అంత విలువైన భూమి ఎక్కడ అందుబాటులో ఉందన్నది సర్కారీ శాఖలు పరిశీలిస్తున్నాయి. గతంలో పరిహారం చెల్లింపు, భూకేటాయింపునకు వెనక్కి తగ్గిన ప్రభుత్వం ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

Read more