11 కోట్ల మోసం కేసులో కొత్త కోణాలు..

ABN , First Publish Date - 2021-02-27T15:52:31+05:30 IST

‘‘అక్కా నన్ను క్షమించు.. మాయలాడి ప్రేమ మైకం నన్ను కమ్మేసింది. ఆ మత్తులో పడి దారి తప్పాను. తేరుకునేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

11 కోట్ల మోసం కేసులో కొత్త కోణాలు..

  • నన్ను క్షమించు అక్కా!
  • ప్రేమ మైకంలో మిమ్మల్ని మోసం చేశా..
  • ఆత్మహత్యకు ముందు వీరారెడ్డి భార్యకు విజయ్‌కుమార్‌ ఫోన్‌
  • వద్దని వారించిన వీరారెడ్డి భార్య
  • పోలీసుల చేతికి కాల్‌ రికార్డులు 

హైదరాబాద్ : ‘‘అక్కా నన్ను క్షమించు.. మాయలాడి ప్రేమ మైకం నన్ను కమ్మేసింది. ఆ మత్తులో పడి దారి తప్పాను. తేరుకునేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అందుకే పశ్చాతాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నా. నీకు నా ముఖం చూపించలేను. సమాజంలో తలెత్తుకొని బతకలేను. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను’’.. ఇటీవల సంచలనం సృష్టించిన రూ. 11కోట్ల మోసం కేసులో ఆత్మహత్య చేసుకున్న విజయ్‌కుమార్‌ రెడ్డి చివరి సంభాషణ ఇది. ఈ నెల 24న బాచుపల్లిలో పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని నిజాంపేట్‌లో ఘరానా కి‘లేడీ’ మోసం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు విజయ్‌కుమార్‌రెడ్డి తన ఆత్మహత్యకు ముందు బాధితుడి భార్యకు ఫోన్‌ చేసి ఆ విషయాన్ని తెలిపాడు. పోలీసుల విచారణలో ఆడియో కాల్‌ రికార్డుల ఆధారంగా ఈ విషయం వెలుగుచూసింది. 


రూ. 10.60కోట్లు కొల్లగొట్టిన జంట..

కడప జిల్లాకు చెందిన శిరీష అలియాస్‌ స్మృతి సిన్హా, విజయ్‌కుమార్‌రెడ్డికి నగరంలో పరిచయమైంది. అది సహజీవనం వరకూ వెళ్లింది. ఇద్దరికీ విలాసవంతమైన జీవితం పట్ల సరదా. అయితే.. విజయ్‌ను పావుగా వాడుకుని రూ. కోట్లు సంపాదించాలని శిరీష పథకం రచించింది. అప్పటికే తనకు పిల్లలున్నా.. వాళ్లను తన అక్క పిల్లలుగా నమ్మించి, విజయ్‌కు దగ్గరైంది. నిజాంపేటలోని ప్రణవ్‌ అంటీలియా విల్లాలో విజయ్‌తో కలిసి అద్దెకు దిగింది. అక్కడ వారి పక్క విల్లాలో ఉంటున్న మైనింగ్‌ వ్యాపారి వీరారెడ్డితో వీరికి పరిచయమైంది. విజయ్‌ను ఐపీఎస్‌ అధికారిగా, తాను మానవహక్కుల కమిషన్‌(హెచ్‌ఆర్‌సీ) దక్షిణభారత చైర్మన్‌గా వీరారెడ్డిని నమ్మించింది. విజయ్‌ కూడా ఆమె చెప్పినట్లే నడుచుకున్నాడు. కడపలో తమకు 72 వోల్వా బస్సులు, 50 ఎకరాల పొలం ఉందని ఇద్దరూ గొప్పగా చెప్పుకొన్నారు. 


వీరారెడ్డి స్వస్థలం కూడా కడప జిల్లా కావడం, అందరూ ఒకే సామాజిక వర్గం కావడంతో అతడు వారిని విశ్వసించాడు. మైనింగ్‌ (క్రషర్‌ బిజినెస్‌) వ్యాపారం చేస్తున్న వీరారెడ్డి కోటీశ్వరుడని తెలిసి అతని నుంచి డబ్బు లాగేందుకు శిరీష పక్కా స్కెచ్‌ వేసింది. వీరారెడ్డి బావమరిదికి రూ. 90కోట్లు కట్నమిచ్చే అమ్మాయితో సంబంధం కుదురుస్తామని, తక్కువ ధరకు కడపలో పొలాలు కొనుగోలు చేయిస్తామని నమ్మబలికింది. వారిని నమ్మి, వారు అడిగినప్పుడల్లా వీరారెడ్డి డబ్బు ఇచ్చాడు. ఇలా మొత్తం రూ. 10.60కోట్లను రెండేళ్లలో శిరీష, విజయ్‌ కొల్లగొట్టారు. ఆ డబ్బుతో విలాసాలను అనుభవించారు. శంషాబాద్‌ పరిధిలోని ఓ లగ్జరీ హోటల్‌లో, వైజాగ్‌లో రోజుకు రూ. లక్ష చెల్లిస్తూ 50 రోజుల పాటు వేడుకలు చేసుకున్నారు. రూ. కోట్లు విలువైన కార్లు, రూ. లక్షల విలువైన బంగారం, పటాన్‌చెరు ప్రాంతంలో రూ. కోటిన్నరతో విల్లా కొనుగోలు చేశారు. శిరీష మైకంలో పడిన విజయ్‌ కుమార్‌.. ఆమె చెప్పినట్లే చేస్తూ వీరారెడ్డిని మోసం చేశాడు.


పశ్చాత్తాపంతో ఆత్మహత్య

ఏ మోసమూ ఎల్లకాలం సాగదు. ఎట్టకేలకు శిరీష-విజయ్‌ల బాగోతం వీరారెడ్డికి స్నేహితుల ద్వారా తెలిసింది. దీంతో తన డబ్బు తిరిగివ్వాలని  వారిని హెచ్చరించాడు. దీంతో విజయ్‌కు ఏం పాలుపోలేదు. మరోవైపు.. శిరీష పిల్లల విషయంలో తనకు అబద్ధం చెప్పి తనను వాడుకుందని అతడికి అర్ధమైంది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో పశ్చాత్తాపంతో బాధపడిన విజయ్‌, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. అయితే.. అంతకంటే ముందు వీరారెడ్డి భార్యకు ఫోన్‌ చేసి క్షమాపణ కోరాడు. అతడి ఆత్మహత్య నిర్ణయం విని వీరారెడ్డి భార్య వారించింది. ‘‘నువ్వు చనిపోవద్దు తమ్ముడూ! నిన్ను ఇలా చేసిన వారిని వదలొద్దు. మాయలేడి చేతికి చిక్కి మోసపోయిన నువ్వు చనిపోతే, మాకు ఎలా న్యాయం జరుగుతుంది. ధైర్యంగా, మగాడిలా మా డబ్బులు మాకు వచ్చేలా చెయ్‌. అంతేకాని ఆత్మహత్య చేసుకోవద్దు’’ అని ఆమె హితవు చెప్పింది. అయినప్పటికీ విజయ్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. 


ఈ సంభాషణకు సంబంధించిన కాల్‌ రికార్డ్స్‌ సైబారాబాద్‌ పోలీసుల చేతికి వచ్చాయి. మరోవైపు వీరారెడ్డికి అంతకుముందు పెద్దవాళ్లతో పరిచయాలు లేనట్లు పోలీసులు తెలిపారు. శిరీ్‌ష-విజయ్‌ల పరిచయంతో సమాజంలో తనకూ పలుకుబడి పెరుగుతుందని భావించి, వారు అడిగినంతా ముట్టచెప్పాడని వివరించారు. వారి మోసానికి వీరారెడ్డి స్వార్థం తోడవడంతో కథ ఇంత దూరం వచ్చిందని పేర్కొన్నారు. మరోవైపు.. శిరీష బాధితులు ఇంకా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె పోలీసులకు చిక్కడంతో.. ఆమె చేతిలో మోసపోయిన వారంతా పోలీసుల్ని ఆశ్రయిస్తున్నట్లు సమాచారం. మొత్తంగా బాధితులు పదుల సంఖ్యలోనే ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.


కస్టడీకి నిందితులు

శిరీష సహా అరెస్టు చేసిన నిందితులందరినీ బాచుపల్లి పోలీసులు మరోసారి విచారించనున్నారు. ఈ మేరకు కోర్టులో కస్టడీ పిటిషన్‌ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. శిరీష అలియాస్‌ స్మృతి సిన్హా ఇప్పటి వరకు ఎంతమందిని మోసం చేసింది..? ఖరీదైన కార్లు, రూ. లక్షల విలువైన బంగారం, పటాన్‌చెరులో రూ. కోటిన్నర విల్లా, బ్యాంకు ఖాతాల్లో డబ్బు.. ఇలా మొత్తంగా సుమారు రూ. 5.50కోట్ల చేతిలో ఉన్నప్పటికీ విజయ్‌ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది, అతడి మృతి వెనుక ఏదైనా కుట్ర దాగి ఉందా, అన్న ప్రశ్నలకు సమాధానాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

Updated Date - 2021-02-27T15:52:31+05:30 IST